పంజాబ్ (పాకిస్తాన్): మైనారిటీలపై వివక్ష చూపుతూ పాకిస్తాన్ సాగిస్తున్న ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. కరోనా నేపథ్యంలో ఎవరూ ఇళ్లు దాటి బయటకు రావద్దని ప్రపంచ దేశాలు పిలుపునిస్తుంటే పాక్ మాత్రం తన సొంత గడ్డ మీద మైనారిటీ హిందువుల ఇళ్లను నేలమట్టం చేసి వికృతరూపాన్ని చాటుకుంది. ఇది ఆ దేశ మంత్రి ఆధ్వర్యంలోనే జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్పూర్‌లో మైనారిటీల నివాసాలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. నిలువనీడ లేకుండా చేయకండంటూ బాధితులు రోదిస్తూ అధికారుల కాళ్లావేళ్లా పడ్డా ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
కళ్ల ముందు ఇల్లు కూలిపోతూ శిథిలాల దిబ్బగా మారుతుంటే హిందువులు గుండెలు పగిలేలా రోదించారు. ఈ కూల్చివేతల ఘోరం ఆ దేశ గృహనిర్మాణ మంత్రి తరీఖ్ బషీర్ పర్యవేక్షణలోనే జరిగింది. ఈ ఘటనలో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా మైనారిటీ హక్కులను కాలరాస్తున్నారంటూ మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ దారుణానికి పాల్పడింది. ఇటీల ఇదే తరహా ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖనేవాల్‌లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు క్రైస్తవులకు చెందిన ఇళ్లు, స్మశానాన్ని నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశాడు.