Dhanya
-
ఆ ఒక్క కామెంట్ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది..!
21 ఏళ్ల ధన్య సోజన్ వధువుగా నటించిన యాడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలీవుడ్ పర్సనాలిటీలతో మొదలు అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఎందుకు? ధన్య చావుతో పోరాడుతోంది. చావును గెలవాలనుకుంటోంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి, వెంట్రుకలు పూర్తిగా కోల్పోయిన స్థితి నుంచి అందమైన పెళ్లికూతురిగా మారడం ఇటీవలి గొప్ప కుతూహలపు కథ. 28 ఆగస్టు 2019లో ధన్య సోజన్ టొరెంటో (కెనడా)లో దిగింది. అక్కడ రెండేళ్లు పోస్ట్ డిప్లమో కోర్సు ఆమె చదవాలి. కేరళ ఇడుక్కి జిల్లాలోని తోడపుజ అనే చిన్న టౌన్ ఆమెది. తండ్రి జోసఫ్ మిల్క్‌బూత్ నడుపుతాడు. తల్లి శాంతి గృహిణి. హైస్కూల్లో చదివే ఒక తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న ధన్య బాగా చదువుకుని కెనడాలో సీటు సంపాదించుకుంది. కొన్ని నెలలు బాగా జరిగాయి. సెమిస్టర్లు రాసింది. కాని 2020 ఆగస్టు నాటికి ఆమె వూరికూరికే స్పృహ తప్పి పడిపోవడం మొదలెట్టింది. అక్కడి డాక్టర్లు చూసి మొదట నిమోనియా అనుకున్నారు. కాని రిపోర్టులు చూసి ఆమెకు ‘కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’ ఉందని తేల్చారు. ప్రమాదకరమైన గుండెజబ్బు. ఏ క్షణం ఏమైనా కావచ్చు. గుండె మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ధన్య. ఊరుగాని ఊరు. దేశం కాని దేశం. ఇప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్ రోజులు 20 ఏళ్ల హుషారైన అమ్మాయి ధన్య. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఎన్ని రోజులు ఉండాలో తెలియదు. ఆమెకు ఆక్సిజన్ సరిగా అందడం లేదు. జుట్టు కొన్నాళ్లు నిలవదని చెప్పారు. ఉన్న జుట్టును పూర్తిగా తొలగించారు. ఆమె స్టూడెంట్ వీసా మీద రావడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగించుకునే వీలు లేదు. అలాగని ఇంటినుంచి డబ్బు తెప్పించుకోలేదు. దారుణమైన పరిస్థితిలో పడింది ధన్య. అదృష్టం... ఆమె చేరిన హాస్పిటల్లో కేరళ నుంచి వచ్చిన నర్స్‌లు పని చేస్తున్నారు. వారు ధన్యను ఆదుకున్నారు. ధైర్యం చెప్పారు. ధన్య పరిస్థితిని టొరెంటోలో ఉన్న మలయాళీ సంఘం ‘హృదయపూర్వం’కు తెలియచేశారు. హృదయపూర్వం వెంటనే ధన్య కోసం ఫండ్ రైజింగ్ మొదలెట్టింది. దాదాపు లక్షన్నర డాలర్లు (కోటి రూపాయలు) కలెక్ట్ అయ్యాయి. హాస్పిటల్ బిల్ అందులో నుంచే కట్టారు. అయితే సమస్య అదుపులో ఉంది కాని ట్రీట్మెంట్ కొనసాగాల్సి ఉంది. ఇండియాలో ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పారు. ఈలోపు హాస్పిటల్, యూనివర్సిటీ వాళ్ల సహకారం వల్ల హాస్పిటల్ నుంచి ఎగ్జామ్స్ రాసి పాసయ్యింది ధన్య. మార్చి వరకూ ఉంటే వర్క్ వీసాకు అర్హత వస్తుందని అప్పటి వరకూ అక్కడే ఉండి కొచ్చి చేరుకుంది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు వెళ్లి అడ్మిట్ అయ్యింది ధన్య. మెరుపు కలలు ధన్య ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా మెరుపు కలలు కనడం మానలేదు. ఆమెకు మోడలింగ్ చేయాలని కోరిక. అలాగే పాటలకు డాన్స్ చేయడం కూడా సరదా. హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ బోర్ పోయేందుకు కొన్ని సినిమా పాటలకు చేతులు కదిలించి డాన్స్ చేసి ఆ వీడియోలు రిలీజ్ చేసింది. అవి ఇన్స్టాంట్ హిట్ అయ్యాయి. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి నటులు ఆమె స్థితిని తెలుసుకుని ఆ స్థితిలో కూడా అంత హుషారుగా ఉన్నందుకు మెచ్చుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మలుపుతిప్పిన ఘడియ కొచ్చి చేరుకుని వైద్యం తీసుకుంటున్న ధన్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మలబార్ గోల్డ్’ వారి ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ యాడ్ కాంపెయిన్ ప్రకటన కనిపించింది. ‘మీకు పెళ్లికూతురిలా కనిపించాలని ఉందా’ అనే ప్రశ్నకు 7000 మంది యువతులు ‘అవును’ అని ఉత్సాహపడి సమాధానం ఇచ్చారు. ధన్య కూడా ఇచ్చింది. ఆ సంగతి మర్చిపోయింది. కాని కొన్నాళ్లకు మలబార్ గోల్డ్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. తమ ప్రకటనల్లో కేరళ వధువుగా కనిపించమని వారు కోరారు. ధన్య సంతోషానికి అవధులు లేవు. కేరళ క్రిస్టియన్ వధువుగా తెల్లగౌన్లో కనిపించడానికి అందుకు తగ్గ షూట్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. మలబార్‌గోల్డ్ ఈ షూట్ కోసం అసలు సిసలు వజ్రాల నెక్లెస్‌ను వాడటానికి పంపింది. దానిని ధరించిన ధన్య ఎంతో ముచ్చటపడింది. ‘ఈరోజు నాకెంతో బాగుంది’ అని అద్దంలో చూసుకుని మురిసిపోయింది. ఆమె స్వచ్ఛమైన నవ్వు వధువు పాత్రకు అందం తెచ్చింది. ఇదంతా చూస్తున్న ఆమె తల్లిదండ్రులు ‘ఈరోజు మా అమ్మాయి పేషెంట్ అన్న సంగతే మర్చిపోయింది’ అని ఎంతో సంబరంగా ఆమెను చూశారు. నిరాశలో కూడా ఒక ఆశ చేతికి దొరుకుతుంది. అంతవరకూ ఓపిక పట్టమని ధన్య నవ్వు అందరికీ చెబుతోంది. విశేష స్పందన ‘స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా’గా మలబార్ గోల్డ్ వారు విడుదల చేసిన ధన్య యాడ్ విశేష స్పందన పొందింది. ఆ యాడ్‌లో ధన్య ఎంతో అందంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. ఆమె నవ్వుకు ఎందరో ఫాన్స్ అయ్యారు. ఇవాళ ధన్య సెలబ్రిటీ అయ్యింది. తన అనారోగ్యాన్ని గెలిచి తీరగలననే ఆత్మవిశ్వాసం పొందింది. -
‘ఐ లవ్ ముస్లిమ్స్’ అన్నందుకు..
బెంగుళూరు : ‘ఐ లవ్ ముస్లిమ్స్’ అని వాట్సాప్‌లో మెసేజ్ చేసినందుకు 20 ఏళ్ల అమ్మాయిని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన ఘటన చిక్‌మంగుళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసులో స్థానిక బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధన్య శ్రీ(20) చిక్‌మంగుళూరుకు చేరువలో గల ముడిగెరె పట్టణంలో బీకాం చదువుతోంది. శనివారం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంతోష్ అనే స్నేహితుడితో వాట్సాప్‌లో చెలరేగిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. చాట్‌లో కులం, మతాల ప్రస్తావన రావడంతో ఇరువురి మధ్య గొడవ చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా ‘నేను ముస్లింలను ప్రేమిస్తున్నాను’ అని ధన్య సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. దాంతో కోపోద్రేకుడైన సంతోష్.. ముస్లింలతో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించాడని చెప్పారు. అనంతరం ధన్యతో జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్లను స్థానిక భజరంగ్ దళ్, విహెచ్పీ సభ్యులకు పంపినట్లు తెలిపారు. ఆ స్క్రీన్ షాట్లు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ధన్య మానసికంగా కుంగిపోయినట్లు చెప్పారు. ధన్య ఇంటికి వెళ్లిన ముడిగెరె పట్టణ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు అనిల్ రాజ్.. ముస్లింలతో స్నేహంగా ఉండటంపై తల్లిదండ్రులను హెచ్చరించినట్లు తెలిపారు. ఆ మరుసటి రోజే ధన్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. ఈ ఘటన తన జీవితాన్ని, చదువును నాశనం చేసిందని ధన్య శ్రీ సూసైడ్ నోట్లో రాసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న సంతోష్, మరో ముగ్గురి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. -
వన్ సైడ్లవ్కు ‘ధన్య’ బలి
