వన్ సైడ్‌లవ్‌కు ‘ధన్య’ బలి
ప్రేమోన్మాదుల కిరాతకానికి మరో అబల బలైంది. మరెంతమంది బలికావాల్సి వస్తుందో అన్న ఆందోళన రాష్ట్రంలో ఏర్పడింది. మూడు నెలల్లో ఆరుగురు హతమయ్యారు. ‘వన్ సైడ్ ప్రేమ’ వ్యవహారంలో యువకులు తనకు దక్కంది మరొకరికి దక్కకూడదన్నట్టుగా ఉన్మాదులుగా మారి ఘాతుకాలకు పాల్పడుతున్నారు.
సాక్షి, చెన్నై: వన్ సైడ్ ప్రేమ పేరుతో యువతులకు వేధింపులు నానాటికి రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఇంటి నుంచి బయట అడుగు పెట్టే యువతులకు భద్రత కరువైనట్టుగా పరిస్థితులు నెలకొంటున్నాయి. తమకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఉన్మాదులుగా మారుతున్న కొందరు యువత ఒడి గడుతున్న ఘాతుకాలు ఆందోళన కల్గిస్తున్నాయి. మూడు నెలల్లో ఆరుగురు యువతులు ఒన్ సైడ్ ప్రేమకు బలి కావడం తల్లిదండ్రుల్ని కలవరంలో పడేస్తున్నాయి.
నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కలకలం సృష్టిస్తే, విల్లుపురంలో నవీన ఆహుతి ఆందోళన ను రెట్టింపు చేసింది. కరూర్‌లో తరగతి గదిలో సోనాలి హత్య, విరుదాచలంలో పుష్పలత, తూత్తుకుడిలో ఫ్రాన్సీనా హత్యలు వన్ సైడ్ ప్రేమోన్మాదుల ఘాతకమే. తాజాగా, బుధవారం సాయంత్రం కోయంబత్తూరులో ధన్య(23) బలి అయింది. మరో నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన దన్యను ప్రేమోన్మాది కాటేశాడు. ఈ వరుస ఘటనలతో రాష్ర్టంలో యువతులకు భద్రత ఉందా..? అన్న ప్రశ్నను తలెత్తేలా చేస్తున్నాయి.
మరో బలి :
కోయంబత్తూరు జిల్లా అన్నూర్ తెన్న పాళయం వీజీపీ మహల్‌కు చెందిన సోము, శారద దంపతుల కుమార్తె ధన్య(23). బీఎస్సీ - ఐటీ పూర్తి చేసిన ధన్య అన్నూర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో సూపర్ వైజర్‌గా పనిచేసేది. పది రోజుల క్రితం అన్నూర్‌కు చెందిన ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయుడు దినేష్‌తో ధన్యకు వివాహ నిశ్చయతార్థం జరిగింది. బుధవారం ఓనం పండుగ కావడంతో తనకు కాబోయే భర్తతో కలిసి బయటకు వెళ్లిన ధన్య ఐదున్నర గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరింది.
ధన్య రాగానే, ఆమె తండ్రి సోము, తల్లి శారద ఆసుపత్రికి వెళ్లారు. గంటన్నర తర్వాత ఇంటికి వచ్చిన సోము, శారద అక్కడ రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న ధన్యను చూసి రోదిస్తూ పెట్టిన కేకలు కలకలం రేపాయి. ఆ పరిసర వాసులు ఆ ఇంటి వద్దకు పరుగులు తీశారు. అతి దారుణంగా ఆమె హత్యకు గురై ఉండడంతో డీఎస్‌పీ కృష్ణమూర్తి నేతృత్వంలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లతో కూడిన విచారణ బృందాలు రంగంలోకి దిగాయి.
ప్రేమోన్మాదం :
ఆగమేఘాలపై మరో గంటన్నర వ్యవధిలో సాగిన విచారణతో జకీర్ అనే యువకుడి ప్రేమోన్మాదం ఈ ఘాతంగా ప్రాథమిక దర్యాప్తులు పోలీసులు తేల్చారు. అర్ధరాత్రి సమయంలో జకీర్ కోసం వేట సాగినా, పాలక్కాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ జరిపిన విచారణతో జకీర్ వన్ సైడ్ లవ్ ఉన్మాదం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు సంస్థలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న ధన్యను కేరళ రాష్ట్రం పాలక్కాడుకు చెదిన అనిఫా కుమారుడు జకీర్ ప్రేమ పేరుతో వేధించడం మొదలెట్టాడు. ధన్య తీవ్రంగా హెచ్చరించడంతో కొన్ని నెలల క్రితం పత్తా లేకుండా పోయాడు.
అతడి వేధింపుల నుంచి తాను బయట పడ్డటే అని భావించిన ధన్య, చాటుగా తనను జకీర్ తరచూ వెంటాడుతున్న విషయాన్ని గుర్తించ లేకపోయింది. ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపి మరో మారు తన ప్రేమను తెలియజేయడానికి బుధవారం జకీర్ ప్రయత్నం చేశాడు. ఉదయాన్నే ఆమె ఇంటి వద్దకు చేరుకున్నాడు. అయితే, ధన్య కాబోయే భర్తతో కలిసి బయటకు వెళ్లిన సమాచారంతో ఉన్మాదిగా మారాడు. తనకు దక్కనిది మరొకడికి దక్కకూడదన్నట్టు ఆక్రోశంతో కిరాతకుడయ్యాడు. ఆమె ఇంటికి వచ్చే వరకు ఆ పరిసరాల్లో మాటు వేశాడు.
ఇంటికి రావడం, ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్లడాన్ని అదనుగా తీసుకున్నాడు. ఇంటి వెనుక వైపుగా ఉన్న గోడను దూకి,తలుపును తట్టాడు. శబ్దం విన్న ధన్య తలుపు తెరవగానే, తన చేతిలో ఉన్న రాడ్డుతో తలపైకొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపేశాడు. అక్కడి నుంచి ఆగమేఘాలపై పాలక్కాడుకు చేరుకుని, క్రిమిసంహాకరక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ కిరాతకుడ్ని కఠినంగా శిక్షించాలని అన్నూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.