భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవారాలలో పుట్టింటి నుంచి పంపరు. అంతటి శక్తి గల సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి, సర్వజగద్రక్ష ఏర్పడుతుందనే దృష్టితో ప్రాచీనులు ఈ రక్షాబంధన సంప్రదాయాన్ని ఏర్పరిచారు. చారిత్రకంగా, ఐతిహాసికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది.
సాధారణ సంప్రదాయం ప్రకారం రక్షాబంధన దినోత్సవం నాడు సోదరులకు తోబుట్టువులు రక్షాబంధనం కడితే విశాల దృక్పథంతో గ్రామ ప్రజలందరి హితాన్ని కోరుతూ పురోహితుడు ప్రజలందరికీ రక్షాబంధనం కట్టడం కూడా గమనించవచ్చు. అంతేకాదు, యుద్ధ సమయాలలో సైనికులు దేశ రక్షణకు ముందుకు నడుస్తున్నప్పుడు, సరిహద్దు ప్రాంతాలలోని యువతులు, వృద్ధులు, బాలికలు సైనికులందరికీ రక్షాబంధనం కట్టి తిలకం దిద్ది, మంగళహారతులతో సాగనంపడం రివాజు.
రక్షాబంధన మంత్రం
యేనబద్ధో బలీరాజా దానవేంద్రోమహాబలః తేనత్వామభి బధ్నామి రక్షమాచల మాచల ‘బలాధికుడు, దానశీలుడు అయిన రాక్షసరాజు బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు. అంతటి విష్ణుశక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతున్నాను. నీ చేతిని అంటి పెట్టుకుని ఉండే ఈ రక్షాకవచ ప్రభావం వల్ల దేవతలందరూ నీ పక్షాన నిలచి ఏ ప్రమాదమూ జరగకుండా నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను’ అని ఈ మంత్రానికి అర్థం.
రక్షాబంధన పండుగ పరమార్థం
ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే– ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలని. ఎంత ఖరీదైన రాఖీ అయినా కట్టుకోవచ్చు కానీ నూలు పోగుది మంచిది.
జంధ్యాల పూర్ణిమ
దైవీశక్తులతో కూడిన శ్రావణ పూర్ణిమనాడు చేసే దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం సత్ఫలితాలనిస్తాయి. దక్షిణ భారతదేశంలో శ్రావణ పూర్ణిమ నాడు ద్విజులు న దులలో, చెరువులలో లేదా కాలువ స్నానం– అదీ కుదరని పక్షంలో ఇంటి వద్దనయినా స్నానం చేసి జీర్ణ (పాత)యజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి శ్రావణ పూర్ణిమనాడు ఉపాకర్మ (ముంజవిడుపు) జరిపిస్తారు. యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరు ఈ రోజున జంధ్యం మార్చుకోవడం ఆచారం గనుక దీనిని జంధ్యాల పూర్ణిమగా పేర్కొంటారు.
హయగ్రీవజయంతి: బ్రహ్మవద్దనుంచి వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసురుని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవావతారం దాల్చిన రోజిది. ఈ రోజున విద్యార్థులు ‘జ్ఞానానందమయందేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే’అనే శ్లోకాన్ని పఠిస్తూ హయగ్రీవ రూపంలోని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఉన్నత విద్యలు ప్రాప్తిస్తాయని, జ్ఞానం వికసిస్తుందనీ ప్రతీతి. – డి.వి.ఆర్ (సోమవారం శ్రావణ పూర్ణిమ, రక్షాబంధన దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment