Places of worship
-
కోర్టులు కదిపిన తేనెతుట్టెలు
దేవుడు అంతటా, అందరిలో ఉన్నాడని నమ్మే గడ్డపై... ఆయనను నిర్ణీత స్థల, కాలాలకే పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాగ్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ – యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం, దరిమిలా అక్కడ రేగిన హింసాకాండ, ఆస్తి, ప్రాణనష్టం. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనతో మందిరం – మసీదు వివాదాలు ముగిసిపోతాయని ఎవరైనా ఆశపడితే అది వట్టి అడియాసని మరోసారి తేలిపోయింది. మత రాజకీయాలకూ, వర్గ విభేదాలకూ ప్రార్థనా స్థలాలు కేంద్రాలు కారాదనే సదుద్దేశంతో చేసిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం–1991 స్ఫూర్తికే విఘాతం కలిగింది. ప్రార్థనా మందిరాల నిర్మాణమూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహం తప్పేమీ కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఒక దశలో అదాటున చేసిన వ్యాఖ్యలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. వివాదం వస్తే చాలు... దేశంలో ప్రతి చిన్న కోర్టూ అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేలా ఊతమిచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం. తాజా ఘర్షణలకు కేంద్రమైన సంభల్‌లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మథురలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్ లోని ధార్‌లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసినవారే ఇక్కడా కోర్టుకెక్కారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన 3 మసీదుల్లో (పానిపట్, అయోధ్య, సంభల్) ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్ల వాదన. జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు వస్తూనే జడ్జి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశిస్తూ, 29వ తేదీ కల్లా నివేదిక సైతం సమర్పించాలన్నారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగినా, నవంబర్ 24 నాటి రెండో సర్వే భారీ హింసకు దారి తీసింది. సర్వేకు వచ్చినవారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, దాంతో నిరసనకారులు రాళ్ళురువ్వారనీ వార్త. కాల్పుల్లో అయిదుగురు మరణించారు. అమాయకుల ప్రాణాలు, పట్నంలో సామరస్య వాతావరణం గాలికెగిరి పోయాయి.శతాబ్దాల తరబడి అన్ని వర్గాలూ కలసిమెలసి జీవిస్తున్న చోట విద్వేషాగ్ని రగులుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ చిత్రంగా ఈ ఏడాదే తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా మూడు దశాబ్దాలుగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి కంచుకోట. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్ఖ్, మెహమూద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990ల నుంచి రెండు వర్గాలూ ఎస్పీతోనే అనుబంధం నెరపుతున్నాయి. అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరాటమే తాజా హింసకు కారణమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ – ముస్లిమ్‌ల తర్వాత, ఇక ముస్లిమ్‌లలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికే కాషాయ ధ్వజులు ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఖండిస్తోంది. మొఘల్ శిల్పనిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకైతే, ఈ సంభల్ ప్రాంతం విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువుల నమ్మిక. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం చూసుకొనే కొందరి రాజకీయంతో సమస్య వచ్చి పడింది. నిజానికి, 1947 ఆగస్ట్ 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలూ కొనసాగాలి. ఒక్క అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని దీర్ఘకాలం క్రితమే కేంద్ర సర్కార్ చేసిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం. అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదన్నది దాని ప్రధానోద్దేశం. ఏ ప్రార్థనా స్థలాన్నీ పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ ఒక మతవిశ్వాసం నుంచి మరోదానికి మార్పిడి చేయరాదనీ, చర్చ పెట్టరాదనీ చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది. అయితే, ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపమేమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు సందు ఇచ్చాయి. అనేకచోట్ల చిన్న కోర్టులు మందిర– మసీదు వివాదాలపై విచారణ చేపట్టి, పర్యవసానాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశిస్తున్నాయి. సంభల్ ఘటన తర్వాతా అజ్మీర్‌లోని ప్రసిద్ధ షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ దాఖలైన కేసును రాజస్థాన్ కోర్ట్ అనుమతించడం ఓ మచ్చుతునక. సమస్యల్ని తేల్చాల్సిన గౌరవ కోర్టులే ఇలా తేనెతుట్టెల్ని కదిలించడం విషాదం.ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్‌లో ఇప్పటికే నాలుగు పిటిషన్లున్నాయి. దానిపై నిర్ణయానికి కేంద్రం, కోర్ట్ తాత్సారం చేస్తుంటే ఆ లోగా వారణాసి, మథుర, ధార్, సంభల్, తాజాగా అజ్మీర్... ఇలా అనేక చోట్ల అత్యుత్సాహం వ్యక్తమవుతోంది. ఇది శాంతి, సామరస్యాలకు పెను ప్రమాదం. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ, సర్వేలపై జోక్యానికి సుప్రీమ్ కానీ ముందుకు రాకపోవడం విడ్డూరం. ఒక వివాదాస్పద స్థలపు ధార్మిక స్వభావ అన్వేషణ చారిత్రక నిర్ధారణ, పురాతత్వ అన్వేషణతో ఆగుతుందనుకుంటే పొరపాటు. అది మత పరంగా, రాజకీయంగా రావణకాష్ఠమవుతుంది. కాశీ, మథురల్లో, ఇప్పుడు సంభల్ జరుగుతున్నది అదే. ‘ప్రతి మసీ దులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేద’ంటూ ఆరెస్సెస్ అధినేత రెండేళ్ళ క్రితం అన్నారు కానీ జరుగుతున్నది వేరు. అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతోందన్నదీ చేదు నిజం. 2019 నవంబర్‌లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించిన సుప్రీమ్ మరోసారి గట్టిగా ఆ పని చేయకుంటే కష్టమే. ఓ హిందీ కవి అన్నట్టు, మసీదులు పోనివ్వండి... మందిరాలు పోనివ్వండి... కానీ రక్తపాతం మాత్రం ఆపేయండి. మతాలకు అతీతంగా మనిషినీ, మానవత్వాన్నీ బతకనివ్వండి! -
మళ్లీ తెరుచుకోనున్న అన్ని ప్రార్థనాలయాలు
కోల్‌కతా : కరోనా ప్రభావం దేవాలయాలపైనా పడింది. లాక్డౌన్ వల్ల సుమారు రెండు నెలలుగా దేవాలయాలన్నీ మూత పడ్డాయి. అయితే, మే 31న లాక్డౌన్ లాక్డౌన్ 4.O పూర్తవుతుండగా జూన్ 1 నుంచి దేవాలయాలు సహా అన్ని రకాల ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1 నుంచి ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు సహా అన్నిరకాల ప్రార్థనా మందిరాలు పున:ప్రారంభం అవుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. కానీ, వీటిలో 10 మందికన్నా ఎక్కువ ప్రవేశించేందుకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. (పుణ్యక్షేత్రాలకు కరోనా ఎఫెక్టు) తేయాకు, జనపనార పరిశ్రమలు కూడా పూర్తి స్థాయి సిబ్బందితో నడుపుకోవచ్చని ఆమె వెల్లడించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కూడా పూర్తిస్థాయిలో పనిచేసుకోవచ్చన్నారు. సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ఆన్లైన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా కరోనా వ్యాప్తిని నిరోధించడంలో పశ్చిమ బెంగాల్ విజయం సాధించిందని ప్రకటించారు. ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న కేసులన్నీ బయట నుంచి వచ్చినవారివేనని ఆమె స్పష్టం చేశారు. కాగా, లాక్డౌన్ 4.O ముగిసిన తర్వాతి రోజు నుంచే ఆలయాలను తెరుస్తున్నట్లు కర్ణాటక రాష్ట్రం ప్రకటించిన విషయం తెలిసిందే. (‘అమిత్ షా.. మీరే రంగంలోకి దిగొచ్చుగా?’) -
‘దారి’లో ‘దేవుడు’!
నగరంలో నడిరోడ్డుపై పలు ప్రార్థనా స్థలాలు అత్యధికం అనధికారికంగానే నిర్మితం తొలగింపులో అడుగడుగునా అడ్డంకులు సమష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు ‘బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా కొనసాగుతున్న ప్రార్థనా మందిరాలను తొలగిం చడమో... మరో ప్రదేశానికి తరలించడమో చేయాలి. రెండు వారాల్లో చర్యలు తీసుకోని పక్షంలో స్వయం గా కోర్టుకు హాజరుకావాల్సిదిగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేయాల్సి ఉంటుంది.’ - జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం చేసిన వ్యాఖ్యలివి. సిటీబ్యూరో: రాజధాని సైతం ఈ తరహా ప్రార్థనామందిరాలకు ఏమాత్రం అతీతం కాదు. ఎన్నో ఏళ్లుగా ఇవి అడుగడుగునా ట్రాఫిక్ అడ్డంకుల్ని సృష్టిస్తూనే ఉన్నాయి. ‘మెట్రో’ పనులతో పలు కీలక ప్రాంతాల్లో ఈ ఇబ్బందులు మరింతగా పెరిగాయి. సమస్య పరిష్కారానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా, పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేదు. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది. నగర ట్రాఫిక్ విభాగం గణాంకాల ప్రకారం నగరంలో ఈ తర హా ప్రార్థనా స్థలాలు 253 వరకు ఉన్నాయి. వీటికి తోడు మరికొన్ని ప్రాంతాల్లో స్మశానాలు అడ్డంకులుగా మారుతున్నాయి. ఫలక్నుమలో అత్యధికం ట్రాఫిక్ కమిషనరేట్‌లోని 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 253 ‘అక్రమ’ ప్రార్థనా స్థలాలు ఉండగా వాటిలో అత్యధికం ఫలక్నుమలోనే ఉన్నాయి. ఇక్కడ గరిష్టంగా 43 కొలువైనట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. చార్మినార్ పరిధిలో అతి తక్కువ ప్రార్థనాస్థలాలు ఉన్నాయి. కాగా ఇక్కడ కేవలం ఒకే ప్రార్థనా స్థలం ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా ఉంది. ఈ అక్రమ ప్రార్థనాస్థలాల్లో మసీదులు, చిల్లాలు, దర్గాలు 129, దేవాలయాలు 117, చర్చీలు 7 ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు తొలగింపు ప్రహసనమే... అనేక సందర్భాల్లో ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్న ప్రార్థనా స్థలాల తొలగింపు పెద్ద ప్రహసనంగా మారిపోయింది. నగరంలోని పరిస్థితుల నేపథ్యంలో దీనిని అత్యంత సున్నితమైన అంశంగా పరిగణించాల్సి వస్తోంది. గతంలో కోఠిలోని ఉమెన్స్ కాలేజీ బస్టాప్ వద్ద ఉన్న నల్లపోచమ్మ ఆలయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ‘తాకడం’తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో దర్గాల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఫలితంగా వీటి విషయంపై మాట్లాడటానికే సంబంధిత అధికారులు పలుమార్లు ఆలోచించాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఈ కోణంలో అడుగు వేయాలని ప్రయత్నించినా... అనేక రాజకీయాలు అడ్డం తగులుతున్నాయి. అంతా కలిసి ముందువెళితేనే... ఎన్నో ఏళ్లుగా నగరాన్ని వేధిస్తున్న ఈ సమస్యను పరిష్కరించి, అరుణాచల్‌ప్రదేశ్ తరహాలో భాగ్యనగరాన్నీ తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు, శాఖల అధికారులతో పాటు రాజకీయ వర్గాలు కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ఒకే చోట ఉన్నాయి. వీటి విషయంలో తరచూ ఎదురవుతున్న వాదన ‘ముందు వారిది తొలగించండి’. ఈ కారణంతోనే ఏళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. సాధారణ సమయాల్లో కంటే పర్వదినాలప్పుడు ఈ ఇబ్బందులు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం ‘మెట్రో’ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సమస్య మరీ జఠిలంగా మారింది. ఉమ్మడి కమిటీలు ఏర్పాటు చేయాలి: నిపుణులు ఈ సమస్యను పరిష్కరించేందుకు ‘పీస్’ కమిటీల తరహా లోనే వివిధ వర్గాల పెద్దలతో కూడిన ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతాల వారీగా సాధారణ పౌరులు, అధికారుల, భిన్న వర్గాలకు చెందిన పెద్దలు, వ్యాపార యూనియన్ లీడర్లతో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. అంతా కలిసి సమావేశాలు ఏర్పా టు చేసుకుని సదరు ప్రార్థనా స్థలం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై క్షేత్రస్థాయిలో చర్చించాలని, పూ ర్తిగా తొలగించే విషయం కాకపోయినా కనీసం ఇబ్బందులు లేని స్థానాలకు మార్చేందుకు అందరినీ ఒప్పించగలిగితే ఈ సమస్య తీరుతుందని వారు పేర్కొంటున్నారు. అయితే ఎలాంటి వివాదం లేని ప్రత్యామ్నాయ స్థలాలను చూపడానికి జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.