=తొలిసారిగా అధ్యక్షురాలిగా మహిళ
=రెండు స్థానాల్లో ఏబీవీపీ, ఒక స్థానంలో యూడీఏ కూటమి విజయం
=ఫలితాలపై తిరస్కరణ ఓటు ప్రభావం
సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ మరోమారు విజయం కేతనం ఎగురవేసింది. కీలకమైన మూడు పదవుల్లో జెండా ఎగురవేసింది. 34 సంవత్సరాల హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవికి ఎన్నికైంది.
ఎన్నికల్లో 4,626 ఓట్లకుగాను 3738 ఓట్లు పోలయ్యాయి. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష అభ్యర్థి శిరీష 1197 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి ఉదయ్‌పై 79 ఓట్ల తేడాతో విజయం సాధించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన వి. శిరీష యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్) చదువుతోంది. ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎఫ్‌ఐ అభ్యర్థి సందీప్‌కుమార్ 1174 ఓట్లు, సంయుక్త కార్యదర్శిగా ఎస్‌ఎఫ్‌ఐ అభ్యర్థి ఆదిత్య హరీష్ 1283 ఓట్లతో విజయం సాధించారు.
సాంస్కృతిక కార్యదర్శిగా ఏబీవీపీకి చెందిన స్వాతి వీఎం 1272 ఓట్లతో, క్రీడల కార్యదర్శిగా ఏబీవీపీ అభ్యర్థి కృష్ణచైతన్య 1221 ఓట్లతో విజయం సాధించారు. యునెటైడ్ డెమొక్రటిక్ అలయన్స్(యూడీఏ) కూటమికి చెందిన మణికంఠ ఉపాధ్యక్షులుగా 1189 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐలు ఒంటరిగా పోటీ చేయగా.. ఏఎస్‌ఏ, టీఎస్‌ఏ, టీఎస్‌ఎఫ్, ఎంఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ సంఘాలు యూడీఏ పేరిట బరిలో నిలిచాయి.
తొలిసారిగా నమోదైన తిరస్కరణ ఓట్లు
ఫలితాలపై తిరస్కరణ ఓట్లు ప్రభావం చూపాయి. ఆరు పదవుల్లో తిరస్కరణ ఓట్ల కారణంగానే మెజార్టీ గణనీయంగా తగ్గింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ దేశంలోనే తొలిసారిగా హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు విధానాన్ని వర్సిటీ అధికారులు అమలు చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం పోలైన 3738 ఓట్లలో అధ్యక్ష పదవికి 87, ఉపాధ్యక్ష పదవికి 146, ప్రధాన కార్యదర్శికి 137, సంయుక్త కార్యదర్శికి 200, సాంస్కృతిక కార్యదర్శికి 172, క్రీడల కార్యదర్శికి 167 తిరస్కరణ ఓట్లు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. తమకు నచ్చని అభ్యర్థులకు తిరస్కరణ ఓటు వారి విజయంపై ప్రభావాన్ని చూపింది.
గర్వంగా ఉంది
హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో నన్ను తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం పట్ల గర్వంగా ఉంది. దీని ద్వారా విద్యార్థినుల సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. 34 సంవత్సరాల హెచ్‌సీయూ చరిత్రలో నాకు గౌరవం దక్కడం చాలా సంతోషాన్ని ఇస్తోంది.
- శిరీష, హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు