మంచి భోజనం
మాధవ్ శింగరాజు
ధర్మ ఒకప్పుడు బాగా బతికినవాడు. అంటే, ఇప్పుడతడు బతికి ఉన్నాడని, బతికుండి కూడా బాగా బతకడం లేదని కాదు. అతడు చనిపోయి చాలాకాలమే అయింది. ఎందుకో మళ్లీ అతడు భూమి మీదకు వచ్చాడు! ఆకాశంలోంచి భూమి మీదకు కాదు. భూగర్భంలోంచి భూమి మీదకు. బాగా ఆకలవుతోంది ధర్మకి. మంచి భోజనం దొరికితే బాగుండనుకున్నాడు. నిజంగా ఇప్పుడతనికి మంచి భోజనం కావాలి. బాగా బతికినవాడు మరి. ∙∙ మంచి భోజనం కోసం హైదరాబాద్‌లో రోడ్లు, బోర్డ్‌లు చూసుకుంటూ నడుస్తున్నాడు ధర్మ. ఓ చోట ‘మంచి భోజనం’ అనే బోర్డు కనిపించింది! బోర్డుకూడా వెరైటీగా ఉంది. బోర్డు బోర్డులా లేదు. అరటి ఆకులా ఉంది. ‘మంచి భోజనం’ అనే అక్షరాల కింద.. ‘తెలుగు భోజనం. భక్తితో వడ్డించబడును’ అని రాసి ఉంది. ఒక్క క్షణం ఆగాడు ధర్మ. భక్తితో వడ్డించడం అంటే నైవేద్యం పెట్టడం. ఎవరికి నైవేద్యం పెడతారు? దేవుడికి. మరి తనను లోపలికి రానిస్తారా? ఆలోచిస్తున్నాడు ధర్మ. ఆలోచిస్తూనే ఆ రెస్టారెంట్ మెట్లు ఎక్కాడు. లోపల పెద్ద హాలు! నిండా జనం. అంతా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఆఫీసర్లు. ఎగ్జిక్యూటివ్‌లు. అందరి చేతుల్లో టోకెన్లు ఉన్నాయి. ఆ పైఫ్లోర్‌లో డైనింగ్ హాల్. పైన రెండు కుర్చీలు ఖాళీ అయ్యాయని చెప్పగానే కింది నుంచి ఇద్దరు వెళుతున్నారు. మూడు అయ్యాయంటే ముగ్గురు.
టేబుల్ టేబులే ఖాళీ అయిందని కబురొస్తే నలుగురు వెళుతున్నారు. టోకెన్ తీసుకున్నవాళ్లలో కూడా మళ్లీ అందరికీ కుర్చీల్లేవు. కొందరు నిలుచునే ఉన్నారు. నిలుచున్నందుకు వాళ్లేమీ నిట్టూర్చడం లేదు. ఫోన్లు చూసుకుంటున్నారు. ‘‘ఒక భోజనం’’ అన్నాడు ధర్మ.. పర్సు తీసి. కౌంటర్లో ఉన్నతను ధర్మ వైపు చూడనైనా చూడకుండా ‘‘ఫుల్లా.. ప్లేటా?’’ అన్నాడు. ధర్మ కాస్త నొచ్చుకున్నాడు. పోన్లే.. వీళ్లేమీ బోర్డు మీద రాయలేదు కదా.. ‘భక్తితో వడ్డించడమే కాదు.. భక్తితో టోకెన్ కూడా ఇవ్వబడును’ అని.. అనుకున్నాడు. మంచి భోజనం చేయాలని అతడికి ఎంతగానో ఉంది. ‘‘ఫుల్లే ఇవ్వండి’’ అన్నాడు. ‘డబ్బులు ఇవ్వండి’ అన్నట్లు చెయ్యి చాచాడు కౌంటర్లోని మనిషి. ‘‘ఎంత?’’ అని అడిగాడు ధర్మ. ‘‘రెండు వేలు’’ చెప్పాడు ఆ మనిషి. ధర్మ ఆశ్చర్యపోయాడు. ఒక్కక్షణం ఆలోచించి, ‘‘ప్లేట్ మీల్స్ అయితే ఎంత?’’ అని అyì గాడు. ‘‘ఒక వెయ్యీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది..’’ చెప్పాడతను. ‘‘అయితే ఫుల్లే ఇవ్వండి’’ అన్నాడు ధర్మ. విసుక్కుంటూ.. ఫుల్ టోకెన్ ఇచ్చి, రెండు వేల నోటు తీసుకున్నాడు అతను. పాపం అతడి తప్పేం లేదు. భోజనం చేశాక చెయ్యి కడుక్కోడానికి వాష్ బేసిన్ దగ్గర పెద్ద క్యూ ఉన్నట్లు.. టోకెన్ తీసుకోడానికి ఆ అర నిముషంలోనే ధర్మ వెనుక పెద్ద క్యూ తయారైంది! టోకెన్ దొరికిన కొంతసేపటికి పైన భోజనం హాల్లో సీటు కూడా దొరికింది ధర్మకు.
