భోగి భాగ్యాలు
ఏ దేశంలోనైనా సరే కొన్ని సంప్రదాయాలుంటాయి. అలాగే భారతీయ సంప్రదాయంలో మాత్రం తిలదానం దగ్గరనుండి అప్తోర్యామయాగం వరకు ప్రతి తంతుకీ లో విశేషం ఉంటుంది- ఉండి తీరుతుంది. ఆ ఆంతర్యాన్ని తెలుసుకోగల పండుగల మనకుండడాన్ని ఓ అదృష్టంగా భావిస్తూ ఆ నేపథ్యాన్ని గ్రహిద్దాం!
భోగం కలిగింది భోగి. భోగమంటే ఆనందాన్ని అనుభవించడమని అర్థం. భూమి- తాను సంతృప్తిగా ధాన్యాన్ని ఇచ్చాననే ఆనందాన్ని అనుభవిస్తూ, వృషభం- తన శ్రమకి ఫలితం లభించి ధాన్యం ఇబ్బడిముబ్బడిగా గాదెలకు చేర్చగలిగాననే సంతోషంతో, యజమాని- గాదెలన్నీ నిండాయ నే ఆనందాన్ననుభవిస్తూ, పిచ్చుకలు- కంకులనిండా ఉన్న ధాన్యాన్ని తినగలుగుతున్నామనే తృప్తితో... ఇలా పశుపక్షి మానవ జీవరాశులన్నీ భోగంతో (ఆనందానుభవంతో) గడుపుకునే పండుగ కాబట్టి ‘భోగి’. ఇది మొదటి ఆంతర్యం.
నిజమైన భోగం ఆనందానుభవం ఎప్పుడంటే ఆకాశవర్షం భూమికి చేరి పంట చేతికొచ్చినప్పుడే. అందుకే ధరణి నుండి పుట్టిన గోదాదేవికి ఆకాశరాజపుత్రుడైన రంగనాథునితో కల్యాణాన్ని చే(యి)స్తారు. పంచభూతాల్లో మొదటిదైన పృథివి ఆ చివరిదైన ఆకాశంతో సమన్వయపడి ఉంటే ఇంక పంచభూతాత్మక ప్రపంచానికి తిరుగేముంది? - కాబట్టి ‘భోగి’. ఇది రెండవ ఆంతర్యం.
అభ్యంగస్నానభోగం: ప్రాతఃకాలంలోనే తల్లులందరూ తమ పిల్లల్ని నిద్రలేపి వాళ్ల మాడున నువ్వులనూనెని అద్దుతూ ‘ఆశీర్వచనాలని హృదయపూర్వకంగా చేసి, ఎక్కడా ఏ రక్తనాళంలోనూ రక్తప్రసరణ మందంగా ఉండకుండా ఉండేలా బలంగా శరీరాన్ని మర్దించి నలుగుపెట్టి, శిరోజాల్లో క్రిమికీటకాలు చేరకుండా ఉండేలా కుంకుడుపులుసుతో రుద్ది, అభ్యంగస్నానాన్ని చేయించి వాళ్లకి సుఖనిద్ర కలిగేలా చేస్తారు. స్వేదరంధ్రాలన్నీ తెరుచుకున్న కారణంగా శరీరానికి ఆనందానుభవం కల్గిస్తుంది ఈ పర్వదినం. అందుకే ఇది ‘భోగి’. ఆరోగ్యపరమైన ఆంతర్యం ఇది మూడవది.
ప్రాతరగ్ని భోగం: తెల్లవారుఝామునే నాలుగుమార్గాల కూడళ్లలోనూ మంటలు వేస్తారు. ఏవో పాతకర్రలూ పనికిరాని చెక్కముక్కలూ దీనిలో పడిపోతాయనేది రహస్యం కాదిక్కడ. శరీరానికి హాని కల్గించేవి క్రిములు. వాతావరణానికి హాని కల్గించేవి కృములు. ఈ చలీమంచూ పుష్కలంగా ఉండే ఈ కాలంలో ఆ క్రిమికృములూ ఇటు వ్యక్తులకీ అటు వాతావరణానికీ హాని కల్గిస్తూ ఉంటాయి. ఆ కారణంగా మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, మారేడు, ఉత్తరేణి, తులసి ఎండుకట్టెలతో మంటని చేసి ఆ ధూమాన్ని పీల్పింపచేస్తూ ఆ మంట వద్ద కూర్చోవలసిందన్నారు పెద్దలు. దీంతో మనలోపలి క్రిమిబాధ తొలగి శరీరారోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యానుభూతిని పొందడమనేది నాల్గవ ఆంతర్యం.
ఇక కృములన్నీ వాటంతట అవే మంటలకి ఆక ర్షింపబడి మరణించి పర్యావరణానికి హాని కల్గించ కుండా మనకి ఆనందానుభవాన్ని ఇస్తోంది కాబట్టి ఇది వాతావరణ కాలుష్య హరానందానుభూతి నియ్యడమనేది 5వ ఆంతర్యం. రంగవల్లికాభోగం: ఏ విధమైన పరిశోధనా పరికరమూ లేకుండా ఖగోళంలో ఉన్న గ్రహగతుల్నీ వాటిద్వారా వ్యక్తులకి కలిగే మేలు- కీడులని తెలియజేయడం కోసం - ఈ నేలని ఆకాశంగా చేస్తూ- గ్రహాలు తిరిగే మార్గాలని ముగ్గుగీతలుగా చేస్తూ, ఈ తీరు గ్రహ పరివర్తన కారణంగా వర్షం ఎంత పడుతుంది? ఎంత దూరంలో పడుతుంది? ఆ స్థాయి వర్షబలంతో ఏ పంట పండుతుంది? ... ఇలా అన్నింటినీ వ్యవసాయదారులు నేలమీదే చూసి తెలుసుకుని ఆనందానుభూతితో గడుపుకునేది భోగి. ఇది ఆరవ ఆంతర్యం.
వాతపట భోగం: వాతమంటే గాలి పరివర్తన దిశకి సంకేతం. పటమంటే వస్త్రం. ఒకప్పటి రోజుల్లో వస్త్రంతో చేసిన గాలిపటాలనెగురవేస్తూ ఉండేవాళ్లు. ఆ సూర్యునికి ఆహ్వానాన్ని అక్కడికి వెళ్లి పలకలేం కాబట్టి ఇక్కడినుండి గాలిపటాలనెగురవేసి స్వాగతించడంలో ఓ ఆనందానుభవాన్ని పొందడం భోగి. మరో విశేషమేమిటంటే ఉత్తరాయణం రాబోతున్న రోజున గాలి వేగం ఎంతతో ఉందో, గాలి ఏ దిశగా వీస్తోందో, దానిలో తేమ ఎంత శాతముందో, దాన్ని బట్టి రాబోయే కాలంలో పంట దిగుబడిక్కావలసిన వర్షపాతాన్ని లెక్కించగలరు రైతులు. ఆ కారణంగా వాళ్లకి- రాబోయే పంట సమాచారాన్ని తెలుసుకోగలిగా-మనే ఆనందానుభవం ‘భోగి’. ఇది ఏడవ ఆంతర్యం.
కుండలినీ భోగం: భోగము అంటే పండుగ. అది కలిగినది భోగి అంటే పాము. ఆ పాము (కుండలిని) శరీరానికి ఉత్తరంగా ఉండే శిరసులోనికి ఆయనం (ప్రయాణం) చేస్తూ మెల్లమెల్లగా సహస్రారంలో ఉండే దైవాన్ని దర్శించి ఆనందానుభవాన్ని పొందడం ‘భోగి’. ఇది యథార్థం కాబట్టే కార్తిక త్రయోదశి, చతుర్దశి, అమావాస్యలు కలిసిన అవమతిథినాడు కురుక్షేత్రయుద్ధంలో పాల్గొన్న భీష్ముడు మార్గశీర్ష (శీర్షం వైపుకి ప్రయాణింపజేసే మార్గం)- శుద్ధ దశమినాడు అంపశయ్యని చేరే ఆనందానుభవం లభించే భోగిని దాటి, అష్టమీ తిథి రోహిణీ నక్షత్రంలో కృష్ణునిలో లీనమయ్యాడు! కేవలం యోగమార్గంలో ఆనందానుభవాన్ని పొందడమే ఆయన లక్ష్యమైనా అష్టమి, రోహిణి అనే రెంటికోసమే మరికొన్ని రోజులు తన శరీరాన్ని త్యజించకుండా ఆపాడు. ఇన్ని ఆంతర్యాలతో కూడిన భోగం ‘భోగి’. ఎంత అదృష్టవంతులం! మనం ఇలాంటి పండుగంటూ ఒకటి మనకి ఉన్న కారణంగా!
ఫొటో: వీరభగవాన్ తెలగరెడ్డి, విజయవాడ
అర్కఫలభోగం
సూర్యునితో ఆకారంలోనూ, రంగులోనూ పేరులో కూడా (అర్కఫలమ్) పోలిక ఉన్న రేగుపళ్లని తలమీదుగా శరీరం నిండుగా పో(యి)స్తూ ఆశీర్వచనాన్ని అందరూ చేస్తూ ఆ ఆనందానుభవాన్ని పొందడం భోగి. సూర్యుణ్ణి ఈ పసివారి శరీరాల్లోకి ఆవహింపజేస్తూ అటు ఆ సూర్యుని ఆరోగ్యశక్తీ ఇటు ఆ సూర్యునికి గల జ్ఞానశక్తీ (ధియో యోనః ప్రచోదయాత్) అనే రెండూ ఈ ఫలాభిషేకాన్ని చేయించుకుంటున్న వ్యక్తికి లభించాలనే తీరు ఆనందానుభవం (భోగి). ఇది ఎనిమిదవ ఆంతర్యం.