హిందూ ధర్మప్రచారంతో మతమార్పిడులు నిరోధించాలి
హిందూ ధర్మప్రచారంతో మతమార్పిడులు నిరోధించాలి
Published Mon, Sep 26 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
హిందూ ధార్మిక పరిషత్ చైర్మన్ పీవీఆర్‌కే ప్రసాద్
అన్నవరం : దళిత వాడల్లో హిందూ ధర్మ ప్రచారం నిర్వహించి బలవంతపు మత మార్పిడులను నిరోధించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, హిందూ ధార్మిక పరిషత్ చైర్మన్ పీవీఆర్‌కే ప్రసాద్ కోరారు. జాతీయ ఎస్సీ పరిరక్షణ సంస్థ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సోమవారం రత్నగిరిపై నిర్వహించిన హిందూ మత ప్రచారం సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వాలు నిధులను విడుదల చేసినంత మాత్రాన హిందూ మత ప్రచారం జరగదని ఆయన అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినపుడే అది సాధ్యమవుతుందన్నారు. మరో ముఖ్య అతిథి శ్రీనివాసానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ దళితవాడలలో రామాలయం నిర్మాణానికి రూ.ఐదు లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. ఆ మొత్తంతో బాటు భజనసామగ్రి కూడా కేటాయిస్తారని, వీటితో హిందు ధర్మ ప్రచారం నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఐటీ అడ్వైజర్ హనుమాన్ చౌదరి, జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కన్వీనర్ కరణం శ్రీశైలం, హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ రాష్ట్ర చైర్మన్ చవులూరి గవరయ్య, హిందూ ధర్మ పరిరక్ష సమితి అధ్యక్షుడు కర్రి ధర్మారావు, పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన దళితులు పాల్గొన్నారు.
Advertisement