హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిందువు అని ఎందుకు చెప్పుకున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. అలాగైతే సోమనాథ్ దేవాలయంలో హిందూ ఎందుకు డిక్లరేషన్ ఇచ్చారని సూటిగా కాంగ్రెస్ నేతలను అడిగారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకం అని అన్నారు. గుజరాత్‌లో ఆరో సారి సూపర్ సిక్సర్‌గా, డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని కుహానా మేధావులు, విశ్లేషకులు తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఐదు సంవత్సరాలకే కాంగ్రెస్ ఓడిపోతే మాట్లాడటం లేదు కానీ గుజరాత్‌లో వరుసగా ఆరవ సారి గెలిస్తే తక్కువ చేసి మాట్లాడటం దారుణమన్నారు. కిరాయి నాయకులతో కాంగ్రెస్ రెచ్చగొట్టి అధికారం కోసం ప్రయత్నం చేసి కాంగ్రెస్ బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. వచ్చిన సీట్లు కూడా కాంగ్రెస్ బలుపు కాదు అది వాపు అని విమర్శించారు. బీజేపీ పై వ్యతిరేకతతో గుజరాత్ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాయకులు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. చైనా, పాకిస్థాన్ హస్తం కూడా గుజరాత్ ఎన్నికల్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయన్నారు.
మోదీ మీద వ్యక్తిగత వ్యాఖ్యాలు చేస్తూ..నీచుడని, విదేశీ పుట్టగొడుగులు తిని తెల్లగా అయిపోతున్నారని దిగజారి మాట్లాడారని వివరించారు. కాంగ్రెస్‌ను అస్సాం, యూపీ, హర్యానా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్‌లలో ఓడిస్తే దిక్కులేదు కానీ..రాహుల్ గాంధీ ఏదో పొడిచారని ప్రచారం చేసుకోవడం ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఓట్లు పెరిగి సీట్లు తగ్గితే బీజేపీ మీద విషం కక్కుతారా..ప్రజలు ఆదరించినా కూడా ఇంకా జీఎస్‌టీ, నోట్ల రద్దు మీద దాడి చేయడం వంటివి దేశ నాశనం కోరుకునే వారే చేస్తారని చెప్పారు.
రేపు ఎల్లుండి సమావేశాల్లో బీజేపీ రూట్ మ్యాప్ తయారు చేస్తున్నామని, వివిధ స్థాయిలలో తమ ముఖ్య నాయకుల సమావేశం ఉందని, ఈ ఎన్నికల స్ఫూర్తిగా మా అడుగులు ఉంటాయని తెలిపారు. నిన్నటి దాకా మోదీని పొగిడిన రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి సిద్ధాంతం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment