the festival
-
పట్నందే పండుగ
పండుగకు పల్లెలే ఆలవాలం అంటారు! కానీ.. పట్నాలూ ఆ సోయగానికి నిలయమే! సంక్రాంతి వేళ అపార్ట్మెంట్ల ఇరుకు కారిడార్లు ముత్యాల ముగ్గులకు లోగిళ్లవుతాయి. కాలనీ కూడళ్లు భోగిమంటల్లో చలి కాచుకుంటాయి. డూడూ బసవన్నల గజ్జెల సవ్వడి వీధుల్లో మోగుతుంది. నీలాకాశంలో పతంగులు పండుగ సంబురాన్ని అంబ రాన్ని తాకిస్తాయి. అన్నిటికీ మించి పొలిమేరే హద్దుగా పల్లెల్లో తెలుగు పండుగలు సాగితే, హైదరాబాద్‌లో కులమతాలు, భిన్నరాష్ట్రవాసుల ఆవాసాలకూ వెళ్లి ఆనందాలు పంచుకుంటాయి. అలా సంస్కృతిని సంపన్నం చేసే నైజం భాగ్యనగరి సొంతం. ..:: శరాది ఫాదర్ ఆఫ్ ఫెస్టివల్.. పల్లెల్లో కనిపించే ఆవుపేడ అలుకు పూతలు, సుద్దపిండి ముగ్గులు, మధ్యలో గొబ్బెమ్మలు, మామిడాకు తోరణాల ద్వారాలు.. మాకూ ఉన్నాయంటున్నారు నిజాంపేటలోని వర్టెక్స్ లేక్‌వ్యూ కాలనీలో ఉంటున్న కన్నెగంటి అనసూయ. ప్రవృత్తి రీత్యా రచయిత్రి అయిన ఆమె తమ కాలనీలోని పండుగ వేడుకలను వర్ణిస్తూ ‘ఒడిశా, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటకలాంటి అనేక రాష్ట్రాల వాసులతో మా కాలనీ మినీ ఇండియాను తలపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వానికి రూపంలా ఉంటుంద’ని వివరిస్తారామె. ‘సంక్రాంతే కాదు ఏ పండుగకైనా తెలుగు వంటకాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలనూ మా కాలనీవాసులకు పంచుతున్నాం’ అంటారామె. ‘భోగిమంటల్లో మాతోపాటు మా మినీభారత్ అంతా చలికాచుకుంటుంది. ఓనంలో మేమూ పాలుపంచుకుంటాం. కర్వాచౌత్ రోజు జల్లెడలో నెలరాజును దర్శించుకుంటాం. పూరన్‌పోలీ కడుపార ఆరగిస్తాం. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరింట్లో ఏం పండుగైనా కాలనీ అంతా సంబురమే. పండుగలకు పల్లెలకు వెళ్లలేకపోయామనే బాధేలేదు. అక్కడికన్నా ఆడంబరంగా ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం. ఒకరకంగా ఈ పండుగలు కేవలం ఆచార వ్యవహారంగానే కాక మా అందరి మధ్య అనుబంధాలను పెంచుకునే వేదికగా ఉంటున్నాయి. ఒకరి సంస్కృతి సంప్రదాయాలను ఒకరు గౌరవించుకునే సంస్కారాన్ని ఇస్తున్నాయి. పండుగ పరమార్థం కూడా ఇదే కదా! పల్లె.. పండుగకు పుట్టిల్లయితే పట్నం దాన్నిపెంచి పోషిస్తున్న తండ్రిలాంటిది’ అన్నారు కన్నెగంటి అనసూయ. బొమ్మల కొలువులు.. పట్నంలో సంక్రాంతి సంబురాన్ని గురించి మరో ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అత్తలూరి విజయలక్ష్మీ మాట్లాడుతూ ‘మా తల్లిదండ్రులు 1950ల్లోనే గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఊళ్లో మాకెవరూ లేరు. పండుగలు పబ్బాలు అన్నీ ఇక్కడే. నేను పల్లెటూరి వాతావరణం ఎప్పుడూ మిస్సవ్వలేదు. సంక్రాంతి రోజు పల్లెవాకిట కనిపించే ముగ్గులు, అందులో గొబ్బెమ్మలు, ఇంట్లో బొమ్మల కొలువులు ఏదీ మిస్సవ్వలేదు. మా అమ్మ తన మూలాలను మరిచిపోకుండా ప్రతి సంక్రాంతికి బొమ్మల కొలువు కొలువుదీర్చేది. రామాయణం, భారత, భాగవతాల్లోని అంశాలను కాన్సెప్ట్‌గా తీసుకుని ఒక్కో ఏడాది ఒక్కోతీరు బొమ్మలకొలువు పెట్టేది. మిగిలిన ఆచారాలన్నీ పాటించినా ఈ బొమ్మల కొలువు విషయంలో నేను ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయాను. కానీ మూడో తరమైన నా కూతురుకి (రాజేశ్వరి, ఆర్టిస్ట్) మాత్రం ఈ విషయంలో అశ్రద్ధ చేయలేదు. తను అమెరికాలో ఉంటోంది. తనకీ పదేళ్ల కూతురు (సన్నిధి). నాకు మా అమ్మ నేర్పిన విషయాలను తనకు నేర్పాను. ఇప్పుడు తను నా మనవరాలికి నేర్పుతోంది. తనూ మా అమ్మలాగే ఏడాదికో కాన్సెప్ట్‌తో శ్రద్ధగా బొమ్మలను కొలువుదీరుస్తోంది. పైగా అక్కడ ఏదీ రెడీమేడ్‌గా దొరకదు. రా మెటీరియల్ తెచ్చుకుని తల్లీకూతుళ్లిద్దరూ స్వయంగా బొమ్మలు చేస్తారు. చక్కగా డెకొరేట్ చేస్తారు. మన తెలుగు పండుగలు పల్లెలనే కాదు పట్నాల పరిమితులూ దాటి ఖండాంతరాలు చేరుకున్నాయి. అక్కడా శోభిల్లుతున్నాయి. అందుకే పండుగకి పల్లె, పట్నం కాదు ఆ సంప్రదాయాన్ని, ఆ సంస్కృతిని కాపాడుకోవాలనుకునే శ్రద్ధ ముఖ్యం, అవసరం కూడా!’ అని చెప్పారు. ఎక్కడైనా సత్యం గ్రహించాలి... నిజానికి మన పండుగలన్నీ శాస్త్రీయ దృక్పథంతో ఉన్నవే. ప్రతి పండుగను జరపుకోవడం వెనక ఒక సహేతుక కారణం కనపడుతుంది అంటారు ప్రముఖ కవయిత్రి, సంఘసేవకురాలు లక్కరాజు నిర్మల. ‘మారుతున్న ప్రతి సీజన్లో మనకు పండుగలుంటాయి. మారిన ఆ వాతావరణాన్ని ఆకళింపు చేసుకోవడం, దానికి తగ్గట్టు మన ఆహార అలవాట్లను మార్చుకోవడం, దినచర్యలనూ సరిదిద్దుకోవడంలాంటివి ఈ పండుగలతో చెప్పించారు మన పెద్దలు. వీటితోపాటు సమాజంలోని అన్ని వర్గాలు కలిసే ఏర్పాటు ఇందులో ఉంటుంది. మన పండుగల్లో సైన్స్ ఉంది, ఆరోగ్య సూత్రాలున్నాయి, సామాజిక శ్రేయస్సూ ఉంది. మనుషులంతా ఒకటే అన్న భావనా ఉంది. అందుకే పండుగకు పల్లె, నగరం అన్న భేదం లేదు. ఎక్కడ జరుపుకొన్నా అది చెప్పే సత్యాన్ని గ్రహించగలగాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి’ అని వివరించారామె. -
భోగి భాగ్యాలు
ఏ దేశంలోనైనా సరే కొన్ని సంప్రదాయాలుంటాయి. అలాగే భారతీయ సంప్రదాయంలో మాత్రం తిలదానం దగ్గరనుండి అప్తోర్యామయాగం వరకు ప్రతి తంతుకీ లో విశేషం ఉంటుంది- ఉండి తీరుతుంది. ఆ ఆంతర్యాన్ని తెలుసుకోగల పండుగల మనకుండడాన్ని ఓ అదృష్టంగా భావిస్తూ ఆ నేపథ్యాన్ని గ్రహిద్దాం! భోగం కలిగింది భోగి. భోగమంటే ఆనందాన్ని అనుభవించడమని అర్థం. భూమి- తాను సంతృప్తిగా ధాన్యాన్ని ఇచ్చాననే ఆనందాన్ని అనుభవిస్తూ, వృషభం- తన శ్రమకి ఫలితం లభించి ధాన్యం ఇబ్బడిముబ్బడిగా గాదెలకు చేర్చగలిగాననే సంతోషంతో, యజమాని- గాదెలన్నీ నిండాయ నే ఆనందాన్ననుభవిస్తూ, పిచ్చుకలు- కంకులనిండా ఉన్న ధాన్యాన్ని తినగలుగుతున్నామనే తృప్తితో... ఇలా పశుపక్షి మానవ జీవరాశులన్నీ భోగంతో (ఆనందానుభవంతో) గడుపుకునే పండుగ కాబట్టి ‘భోగి’. ఇది మొదటి ఆంతర్యం. నిజమైన భోగం ఆనందానుభవం ఎప్పుడంటే ఆకాశవర్షం భూమికి చేరి పంట చేతికొచ్చినప్పుడే. అందుకే ధరణి నుండి పుట్టిన గోదాదేవికి ఆకాశరాజపుత్రుడైన రంగనాథునితో కల్యాణాన్ని చే(యి)స్తారు. పంచభూతాల్లో మొదటిదైన పృథివి ఆ చివరిదైన ఆకాశంతో సమన్వయపడి ఉంటే ఇంక పంచభూతాత్మక ప్రపంచానికి తిరుగేముంది? - కాబట్టి ‘భోగి’. ఇది రెండవ ఆంతర్యం. అభ్యంగస్నానభోగం: ప్రాతఃకాలంలోనే తల్లులందరూ తమ పిల్లల్ని నిద్రలేపి వాళ్ల మాడున నువ్వులనూనెని అద్దుతూ ‘ఆశీర్వచనాలని హృదయపూర్వకంగా చేసి, ఎక్కడా ఏ రక్తనాళంలోనూ రక్తప్రసరణ మందంగా ఉండకుండా ఉండేలా బలంగా శరీరాన్ని మర్దించి నలుగుపెట్టి, శిరోజాల్లో క్రిమికీటకాలు చేరకుండా ఉండేలా కుంకుడుపులుసుతో రుద్ది, అభ్యంగస్నానాన్ని చేయించి వాళ్లకి సుఖనిద్ర కలిగేలా చేస్తారు. స్వేదరంధ్రాలన్నీ తెరుచుకున్న కారణంగా శరీరానికి ఆనందానుభవం కల్గిస్తుంది ఈ పర్వదినం. అందుకే ఇది ‘భోగి’. ఆరోగ్యపరమైన ఆంతర్యం ఇది మూడవది. ప్రాతరగ్ని భోగం: తెల్లవారుఝామునే నాలుగుమార్గాల కూడళ్లలోనూ మంటలు వేస్తారు. ఏవో పాతకర్రలూ పనికిరాని చెక్కముక్కలూ దీనిలో పడిపోతాయనేది రహస్యం కాదిక్కడ. శరీరానికి హాని కల్గించేవి క్రిములు. వాతావరణానికి హాని కల్గించేవి కృములు. ఈ చలీమంచూ పుష్కలంగా ఉండే ఈ కాలంలో ఆ క్రిమికృములూ ఇటు వ్యక్తులకీ అటు వాతావరణానికీ హాని కల్గిస్తూ ఉంటాయి. ఆ కారణంగా మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, మారేడు, ఉత్తరేణి, తులసి ఎండుకట్టెలతో మంటని చేసి ఆ ధూమాన్ని పీల్పింపచేస్తూ ఆ మంట వద్ద కూర్చోవలసిందన్నారు పెద్దలు. దీంతో మనలోపలి క్రిమిబాధ తొలగి శరీరారోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యానుభూతిని పొందడమనేది నాల్గవ ఆంతర్యం. ఇక కృములన్నీ వాటంతట అవే మంటలకి ఆక ర్షింపబడి మరణించి పర్యావరణానికి హాని కల్గించ కుండా మనకి ఆనందానుభవాన్ని ఇస్తోంది కాబట్టి ఇది వాతావరణ కాలుష్య హరానందానుభూతి నియ్యడమనేది 5వ ఆంతర్యం. రంగవల్లికాభోగం: ఏ విధమైన పరిశోధనా పరికరమూ లేకుండా ఖగోళంలో ఉన్న గ్రహగతుల్నీ వాటిద్వారా వ్యక్తులకి కలిగే మేలు- కీడులని తెలియజేయడం కోసం - ఈ నేలని ఆకాశంగా చేస్తూ- గ్రహాలు తిరిగే మార్గాలని ముగ్గుగీతలుగా చేస్తూ, ఈ తీరు గ్రహ పరివర్తన కారణంగా వర్షం ఎంత పడుతుంది? ఎంత దూరంలో పడుతుంది? ఆ స్థాయి వర్షబలంతో ఏ పంట పండుతుంది? ... ఇలా అన్నింటినీ వ్యవసాయదారులు నేలమీదే చూసి తెలుసుకుని ఆనందానుభూతితో గడుపుకునేది భోగి. ఇది ఆరవ ఆంతర్యం. వాతపట భోగం: వాతమంటే గాలి పరివర్తన దిశకి సంకేతం. పటమంటే వస్త్రం. ఒకప్పటి రోజుల్లో వస్త్రంతో చేసిన గాలిపటాలనెగురవేస్తూ ఉండేవాళ్లు. ఆ సూర్యునికి ఆహ్వానాన్ని అక్కడికి వెళ్లి పలకలేం కాబట్టి ఇక్కడినుండి గాలిపటాలనెగురవేసి స్వాగతించడంలో ఓ ఆనందానుభవాన్ని పొందడం భోగి. మరో విశేషమేమిటంటే ఉత్తరాయణం రాబోతున్న రోజున గాలి వేగం ఎంతతో ఉందో, గాలి ఏ దిశగా వీస్తోందో, దానిలో తేమ ఎంత శాతముందో, దాన్ని బట్టి రాబోయే కాలంలో పంట దిగుబడిక్కావలసిన వర్షపాతాన్ని లెక్కించగలరు రైతులు. ఆ కారణంగా వాళ్లకి- రాబోయే పంట సమాచారాన్ని తెలుసుకోగలిగా-మనే ఆనందానుభవం ‘భోగి’. ఇది ఏడవ ఆంతర్యం. కుండలినీ భోగం: భోగము అంటే పండుగ. అది కలిగినది భోగి అంటే పాము. ఆ పాము (కుండలిని) శరీరానికి ఉత్తరంగా ఉండే శిరసులోనికి ఆయనం (ప్రయాణం) చేస్తూ మెల్లమెల్లగా సహస్రారంలో ఉండే దైవాన్ని దర్శించి ఆనందానుభవాన్ని పొందడం ‘భోగి’. ఇది యథార్థం కాబట్టే కార్తిక త్రయోదశి, చతుర్దశి, అమావాస్యలు కలిసిన అవమతిథినాడు కురుక్షేత్రయుద్ధంలో పాల్గొన్న భీష్ముడు మార్గశీర్ష (శీర్షం వైపుకి ప్రయాణింపజేసే మార్గం)- శుద్ధ దశమినాడు అంపశయ్యని చేరే ఆనందానుభవం లభించే భోగిని దాటి, అష్టమీ తిథి రోహిణీ నక్షత్రంలో కృష్ణునిలో లీనమయ్యాడు! కేవలం యోగమార్గంలో ఆనందానుభవాన్ని పొందడమే ఆయన లక్ష్యమైనా అష్టమి, రోహిణి అనే రెంటికోసమే మరికొన్ని రోజులు తన శరీరాన్ని త్యజించకుండా ఆపాడు. ఇన్ని ఆంతర్యాలతో కూడిన భోగం ‘భోగి’. ఎంత అదృష్టవంతులం! మనం ఇలాంటి పండుగంటూ ఒకటి మనకి ఉన్న కారణంగా! ఫొటో: వీరభగవాన్ తెలగరెడ్డి, విజయవాడ అర్కఫలభోగం సూర్యునితో ఆకారంలోనూ, రంగులోనూ పేరులో కూడా (అర్కఫలమ్) పోలిక ఉన్న రేగుపళ్లని తలమీదుగా శరీరం నిండుగా పో(యి)స్తూ ఆశీర్వచనాన్ని అందరూ చేస్తూ ఆ ఆనందానుభవాన్ని పొందడం భోగి. సూర్యుణ్ణి ఈ పసివారి శరీరాల్లోకి ఆవహింపజేస్తూ అటు ఆ సూర్యుని ఆరోగ్యశక్తీ ఇటు ఆ సూర్యునికి గల జ్ఞానశక్తీ (ధియో యోనః ప్రచోదయాత్) అనే రెండూ ఈ ఫలాభిషేకాన్ని చేయించుకుంటున్న వ్యక్తికి లభించాలనే తీరు ఆనందానుభవం (భోగి). ఇది ఎనిమిదవ ఆంతర్యం. -
దసరా దోపిడీ
పండగొచ్చింది...ఎవరికి..? ప్రజలకు కానే కాదు... ప్రైవేటు ట్రావెల్స్ వారికి. ఆ పండగ...ఈ పండుగ అని కాదు ఏ పండగ అయినా... వారికి పండగే... ఇక దసరా లాంటి పెద్ద పండుగ అయితే చెప్పేదేముంది.. ప్రయాణికుల అవసరాలే వీరి దోపిడీకి ఆసరా. చాన్స్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచేయడం, ఏం చేస్తాం తప్పదు కదా అని ప్రయాణికులు మారు మాట్లాడకుండా సర్దుకుపోవడం కూడా షరా మామూలే. ఆర్టీసీ వారు ప్రయాణికుల అవసరాలకు సరిపడా బస్సు సర్వీసులు తిప్పకపోవడం, ఉన్నా సరైన సౌకర్యాలు లేకపోవడం ప్రైవేటు ట్రావెల్స్ వారికి వరప్రసాదంగా మారింది. పట్నంబజారు (గుంటూరు) నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు నిత్యం లక్ష మందికి పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరేందుకు వస్తుంటారు. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులను పెంచకపోవడం తదితర కారణాల వల్ల నగరంలో ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలు భారీ సంఖ్యలో నడుస్తున్నాయి. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. నగరంలో 250 కి పైగా ప్రైవేటు ట్రావెల్స్ ఉన్నాయి. అందులోనూ 30 వరకూ ఆర్టీసీ బస్టాండ్‌కు అతి సమీపంలోనే ఉన్నాయి. బస్టాండ్ ఎదురుగానే బస్సులు నిలబెట్టి ఇష్టానుసారంగా ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్నా...పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఆర్టీసీ టిక్కెట్ ధరల కంటే ప్రైవేటు వాహనాలు అధిక ధర వసూలు చేస్తున్నా సీట్లు మాత్రం ఖాళీ ఉండడం లేదు. రోజూ 200 కు పైగా బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, శ్రీశైలం తదితర ప్రాంతాలకు నడుస్తున్నాయి. ఆర్టీసీ పరిసరాల్లో కిలోమీటరు వరకు ప్రైవేట్ వాహనాలు ఉండకూడదని నిబంధనలున్నా ప్రైవేట్ యాజమాన్యాలు వాటిని ఖాతరు చేయడంలేదు. అదేమిటని అడిగే అధికారీ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా తయారయ్యాయి. రాత్రి సమయంలో ట్రావెల్స్ వారు బస్టాండ్‌లోకి వెళ్లి ప్లాట్‌ఫాంలపై ఉన్న ప్రయాణికులను సైతం వెంటబెట్టుకు వచ్చి ట్రావెల్స్ బస్సుల్లో ఎక్కించుకెళ్తున్నా ఆర్టీసీ అధికారులకు చీమ కుట్టినట్టయినా ఉండడం లేదు. ఆర్టీసీ ఉన్నా ప్రైవేటుపైనే మోజు ఆర్టీసీ పండుగల సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటుచేసినా ప్రయాణికులు తొలి ప్రాధాన్యం ప్రైవేటుకే ఇస్తున్నారని ఆర్టీసీ అధికారులు వాపోతున్నారు. ప్రైవేటు వారు పండగ సీజన్లో టిక్కెట్‌పై రూ.200 నుంచి రూ.300 వరకు అధికంగా తీసుకుంటున్నారు. అధికారులు స్పందించి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ వారిని అరికట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.