అప్పుడే కడిగిన స్టీల్ ప్లేట్‌ను విదుల్చుకుంటూ తీసుకొచ్చి ఆప్యాయంగా ధర్మ ముందు పెట్టాడు వెయిటర్. ప్లేట్ చూసి నిరాశ పడ్డాడు ధర్మ. బయట రెస్టారెంట్ బోర్డు అరిటాకులా ఉంది కాబట్టి, రెస్టారెంట్ లోపల కూడా అరిటాకులోనే భోజనం వడ్డిస్తారనుకున్నాడు. ధర్మ ముందు ఖాళీ ప్లేట్ పెట్టి వెళ్లిన కుర్రాడు మళ్లీ రాలేదు. వేరెవరో వచ్చి, ఒక స్టీల్ జగ్గు, రెండు ఖాళీ గ్లాసులు పెట్టి వెళ్లారు. వాటిల్లో ఒకటి తనకు కావచ్చనుకున్నాడు ధర్మ. గ్లాసులో నీళ్లు వాళ్లొచ్చి పోస్తారా, తను పోసుకోవాలా అని ఆలోచించలేదు అతను. పోసుకున్నాడు. ఆకలి దహించుకుపోతోంది. ఈలోపు ఎవరో వచ్చి చిన్న స్వీటు ముక్క ఏదో ప్లేటులో పెట్టి వెళ్లిపోయారు. ఇంకొకరొచ్చి అప్పడం వేసి వెళ్లారు. ఇంకొకరు అరటి పండు పెట్టి వెళ్లారు. మొదట ప్లేటు పెట్టిన కుర్రాడే మళ్లీ వచ్చి రెండో రకం స్వీటు పెట్టి వెళ్లాడు. మరొకరు వచ్చి, రెండు పూరీలు వేసి వెళ్లారు. ఏవేవో వస్తున్నాయి. అన్నం మాత్రం రావడం లేదు. అడిగితే ఆప్యాయతను మిస్ అవుతానని ధర్మ మౌనంగా ఉన్నాడు. టేబుల్ మీద నాలుగు అరల కూరల గిన్నెల్లో ఒక కూర, ఒక వేపుడు, సాంబారు, రసం ఉన్నాయి. ఆ పక్కనే ఉన్న చిన్న గిన్నెల అరల్లో ఏవో పొడులు, పచ్చళ్లు ఉన్నాయి. ప్లేటులో అన్నం లేకుండా.. ప్లేటు చుట్టూ అవన్నీ ఉన్నాయి.‘‘బాబూ.. రైస్’’ అన్నాడు ధర్మ. ఆప్యాయంగా వడ్డించడం అనే డ్యూటీలో పడిపోయి తనను మర్చిపోయాడేమోనని. నిజమే. మర్చిపోయాడు. ‘‘అరె.. ఇక్కడింకా రైస్ పడలేదా?’’ అని పెద్దగా అరిచి, ఎవరికో పురమాయించాడు.
‘పడలేదా?’ అనే మాట ధర్మకు మింగుడు పడలేదు. ఒక ముద్ద తినడానికి ఇంత అస్థిమితం ఏమిటి అనుకున్నాడు. అన్నం వచ్చింది. డిష్ పట్టుకొచ్చిన మనిషి డిష్లోంచి గరిటెతో కొద్దిగా అన్నాన్ని ప్లేట్లోకి జార్చి వెళ్లిపోయాడు. ఫుల్ మీల్స్ కాబట్టి అలాగే కొద్దికొద్దిగా పెడుతూ ఉంటారు. ప్లేట్ మీల్స్‌లో ఒకేసారి కొద్దిగా పెట్టి ఇక ఊరుకుంటారు. అన్నం కలుపుకోబోయాడు ధర్మ. వేడిగా లేదు! పిలిచి అడిగాడు. ‘‘వేడిగానే తెచ్చాను కదా’’ అన్నాడు డిష్ మనిషి. కోపాన్ని ఆపుకున్నాడు ధర్మ. ‘‘వేడిగా ఉండడం వేరు. వెచ్చగా ఉండడం వేరు. వేడిగా ఉంటే అన్నం పొగలు కక్కుతుంది..’’ పెద్దగా అరిచాడు. చుట్టూ భోజనం చేస్తున్నవాళ్లంతా ‘ఏంటీ న్యూసెన్స్?!’ అన్నట్లు ధర్మవైపు చూశారు. ధర్మ కూడా వాళ్లవైపు చూశాడు. తను తింటున్నప్పుడు కూడా మధ్యమధ్యలో ఆ తినేవాళ్లను చూస్తున్నాడు ధర్మ. వెయిటర్లు భక్తితో పెడుతున్నారో లేదో కానీ, వాళ్లు మాత్రం భక్తితో తింటున్నారు! ఫోన్లు చూసుకుంటూ, ఫోన్లో మాట్లాడుకుంటూ ఎందులో ఏం కలుపుకుంటున్నారో తెలియకుండా తింటున్నారు. ఎవరూ ప్రశ్నించడం లేదు. అన్నం వేడిగా లేదేంటి అని అడగడం లేదు. పప్పులో ఉప్పెక్కువైంది ఏంటీ అని అడగడం లేదు. పెరుగు నీళ్లలా ఉందేంటీ అని అడగడం లేదు.
పెట్టింది తింటున్నారంతే. ఒకళ్లెవరో అంటున్నారు.. ఇంత మంచి రెస్టారెంట్‌ను తనెప్పుడూ చూడలేదని! డైనింగ్ టేబుల్స్ బాగున్నాయట. ఫ్లోర్ మీద టైల్స్ బాగున్నాయట. వాల్స్ మీద పెయింటింగ్స్ ప్లెజెంట్‌గా ఉన్నాయట. కిటికీలోంచి చూస్తే పక్క బిల్డింగ్ మీద రూఫ్‌టాప్‌పై మొక్కలు బాగున్నాయట!భోజనాన్ని తినలేక మధ్యలోనే వదిలేసి.. వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి చేతులు శుభ్రంగా కడుక్కుని కౌంటర్లో ఉన్న మనిషి దగ్గరికి వెళ్లాడు ధర్మ.‘ఏంటి?’ అన్నట్లు చూశాడు ఆ మనిషి. ‘‘భోజనం బాగుంది’’ అన్నాడు ధర్మ. ‘అందులో వింతేం ఉంది’ అన్నట్లు భుజాలు ఎగరేశాడు అతడు.‘‘మంచి క్వాలిటీ మీల్స్‌ని తక్కువ ధరకు అందిస్తున్నారు. ఎవరు మీ ప్రొప్రయిటర్?’’ అడిగాడు ధర్మ. ‘‘థ్యాంక్యూ. ప్రొప్రయిటర్ని నేనే’’ చెప్పాడు అతను. కత్తి తీసి సర్రున అతడి గొంతు కోశాడు ధర్మ. ‘‘తప్పు నీది కాదు. నువ్వెలా పెట్టినా తింటున్నవాళ్లది. మరోసారి వాళ్లను తప్పు చెయ్యనివ్వను’’ అనేసి మెట్లు దిగి వెళ్లిపోయాడు.∙∙ ధర్మ బాగా బతికినవాడు. బాగా బతకడం అంటే అతడి దృష్టిలో.. ఇంత విస్తరాకులో వేడి వేడి అన్నం, ఘాటుగా పచ్చిమిరపకాయ పచ్చడి కలుపుకుని కమ్మగా తినడం! స్వీట్లు, సలాడ్లు.. వంద రకాల కూరలులేకుండా కడుపుకు అవసరమైనంత వరకే తినడం. ఆకలిగా ఉంది ధర్మకు. ఒక్క పూట ఎవరైనా తనకు మంచి భోజనం పెడితే తను వీలునామా రాయకుండా వదిలిపోయిన యావదాస్తినీ ఇచ్చేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు.