ఆత్మహత్యకు పాల్పడిన బీకాం విద్యార్థిని ధన్య శ్రీ (ఫైల్ ఫొటో)
బెంగుళూరు : ‘ఐ లవ్ ముస్లిమ్స్’ అని వాట్సాప్‌లో మెసేజ్ చేసినందుకు 20 ఏళ్ల అమ్మాయిని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన ఘటన చిక్‌మంగుళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసులో స్థానిక బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధన్య శ్రీ(20) చిక్‌మంగుళూరుకు చేరువలో గల ముడిగెరె పట్టణంలో బీకాం చదువుతోంది.
శనివారం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంతోష్ అనే స్నేహితుడితో వాట్సాప్‌లో చెలరేగిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. చాట్‌లో కులం, మతాల ప్రస్తావన రావడంతో ఇరువురి మధ్య గొడవ చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా ‘నేను ముస్లింలను ప్రేమిస్తున్నాను’ అని ధన్య సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. దాంతో కోపోద్రేకుడైన సంతోష్.. ముస్లింలతో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించాడని చెప్పారు.
అనంతరం ధన్యతో జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్లను స్థానిక భజరంగ్ దళ్, విహెచ్‌పీ సభ్యులకు పంపినట్లు తెలిపారు. ఆ స్క్రీన్ షాట్లు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ధన్య మానసికంగా కుంగిపోయినట్లు చెప్పారు. ధన్య ఇంటికి వెళ్లిన ముడిగెరె పట్టణ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు అనిల్ రాజ్.. ముస్లింలతో స్నేహంగా ఉండటంపై తల్లిదండ్రులను హెచ్చరించినట్లు తెలిపారు.
ఆ మరుసటి రోజే ధన్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. ఈ ఘటన తన జీవితాన్ని, చదువును నాశనం చేసిందని ధన్య శ్రీ సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న సంతోష్, మరో ముగ్గురి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment