‘‘నేను ఇండియాకో, సౌదీకో ప్రధాని కాగలనా? మీరే చెప్పండి. అలా జరుగుతుందని ఊహకు కూడా అందడం లేదు. అస్సలు అవకాశమే లేదు కదా! బ్రిటన్లో 85 శాతం శ్వేతజాతీయులే. వాళ్లు తమ ప్రధానిగా తమలో ఒకరిని చూడాలనుకుంటారే తప్ప శ్వేతేతరుణ్ని కాదు. అంతెందుకు, నేనిప్పుడు ఇండియా వెళ్లి ప్రధాని పదవి చేపట్టగలనా? అక్కడి వాళ్లు నాకా అవకాశమిస్తారా?’’
–బ్రిటన్‌లో ప్రజాదరణ పొందిన ఓ రేడియో షోలో వ్యాఖ్యాత గొంతెత్తుకుని అరుస్తున్నాడు. రిషి ప్రధాని కావడంపై బ్రిటన్లోని సాధారణ పౌరుల్లో కూడా చాలామందిది ఇదే భావన. కానీ మర్యాద ముసుగులో బయటపడటం లేదంతే.
బ్రిటన్లో స్థిరపడ్డ ఓ హిందూ మూలాలున్న వ్యక్తి 10–డౌనింగ్ స్ట్రీట్లో అడుగు పెట్టడం అక్కడివాళ్లకు అస్సలు రుచిస్తున్నట్టు లేదు. కొన్ని ప్రధాన పత్రికలు దీనిపై బాహాటంగానే పతాక శీర్షికల్లో అసంతృప్తి వెళ్లగక్కాయి. కానీ, ఎంపీలు ఎన్నుకున్నారు. రాజు ఓకే చెప్పేశాడు. బ్రిటన్‌లో ఓ హిందూ మూలాలున్న వ్యక్తి పాలన మొదలైపోయింది కూడా! పోటీ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న బోరిస్ జాన్సన్ గానీ, పెన్నీ మోర్డంట్ గానీ, లోలోపల తెగ ఇబ్బంది పడుతున్న సామాన్య పౌరులు గానీ ఇప్పుడిక చేసేదేమీ లేదు. రిషిని ఇప్పటికిప్పుడు పదవి నుంచి దించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కూడా కాదు. నిజానికి రిషి ప్రధాని కావడం బ్రిటన్ చరిత్రలో ఓ కీలక మలుపు. ప్రజాస్వామ్య విలువలకు మైలురాయి.
అతనే దిక్కు!
బ్రిటన్‌ను ఆర్థికంగా నిండా ముంచినంత పనిచేసిన తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ అసంబద్ధ నిర్ణయాలను సరిచేయడం రిషి ముందున్న సవాళ్లలో అతి ప్రధానమైనది. రాణి కన్నుమూసింది. కొత్త రాజు ఇంకా కుదురుకోవాల్సి ఉంది. పౌండు విలువ నానాటికీ పతనమవుతోంది. మొత్తమ్మీద బ్రిటన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆర్థిక మంత్రిగా సమర్థంగా పని చేసిన అనుభవమున్న రిషికి ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడం అంత కష్టం కాకపోవచ్చు. నిజానికి బ్రిటన్‌కు ఇప్పుడతనే దిక్కు. ట్రబుల్ షూటర్ కూడా! రానున్న రోజుల్లో బ్రిటన్ ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుందా, మరింత దిగజారుతుందా అన్నది కాలమే తేలుస్తుంది.
ఏది ఏమైనా బ్రిటన్‌ను ఓ హిందువు ఏలుతుండటం సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘట్టం. అయితే ఇది జాతివివక్ష లేని బ్రిటన్‌కు తార్కాణం మాత్రం కాదు. ఇటీవల హిందూ ప్రార్థనా స్థలాలపై అక్కడి లీస్టర్‌షైర్ వంటి చోట్ల జరిగిన దాడులను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అందుకే, ‘రిషి హిందువు అయినప్పటికీ ప్రధాని అయ్యాడు తప్పితే హిందువు కావడం వల్ల మాత్రం కాద’న్న ఓ విశ్లేషకుని వ్యాఖ్య అక్షరసత్యం.
హిందూ ఫోబియా
అసలు విషయానికొస్తే, హిందువులపై జరిగిన దాడులను అక్కడి పత్రికలు ఎంత ఘోరంగా చిత్రించిందీ అందరికీ తెలుసు. ఒకరకంగా వారిలో హిందూ ఫోబియా (హిందువలంటే భయం) కన్పించింది. అక్కడి చాలామంది మేధావుల్లో, విశ్లేషకుల్లో కూడా హిందువులంటే అంత మంచి అభిప్రాయమేమీ లేదు. వారి వ్యాఖ్యల్లో ఈ విషయం పదేపదే గోచరిస్తుంది. రిషి అత్యున్నత స్థానాన్ని అధిష్టించడం ఈ పెడ ధోరణిని మారుస్తుందా అంటే, ఇప్పడే చెప్పలేం. అయినా వీటిని రిషి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ప్రస్తుతానికి ఆయన దృష్టంతా బ్రిటన్ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంపైనే ఉంటుంది.
కొసమెరుపు: ఒకప్పుడు ఇదే 10–డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఏళ్ల తరబడి బ్రిటన్‌ను ప్రధానిగా ఏలిన విన్‌స్టన్ చర్చిల్ హిందువులపై, భారతీయులపై అప్పట్లో అసందర్భ, అసంబద్ధ వ్యాఖ్యలు చేసి కించపరిచాడు. ఇప్పుడు ఆ హిందువుల్లోనే ఒకరు అదే 10–డౌనింగ్ స్ట్రీట్లోకి సగర్వంగా అడుగు పెట్టాడు. అది కూడా ఆ దేశ ప్రధాని హోదాలో!
– ఎస్.రాజమహేంద్రారెడ్డి
చదవండి: ముందున్నది ముళ్లదారే.. రిషికి అంత ఈజీ కాదు..!
Comments
Please login to add a commentAdd a comment