మన్యం మరణాలు పాలకుల వైఫల్యమే
మన్యం మరణాలు పాలకుల వైఫల్యమే
Published Wed, Jul 5 2017 10:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM
అడవి బిడ్డలంటే అలుసా?
చాపరాయి, కాళ్లవాపు మరణాలపై జెడ్పీ విపక్షనేత నిలదీత
ఏటా ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవట్లేదని సభ్యుల ఆవేదన
వాడీవేడిగా జిల్లా పరిషత్ సమావేశం
భానుగుడి (కాకినాడ) : ఏజెన్సీలో గిరిజనులు మృత్యువాత పడుతున్నారని, ఇటీవల చాపరాయి గ్రామంలో 16 మంది మరణానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని జెడ్పీ ప్రతిపక్షనేత శాఖా ప్రసన్నకుమార్ ఆరోపించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన బుధవారం జరిగింది. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఇన్‌చార్జి సీఈవోగా జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణమూర్తి సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు శాకా ప్రసన్నకుమార్ చొరవతో చాపరాయిలో ఇటీవల మృతి చెందిన 16 మంది గిరిజనుల ఆత్మశాంతి కోసం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. ఏజెన్సీలో ఏటా గిరిపుత్రులు మరణిస్తున్నా వైద్య సిబ్బందిని నియమించడంలో అలసత్వం వహిస్తూ అధికారులతో పనిచేయించుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. గతేడాది కాళ్లవాపు వ్యాధితో 14 మంది గిరిజనులు మరణించారన్నారు. తూతూమంత్ర చర్యలు కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని గిరిజనుల ప్రాణాలను కాపాడాలని అన్నారు. కేశవరం తదితర గ్రామాల్లో గ్రావెల్ రూపంలో టీడీపీ నేతల జేబుల్లోకి తరలిపోతున్న వందలకోట్ల రూపాయల లెక్క తేల్చాలన్నారు. కూనవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, ఎటపాక, రాజవొమ్మంగి మండలాల అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు తమ మండలాల్లో నెలకొన్న దుస్థితిని సభ ముందుంచే ప్రయత్నం చేశారు. సీజనల్ వ్యాధులకు గిరిజనులు మృత్యువాత పడుతుంటే పట్టించుకోవడం లేదని అంటుంటే.. ఉప ముఖ్యమంత్రి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
సమస్యల పరిష్కారానికి రూ.26 కోట్లు
చాపరాయి సంఘటన నేపథ్యంలో ఏజెన్సీలో సమస్యల పరిష్కారానికి రూ.26 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతున్నామని ఉపముఖ్యమంత్రి రాజప్ప తెలిపారు. ఇందులో రూ.12 కోట్లు ఉపాధి హామీ పథకం కింద, మిగిలినవి సబ్‌ప్లాన్ కింద విడుదల చేస్తామన్నారు. వైద్యుల నియామకానికి కృషి చేస్తామన్నారు. తాగునీటి కోసం గ్రామాల్లో నెలకొన్న ఇబ్బందులు, అన్నఅమృత హస్తం పథకంలో లోపాలు, 3వ విడత రుణమాఫీకి విడుదల కాని సొమ్ము, కొత్త రేషన్ కార్డులు, ఏజెన్సీ మండలాల్లో ప్రజలకు రేషన్ సరుకులు అందకపోవడం, కిరోసిన్ ఇవ్వక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తదితర సమస్యలను జెడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మద్యం మత్తులో వాహనాన్ని నడుపడానికి వ్యతిరేఖంగా నిర్మించిన లఘు చిత్రాన్ని యూట్యూబ్‌లో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆవిష్కరించారు. ఈ సమావేశానికి శాసనమండలి ఉపా«ధ్యక్షుని హోదాలో తొలిసారిగా హాజరైన రెడ్డి సుబ్రహ్మణ్యంను నామన ఘనంగా సత్కరించారు. జెడ్పీ పాలకమండలి ఏర్పాటై మూడేళ్లు నిండిన నేపథ్యంలో సమర్థవంతంగా పాలన సాగించినందుకు సభ్యులంతా నామనకు అభినందనలు తెలిపారు. ఎంపీ తోటనరసింహం, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అయితా బత్తుల ఆనందరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పులపర్తి నారాయణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement