వీడని వివాదాల చెర
వీడని వివాదాల చెర
Published Mon, May 29 2017 10:50 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
అన్నవరం పాలక మండలి ప్రమాణ స్వీకారం
తనకు తెలియకుండా ముహూర్తం నిర్ణయించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం
జూన్ నాలుగుకు మారిన ముహూర్తం
అన్నవరం (ప్రత్తిపాడు): అన్నవరం దేవస్థానం పాలకమండలి నియామక జీఓ ఏ ముహూర్తాన విడుదలైందో కానీ ఏదో ఒక వివాదం వెంటాడుతోంది. ఇప్పటివరకూ పాలకమండలి ప్రమాణస్వీకార వేదిక విషయంలో వివాదం ఏర్పడగా, ఇప్పుడు తేదీ విషయంలో మరో వివాదం తలెత్తింది. దీంతో జూన్ నాలుగో తేదీకి ప్రమాణస్వీకారం వాయిదా పడింది. పాలకమండలి ప్రమాణ స్వీకారానికి జూన్ ఒకటో తేదీని ముహూర్తంగా నిర్ణయించి ఆతర్వాత తనను దేవస్థానం అధికారులు ఆహ్వానించడంపై ప్రత్తిపాడు శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ ఒకటో తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉందని, అందువల్ల జిల్లా మంత్రులు కానీ, తాను కానీ హాజరయ్యే పరిస్థితి లేదని ఆయన అధికారులకు తెలిపినట్టు సమాచారం. ఇప్పటికే జూన్ ఒకటో తేదీన ప్రమాణస్వీకారం జరుగుతుందని పాలకమండలిలో సభ్యులుగా నియమితులైన 16 మందికీ దేవస్థానం అధికారులు సమాచారం పంపించారు. ఆ సభ్యులు భారీ ఊరేగింపుతో అన్నవరం వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రమాణస్వీకార తేదీ మార్పుపై అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. చివరకు జూన్ నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలు కొత్త ముహూర్తంగా నిర్ణయించారు. ఆ సమయంలో కళావేదిక మీద ఈ కార్యక్రమం జరుగుతుంది.
మంత్రులు, ఎమ్మెల్యే హాజరయ్యేందుకు వీలుగా తేదీ మార్పు
దేవస్థానం పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక శాసనసభ్యుడు హాజరయ్యేందుకు వీలుగా జూన్ నాలుగో తేదీకి మార్పు చేసినట్టు ఈఓ కె. నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ‘సాక్షి’ కి తెలిపారు. ముందుగా నిర్ణయించిన ఒకటో తేదీన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున ఆ తేదీని మార్చామన్నారు. ఉదయం 9.30 గంటలకు బదులు సాయంత్రం నాలుగు గంటలకు ఆ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు.
Advertisement