హిందూ దేవుళ్లపై ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీహార్‌లో కలకలం రేపాయి. ఈ నేపధ్యంలో శివ భవానీ సేన అనే హిందూ సంస్థ సదరు ఆర్జేడీ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ. 10 లక్షల రివార్డును అందజేస్తామంటూ పోస్టర్‌లను అతికించింది.
పాట్నాలోని బీహార్ శాసనసభ సభ్యుల ఫ్లాట్‌ల దగ్గర ‘శివ భవానీ సేన’ ఆర్జేడీ ఎమ్మెల్యేకు సంబంధించిన పోస్టర్‌ను అతికించింది. అందులో ఈ రివార్డ్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బహదూర్ సింగ్ స్పందిస్తూ ‘శివ భవానీ సేన’పై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటన చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాశానని తెలిపారు.
కొద్దిరోజుల క్రితం ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ పేరుతో పలు గోడలపై కొన్ని చోట్ల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలేను చెప్పిన మాటను ఉదహరిస్తూ.. ‘ఆలయం అంటే మానసిక బానిసత్వానికి మార్గం, పాఠశాల అంటే జీవితంలో వెలుగుల మార్గం’ అని రాసివుంది. ఇది గుడి గంట మోగిస్తే మనం మూఢనమ్మకాలు, మూర్ఖత్వం, అజ్ఞానం వైపు పయనిస్తున్నామని, బడి గంట మోగిస్తే హేతుబద్ధమైన జ్ఞానం, శాస్త్రీయత, వెలుగుల వైపు పయనిస్తున్నామనే సందేశం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకోండి’ అని దానిలో రాసివుంది.
కాగా ఆ పోస్టర్‌లో ఆర్‌జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్, ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి ఫొటోలు ఉన్నాయి. అయితే ఈ పోస్టర్ గురించి పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హిందూ శివ భవానీ సేన ఈ ప్రకటనను తప్పుబట్టింది. ఆ సంస్థ అధ్యక్షుడు లవ్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. హిందువులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ వ్యాఖ్యలు చేశారని, అతని నాలుకను తెగ్గోసినవారికి రూ. 10 లక్షలు బహుమానంగా అందిస్తామని ప్రకటించారు. ఫతే బహదూర్ సింగ్ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment