
న్యూఢిల్లీ: హిందూ దేశమంటే ముస్లింలకు చోటులేదని అర్థం కాదనీ, హిందుత్వమంటే అన్ని మతాలను కలుపుకుని పోవడమేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మంగళవారం అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న మూడు రోజుల ‘భవిష్యత్ భారతం–ఆరెస్సెస్ దృక్పథం’ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘ప్రపంచంలోని ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వం కోసం సంఘ్ పనిచేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే ప్రాథమిక సిద్ధాంతం నుంచి ఈ సౌభ్రాతృత్వం పుట్టుకొచ్చింది.
హిందూ దేశంలో ముస్లింలకు లేదా ఇతరులకు చోటు లేదన్న రోజున అది హిందూత్వమే కాకుండా పోతుంది. వసుధైక కుటుంబం గురించి మాట్లాడేదే హిందూత్వం. అలా ఉంటేనే అది హిందూ దేశం’ అని భాగవత్ వివరించారు. అలాగే ఓ నిర్దిష్ట పార్టీ కోసం పనిచేయాలని ఆరెస్సెస్ తన కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పదనీ, జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వారికే మద్దతు తెలపాల్సిందిగా తాము కార్యకర్తలకు సూచిస్తామని భాగవత్ చెప్పారు. ఆరెస్సెస్ నేపథ్యమున్నవారు బీజేపీలో అత్యున్నత పదవుల్లో ఉండగా, ఆరెస్సెస్‌కు, బీజేపీకి వ్యత్యాసముందని చెప్పేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.