సాక్షి, న్యూఢిల్లీ : ‘ న్యాయ వ్యవస్థ ప్రాథమిక ప్రాధాన్యత ఏమిటంటే న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు నిస్సందేహంగా కనిపించడం కూడా’ అని ప్రముఖ బ్రిటిష్ జడ్జీ లార్డ్ చీఫ్ జస్టిస్ గార్టెన్ హెవార్ట్ 1924లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏ దేశ న్యాయ వ్యవస్థకైనా తల మానికం. ఏదో కేసు సందర్భంగా కూడా భారత దేశంలోని సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటించింది. చట్టాలను అమలు చేసే ఏ రాజ్యాంగ సంస్థకైనా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయనడంలో సందేహం లేదు. దీనికి ఎన్నికల కమిషన్ కూడా మినహాయింపు కాదు.
గుజరాత్ అసెంబ్లీ రెండో విడత పోలింగ్‌కు ఎన్నికల ప్రచార సమయం మంగళవారం ముగిసిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూను కొన్ని న్యూస్ ఛానళ్లు ప్రసారం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సదరు న్యూస్ ఛానళ్లపై ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ నుంచి ఆగ మేఘాలపై ఉత్తర్వులు వెలువడ్డాయి. 14వ తేదీన గురువారం సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్‌కు వెళ్లి అక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన బయటకు వచ్చి ప్రజలకు తాను ఓటువేసిన చేతి గుర్తును చూపిస్తూ ఓ చిన్నపాటి రోడ్డు షోను నిర్వహించారు. దాన్ని కొన్ని టీవీ ఛానళ్లు ప్రత్యక్షంగా ప్రసారం చేశాయి. ఇంకా పలుచోట్ల పోలింగ్ జరుగుతుండగా ప్రధాని రోడ్డు షోను నిర్వహించడం కూడా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని పరిశీలిస్తామని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకుంటామంటూ తాత్సారం చేసిన ఎన్నికల కమిషన్ చివరకు ప్రధానిది రోడ్ షో కాదని తేల్చింది.
మొదటి విడత పోలింగ్ జరిగిన 9వ తేదీన ప్రధాని నాలుగు చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడారు. వాటిని పోలింగ్‌లేని ప్రాంతాల్లోనే ఏర్పాటుచేసి ఉండవచ్చు. కానీ మోదీ ప్రసంగాలను పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్రసారం చేశారు. అది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం కాదా? అహ్మదాబాద్‌లో బుధవారం నాడు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా దీన్ని కవర్ చేసింది.
మంగళవారమే ఎన్నికల ప్రచార సమయం ముగిసిపోయాక బుధవారం ఆయన ఎలా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు? దాన్ని మీడియా ఎలా ప్రసారం చేస్తుంది? వీటిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆచల్ కుమార్ జ్యోతి గుజరాత్‌కు చెందిన వారని, ఆయన ప్రధాని కార్యాలయానికి అత్యంత సన్నిహితుడని అందరికి తెల్సిందే. అలాంటి వ్యక్తి తాను నిస్పక్షపాతంగా వ్యవహరించడమే కాకుండా వ్యవహరించినట్లు కూడా కనిపించాలి. అదిలేకపోగా ప్రతిపక్షం పట్ల ఒక విధంగా పాలకపక్షం పట్ల ఒక విధంగా వ్యవహరించినట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణలు రావడం శోచనీయం.
Comments
Please login to add a commentAdd a comment