‘స్వామి సొమ్ముతో షో’ వద్దు
‘స్వామి సొమ్ముతో షో’ వద్దు
Published Fri, Jun 16 2017 10:19 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
- పునఃపరిశీలించాలి
- అన్నవరం దేవస్థానం నూతన పాలక మండలి తీర్మానం
- రూ.55 లక్షలతో స్వామివారికి కొత్త రథం తయారీకి పచ్చజెండా
- సబ్ క్యాంటీన్ వద్ద భక్తులకు ఉచితంగా పులిహోర, దద్ధోజనం పంపిణీ
- గోల్డ్‌బాండ్ స్కీమ్‌లో 2.860 కిలోల బంగారం డిపాజిట్
అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని సొమ్ము రూ.2.96 కోట్లతో సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పునఃపరిశీలించాలని కోరుతూ అన్నవరం దేవస్థానం పాలక మండలి తీర్మానించింది. దేవస్థానం నూతన పాలక మండలి తొలి సమావేశం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ప్రకాష్ సదన్ సత్రంలోని పాలక మండలి సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఉదయం 11 నుంచి సాయంత్రం వరకూ జరిగిన ఈ సమావేశంలో తొమ్మిది అంశాలపై చర్చించారు. పాలక మండలి సభ్యులు రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, యడ్ల భేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, చెల్లి శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు (కొండబాబు), సత్తి దేవదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, మారెడ్డి సింగారెడ్డి, మట్టే సత్యప్రసాద్, సింగిలిదేవి సత్తిరాజు, ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఈఓ కె.నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ముఖ్య తీర్మానాలివీ..
- రూ.2.96 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సౌండ్ అండ్ లైట్ షో దేవస్థానానికి అంత లాభదాయకం కాదు. అలాగని టెంపుల్ టూరిజం అభివృద్ధికి కూడా అంతగా ఉపయోగపడేది కాదు. పైగా ఇది దేవస్థానానికి ఆర్ధికంగా భారం. ఉన్నతాధికారులు పునఃపరిశీలన జరిపి దీనిని ఉపసంహరించాలి.
- గత నవంబర్ నుంచి మూసివేసిన సబ్ క్యాంటీన్ వద్ద భక్తులకు ఉదయం ఉచితంగా పులిహోర, దద్ధోజనం పంపిణీ చేయాలి. రద్దీ రోజుల్లో 2 వేల మందికి, ఇతర రోజుల్లో వెయ్యి మందికి సరిపోయేలా పంపిణీ చేయాలి. సోమవారం నుంచి దీనిని ప్రారంభించాలి.
- స్వామి, అమ్మవార్లను ఉత్సవాల్లో ఊరేగించేందుకు రూ.55 లక్షలతో నూతన రథం తయారు చేయించాలి.
- దేవస్థానంలో ఉన్న 2.860 కేజీల బంగారాన్ని గోల్డ్ బాండ్ స్కీమ్‌లో డిపాజిట్ చేయాలి.
- గురువారం జరిగిన షాపుల వేలంలో గత ఏడాదికన్నా అత్యధికంగా పాడుకున్నవారికి షాపులను ఇవ్వాలి.
Advertisement