
యోగి హిందూత్వ అస్త్రం: కీబోర్డ్ ఆర్మీ
న్యూఢిల్లీ: సోషల్‌మీడియాలో హిందుత్వానికి వ్యతిరకేంగా జరుగుతున్న ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఆర్ఎస్‌ఎస్-బీజేపీ థింక్ ట్యాంక్ భారత్ నీతి సిద్ధమవుతోంది. తమ హిందూత్వానికి వ్యతిరేకంగా లెఫ్టిస్టులు, ఇస్లామిస్టులు ఆన్‌లైన్‌లో చేస్తున్న ప్రచారాన్ని తుద ముట్టించేందుకు కీబోర్డు ఆర్మీని తయారు చేయాలని భారత్ నీతి లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మేరకు నవంబర్‌లో 'హిందూఇజం అండ్ సోషల్‌మీడియా' సమావేశాన్ని వారణాసిలో నిర్వహించనుంది. ఈ సమావేశంలో వ్యతిరేక భావజాలాన్ని అడ్డుకునేందుకు 'కీబోర్డు ఆర్మీ'ని తయారుచేయాలనే అంశంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.
ట్వీటర్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో హిందూత్వానికి వ్యతిరేకంగా భావజాలం పెరిగిపోతోందని భారత్ నీతి సభ్యుడు శైలేంద్ర సెంగర్ అన్నారు. దీనివల్ల హిందూవులు వేదనకు గురవుతున్నారని చెప్పారు. హిందూ దేవుళ్లు, దేవతలను అవమానపరుస్తూ కొందరు పోస్టింగులు చేస్తున్నారని తెలిపారు. వీటన్నింటిపై కాశీ సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు.
సమావేశానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని తెలిపారు. ఇప్పటికే ఆదిత్యనాథ్‌కు ఆహ్వానం పంపామని కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. అకడమిక్ కామెంటెటర్ ఆన్ హిందూఇజం డేవిడ్ ఫ్రాలే వెబ్ ఆర్మీని మోటివేట్ చేస్తారని తెలిపారు. సద్గురు జగ్గీవాసుదేవ్, ఆచార్య బాలకృష్ణ, కాలమిస్టు అద్వైత కళలు కూడా సమావేశానికి హాజరై హిందూత్వంపై ప్రసంగిస్తారని చెప్పారు.