75 సంవత్సరాల తర్వాత.. | Hindu Kumbh takes place in Kashmir after 75 years | Sakshi
Sakshi News home page

75 సంవత్సరాల తర్వాత..

Published Tue, Jun 14 2016 7:02 PM | Last Updated on Thu, Mar 28 2019 6:13 PM

75 సంవత్సరాల తర్వాత.. - Sakshi

75 సంవత్సరాల తర్వాత..

కాశ్మీర్ లోయ హిందూ భక్తజన సందోహంతో కళకళలాడింది. 75 సంవత్సరాల తర్వాత అక్కడ అంగరంగ వైభవంగా  కుంభమేళా నిర్వహించారు. కాశ్మీరీ పండిట్ల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో లోయకు తిరిగివచ్చిన కాశ్మీరీ పండితులకు స్థానిక ముస్లింలు ప్రత్యేక సహాయ సహకారాలు అందించి,  మొదటి పవిత్ర కుంభ మేళా నిర్వహించారు. ఈ  పుణ్యతీర్థానికి వేలకొద్దీ కాశ్మీరీ పండితులు తరలి వచ్చారు.  షాదిపోరా ప్రాంతంలో జరిగిన కాశ్మీరీ హిందూ కమ్యూనిటీకి చెందిన ఈ  మత సంబంధమైన దశ్హార్ కుంభమేళాకు  ముస్లిం మతస్థులు ప్రత్యేక సహాయం అందించడంతో భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రంజాన్ మాసంలో కాశ్మీర్ వ్యాలీలో నిర్వహించే  కుంభమేళా చరిత్రాత్మకంగా మారింది. హిందువుల దైవసంబంధిత కార్యమైన కుంభమేళా కార్యక్రమాన్ని75 ఏళ్ళ తర్వాత షాదిపోరాలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ముస్లింల సహాయంతో ఐకమత్యంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలకొద్దీ కాశ్మీరీ పండితులు గండెర్బల్ ప్రాంతానికి తరలి వచ్చారు. జెహ్లుమ్, సింథ్ నదుల సంగమమైన పవిత్ర స్థలంలో ఈ ప్రత్యేక కుంభమేళా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి చరిత్రను సృష్టించారు. 75 సంవత్సరాల తర్వాత ఎంతో ఘనంగా జరిగిన వేడుకను చూడటం ఈ తరంలో పుట్టిన తమకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, అక్కడకు వచ్చిన యువ భక్తులు చెప్తున్నారు.

పండిట్లకు ప్రత్యేక రక్షణ పేరుతో రాష్ట్రంలోనే మరో రాష్ట్రం సృష్టించాలన్న ప్రభుత్వ ఆలోచనపై లోయలోని కొందరు పండితులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో... కాశ్మీరీ పండితులు, స్థానిక ముస్లింలు ఐకమత్యంతో కుంభమేళా నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం సెపరేట్ కాలనీల గురించి ఎందుకు మాట్లాడుతోందో తెలియడం లేదని, 75 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడి ముస్లింలు అంతా భుజం భుజం కలిపి కుంభమేళా నిర్వహించారని, ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గమనించడం లేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పుణ్యతీర్థానికి వచ్చిన వారికి ముస్లింలంతా పూలను ఇచ్చి సాదరంగా ఆహ్వానించారని, నదిని దాటేందుకు తమ పడవలతో సహకరించారని చెప్తున్నారు. దయచేసి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టవద్దని ఇక్కడితో ఇటువంటి విదాదాలకు స్వస్తి చెప్పాలని ఈ సందర్భంలో కాశ్మీరీ పండిట్ మహరాజ్ క్రిషన్ భట్ సూచించారు. ముస్లింల మనోభావాలు కుంభమేళా సందర్భంలో ప్రతిధ్వనించాయని, ఫరూక్ అహ్మద్ అనే వ్యక్తి రంజాన్ సందర్భంగా రోజంతా ఉపవాసంతో ఉన్నప్పటికీ పడవ దాటే భక్తులకు సహాయం అందించి ఐకమత్యాన్ని చాటాడని క్రిషన్ భట్ అన్నారు. రెండునదుల సంగమంలో ప్రయాగగా పిలిచే స్థలంలోని ఛినార్ అనే చెట్టువద్దకు భక్తులను చేర్చడమే ధ్యేయంగా ఫరూక్ సేవలు అందించాడని, భక్తులు ఆ పుణ్యతీర్థానికి చేరేందుకు అనేక విధాలుగా అతడు సహకరిస్తున్నాడని పండిట్ మహరాజ్ చెప్తున్నారు.

తాము అన్నివిధాలుగా కుంభమేళా భక్తులకు సహకరిస్తున్నామని, ఈ సందర్భంగా వచ్చిన భక్తులు సైతం గత కొన్నిరోజులుగా  తమ ఇళ్ళలోనే ఉంటున్నారని ఫరూఖ్ అహ్మద్ చెప్తున్నాడు. 1941 జూన్ 4 న మహరాజా హరిసింగ్ జమ్మూకాశ్మీర్ ను పాలిస్తున్న సమయంలో  నిర్వహించిన కుంభమేళా సమయంలో ఇక్కడ తమ పూర్వీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారని అప్పట్లో ఉపవాసాలతో ఉన్న ముస్లింలు వారికి ఎంతో సహకరించారని, 75 ఏళ్ళ తర్వాత తిరిగి నిర్వహిస్తున్న ఈ కుంభమేళాకు తరలి వచ్చిన వేలాదిమంది భక్తులకు అందిన సహకారం చూస్తే అప్పటి సోదర భావం, మతసామరస్యం సజీవంగా ఉన్నట్లు కనిపించాయని అందుకు స్థానికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని భక్తులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement