వివాహ సంప్రదాయంలో తలంబ్రాల వేడుక చూడముచ్చటగా సాగుతుంది. వధూవరులు పోటాపోటీగా ఇందులో పాల్గొంటారు. మాంగల్య ధారణ తర్వాత జరిగే తంతు ఇది. తలంబ్రాలకు ఎంచుకునే బియ్యానికి కొన్ని కొలతలు ఉంటాయి. అవి ఆయా ఇంటి ఆచారాలను బట్టి ఉంటుంది. ఇందులో విరిగిన బియ్యం వాడకూడదు. తలంబ్రాల వేడుకలో పఠించే మంత్రాల్లో విశేషమైన అర్థాలు ఉంటాయి. అవి సంసార బాధ్యతలను గుర్తుచేస్తాయి.
మొదట తలంబ్రాలను కొబ్బరి చిప్పలో పోసి, రాలతో ్రపోక్షించి వధూవరులకు అందిస్తూ దానం, పుణ్యం చేయాలని, శాంతి, పుష్టి, తుష్టి వృద్ధి కలగాలని, విఘ్నాలు తొలగి ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమం, మంగళం కలగాలని, సత్కర్మలు వృద్ధి చెందాలని, తారలు, చంద్రుని వల్ల దాంపత్యం సజావుగా సాగి, సుఖశాంతులు కలగాలని’ పురోహితుడు మంత్ర పఠనం చేస్తాడు.
మొదటగా వరుడు వధువు శిరస్సున పోస్తాడు. ఆ సమయంలో ‘నీవలన సత్సంతాన మృద్ధి జరుగునుగాక‘ అను మంత్రాన్ని చదువుతారు. వధువు చేత ‘పిడిపంటలు వృద్ధియగునుగాక‘ అను మంత్రాన్ని చదువుతూ తలంబ్రాలు పోయిస్తారు. మూడోసారి వరుడిచేత ‘ధన ధాన్య వృద్ధి జరుగునుగాక‘ అంటూ తలంబ్రాలు వధువు శిరస్సుమీద పోయిస్తారు. ఆ తర్వాత ఆ తలంబ్రాలను అన్నింటినీ వధూవరులు ఉల్లాసంగా ఒకరి శిరస్సున ఒకరు దోసిళ్ళతో పోసుకుంటారు. ఆ తర్వాత, వారి దాంపత్య బంధం ఆజన్మాంతం వర్ధిల్లాలను విషయానికి సూచనగా, వారి కొంగులను ముడివేస్తారు. దీనినే బ్రహ్మముడి/ బ్రహ్మగ్రంధి అంటారు.
Comments
Please login to add a commentAdd a comment