ప్రేమోన్మాదుల కిరాతకానికి మరో అబల బలైంది. మరెంతమంది బలికావాల్సి వస్తుందో అన్న ఆందోళన రాష్ట్రంలో ఏర్పడింది. మూడు నెలల్లో ఆరుగురు హతమయ్యారు. ‘వన్ సైడ్ ప్రేమ’ వ్యవహారంలో యువకులు తనకు దక్కంది మరొకరికి దక్కకూడదన్నట్టుగా ఉన్మాదులుగా మారి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. సాక్షి, చెన్నై: వన్ సైడ్ ప్రేమ పేరుతో యువతులకు వేధింపులు నానాటికి రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఇంటి నుంచి బయట అడుగు పెట్టే యువతులకు భద్రత కరువైనట్టుగా పరిస్థితులు నెలకొంటున్నాయి. తమకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఉన్మాదులుగా మారుతున్న కొందరు యువత ఒడి గడుతున్న ఘాతుకాలు ఆందోళన కల్గిస్తున్నాయి. మూడు నెలల్లో ఆరుగురు యువతులు ఒన్ సైడ్ ప్రేమకు బలి కావడం తల్లిదండ్రుల్ని కలవరంలో పడేస్తున్నాయి. నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కలకలం సృష్టిస్తే, విల్లుపురంలో నవీన ఆహుతి ఆందోళన ను రెట్టింపు చేసింది. కరూర్‌లో తరగతి గదిలో సోనాలి హత్య, విరుదాచలంలో పుష్పలత, తూత్తుకుడిలో ఫ్రాన్సీనా హత్యలు వన్ సైడ్ ప్రేమోన్మాదుల ఘాతకమే. తాజాగా, బుధవారం సాయంత్రం కోయంబత్తూరులో ధన్య(23) బలి అయింది. మరో నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన దన్యను ప్రేమోన్మాది కాటేశాడు. ఈ వరుస ఘటనలతో రాష్ర్టంలో యువతులకు భద్రత ఉందా..? అన్న ప్రశ్నను తలెత్తేలా చేస్తున్నాయి. మరో బలి : కోయంబత్తూరు జిల్లా అన్నూర్ తెన్న పాళయం వీజీపీ మహల్‌కు చెందిన సోము, శారద దంపతుల కుమార్తె ధన్య(23). బీఎస్సీ - ఐటీ పూర్తి చేసిన ధన్య అన్నూర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో సూపర్ వైజర్‌గా పనిచేసేది. పది రోజుల క్రితం అన్నూర్‌కు చెందిన ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయుడు దినేష్‌తో ధన్యకు వివాహ నిశ్చయతార్థం జరిగింది. బుధవారం ఓనం పండుగ కావడంతో తనకు కాబోయే భర్తతో కలిసి బయటకు వెళ్లిన ధన్య ఐదున్నర గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరింది. ధన్య రాగానే, ఆమె తండ్రి సోము, తల్లి శారద ఆసుపత్రికి వెళ్లారు. గంటన్నర తర్వాత ఇంటికి వచ్చిన సోము, శారద అక్కడ రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న ధన్యను చూసి రోదిస్తూ పెట్టిన కేకలు కలకలం రేపాయి. ఆ పరిసర వాసులు ఆ ఇంటి వద్దకు పరుగులు తీశారు. అతి దారుణంగా ఆమె హత్యకు గురై ఉండడంతో డీఎస్పీ కృష్ణమూర్తి నేతృత్వంలో ముగ్గురు ఇన్స్పెక్టర్లతో కూడిన విచారణ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రేమోన్మాదం : ఆగమేఘాలపై మరో గంటన్నర వ్యవధిలో సాగిన విచారణతో జకీర్ అనే యువకుడి ప్రేమోన్మాదం ఈ ఘాతంగా ప్రాథమిక దర్యాప్తులు పోలీసులు తేల్చారు. అర్ధరాత్రి సమయంలో జకీర్ కోసం వేట సాగినా, పాలక్కాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ జరిపిన విచారణతో జకీర్ వన్ సైడ్ లవ్ ఉన్మాదం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు సంస్థలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న ధన్యను కేరళ రాష్ట్రం పాలక్కాడుకు చెదిన అనిఫా కుమారుడు జకీర్ ప్రేమ పేరుతో వేధించడం మొదలెట్టాడు. ధన్య తీవ్రంగా హెచ్చరించడంతో కొన్ని నెలల క్రితం పత్తా లేకుండా పోయాడు. అతడి వేధింపుల నుంచి తాను బయట పడ్డటే అని భావించిన ధన్య, చాటుగా తనను జకీర్ తరచూ వెంటాడుతున్న విషయాన్ని గుర్తించ లేకపోయింది. ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపి మరో మారు తన ప్రేమను తెలియజేయడానికి బుధవారం జకీర్ ప్రయత్నం చేశాడు. ఉదయాన్నే ఆమె ఇంటి వద్దకు చేరుకున్నాడు. అయితే, ధన్య కాబోయే భర్తతో కలిసి బయటకు వెళ్లిన సమాచారంతో ఉన్మాదిగా మారాడు. తనకు దక్కనిది మరొకడికి దక్కకూడదన్నట్టు ఆక్రోశంతో కిరాతకుడయ్యాడు. ఆమె ఇంటికి వచ్చే వరకు ఆ పరిసరాల్లో మాటు వేశాడు. ఇంటికి రావడం, ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్లడాన్ని అదనుగా తీసుకున్నాడు. ఇంటి వెనుక వైపుగా ఉన్న గోడను దూకి,తలుపును తట్టాడు. శబ్దం విన్న ధన్య తలుపు తెరవగానే, తన చేతిలో ఉన్న రాడ్డుతో తలపైకొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపేశాడు. అక్కడి నుంచి ఆగమేఘాలపై పాలక్కాడుకు చేరుకుని, క్రిమిసంహాకరక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ కిరాతకుడ్ని కఠినంగా శిక్షించాలని అన్నూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.