బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఆమె ఢాకా వదిలి ఇండియా వచ్చారు. ఇక్కడి నుంచి షేక్ హసీనా ఇప్పుడు లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ సంక్షోభంపై ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బంగ్లాదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆ దేశంలో సైనిక పాలన నడుస్తోంది. పౌరులను రక్షించే బాధ్యతను సైన్యం కచ్చితంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో దాదాపు 10 శాతం మంది హిందువులు నివసిస్తున్నారు. వారి భద్రత ఎంతో ముఖ్యం. హిందువుల భద్రత కోసం బంగ్లాదేశ్ ఆర్మీ పాటుపడాలి’ అని కోరారు.
కాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో సహా అనేక ఇతర నగరాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. గత రెండు రోజులుగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో వందల సంఖ్యలో జనం మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment