పట్నందే పండుగ
పండుగకు పల్లెలే ఆలవాలం అంటారు! కానీ.. పట్నాలూ ఆ సోయగానికి నిలయమే! సంక్రాంతి వేళ అపార్ట్‌మెంట్ల ఇరుకు కారిడార్లు ముత్యాల ముగ్గులకు లోగిళ్లవుతాయి. కాలనీ కూడళ్లు భోగిమంటల్లో చలి కాచుకుంటాయి. డూడూ బసవన్నల గజ్జెల సవ్వడి వీధుల్లో మోగుతుంది. నీలాకాశంలో పతంగులు పండుగ సంబురాన్ని అంబ రాన్ని తాకిస్తాయి. అన్నిటికీ మించి పొలిమేరే హద్దుగా పల్లెల్లో తెలుగు పండుగలు సాగితే, హైదరాబాద్‌లో కులమతాలు, భిన్నరాష్ట్రవాసుల ఆవాసాలకూ వెళ్లి ఆనందాలు పంచుకుంటాయి. అలా సంస్కృతిని సంపన్నం చేసే నైజం భాగ్యనగరి సొంతం.
..:: శరాది
ఫాదర్ ఆఫ్ ఫెస్టివల్..
పల్లెల్లో కనిపించే ఆవుపేడ అలుకు పూతలు, సుద్దపిండి ముగ్గులు, మధ్యలో గొబ్బెమ్మలు, మామిడాకు తోరణాల ద్వారాలు.. మాకూ ఉన్నాయంటున్నారు నిజాంపేటలోని వర్టెక్స్ లేక్‌వ్యూ కాలనీలో ఉంటున్న కన్నెగంటి అనసూయ. ప్రవృత్తి రీత్యా రచయిత్రి అయిన ఆమె తమ కాలనీలోని పండుగ వేడుకలను వర్ణిస్తూ ‘ఒడిశా, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటకలాంటి అనేక రాష్ట్రాల వాసులతో మా కాలనీ మినీ ఇండియాను తలపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వానికి రూపంలా ఉంటుంద’ని వివరిస్తారామె.
‘సంక్రాంతే కాదు ఏ పండుగకైనా తెలుగు వంటకాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలనూ మా కాలనీవాసులకు పంచుతున్నాం’ అంటారామె. ‘భోగిమంటల్లో మాతోపాటు మా మినీభారత్ అంతా చలికాచుకుంటుంది. ఓనంలో మేమూ పాలుపంచుకుంటాం. కర్వాచౌత్ రోజు జల్లెడలో నెలరాజును దర్శించుకుంటాం. పూరన్‌పోలీ కడుపార ఆరగిస్తాం. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరింట్లో ఏం పండుగైనా కాలనీ అంతా సంబురమే. పండుగలకు పల్లెలకు వెళ్లలేకపోయామనే బాధేలేదు.
అక్కడికన్నా ఆడంబరంగా ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం. ఒకరకంగా ఈ పండుగలు కేవలం ఆచార వ్యవహారంగానే కాక మా అందరి మధ్య అనుబంధాలను పెంచుకునే వేదికగా ఉంటున్నాయి. ఒకరి సంస్కృతి సంప్రదాయాలను ఒకరు గౌరవించుకునే సంస్కారాన్ని ఇస్తున్నాయి. పండుగ పరమార్థం కూడా ఇదే కదా! పల్లె.. పండుగకు పుట్టిల్లయితే పట్నం దాన్నిపెంచి పోషిస్తున్న తండ్రిలాంటిది’ అన్నారు కన్నెగంటి అనసూయ.
బొమ్మల కొలువులు..
పట్నంలో సంక్రాంతి సంబురాన్ని గురించి మరో ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అత్తలూరి విజయలక్ష్మీ మాట్లాడుతూ ‘మా తల్లిదండ్రులు 1950ల్లోనే గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఊళ్లో మాకెవరూ లేరు. పండుగలు పబ్బాలు అన్నీ ఇక్కడే. నేను పల్లెటూరి వాతావరణం ఎప్పుడూ మిస్సవ్వలేదు. సంక్రాంతి రోజు పల్లెవాకిట కనిపించే ముగ్గులు, అందులో గొబ్బెమ్మలు, ఇంట్లో బొమ్మల కొలువులు ఏదీ మిస్సవ్వలేదు. మా అమ్మ తన మూలాలను మరిచిపోకుండా ప్రతి సంక్రాంతికి బొమ్మల కొలువు కొలువుదీర్చేది. రామాయణం, భారత, భాగవతాల్లోని అంశాలను కాన్సెప్ట్‌గా తీసుకుని ఒక్కో ఏడాది ఒక్కోతీరు బొమ్మలకొలువు పెట్టేది.
మిగిలిన ఆచారాలన్నీ పాటించినా ఈ బొమ్మల కొలువు విషయంలో నేను ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయాను. కానీ మూడో తరమైన నా కూతురుకి (రాజేశ్వరి, ఆర్టిస్ట్) మాత్రం ఈ విషయంలో అశ్రద్ధ చేయలేదు. తను అమెరికాలో ఉంటోంది. తనకీ పదేళ్ల కూతురు (సన్నిధి). నాకు మా అమ్మ నేర్పిన విషయాలను తనకు నేర్పాను. ఇప్పుడు తను నా మనవరాలికి నేర్పుతోంది. తనూ మా అమ్మలాగే ఏడాదికో కాన్సెప్ట్‌తో శ్రద్ధగా బొమ్మలను కొలువుదీరుస్తోంది. పైగా అక్కడ ఏదీ రెడీమేడ్‌గా దొరకదు.
రా మెటీరియల్ తెచ్చుకుని తల్లీకూతుళ్లిద్దరూ స్వయంగా బొమ్మలు చేస్తారు. చక్కగా డెకొరేట్ చేస్తారు. మన తెలుగు పండుగలు పల్లెలనే కాదు పట్నాల పరిమితులూ దాటి ఖండాంతరాలు చేరుకున్నాయి. అక్కడా శోభిల్లుతున్నాయి. అందుకే పండుగకి పల్లె, పట్నం కాదు ఆ సంప్రదాయాన్ని, ఆ సంస్కృతిని కాపాడుకోవాలనుకునే శ్రద్ధ ముఖ్యం, అవసరం కూడా!’ అని చెప్పారు.
ఎక్కడైనా సత్యం గ్రహించాలి...
నిజానికి మన పండుగలన్నీ శాస్త్రీయ దృక్పథంతో ఉన్నవే. ప్రతి పండుగను జరపుకోవడం వెనక ఒక సహేతుక కారణం కనపడుతుంది అంటారు ప్రముఖ కవయిత్రి, సంఘసేవకురాలు లక్కరాజు నిర్మల. ‘మారుతున్న ప్రతి సీజన్లో మనకు పండుగలుంటాయి. మారిన ఆ వాతావరణాన్ని ఆకళింపు చేసుకోవడం, దానికి తగ్గట్టు మన ఆహార అలవాట్లను మార్చుకోవడం, దినచర్యలనూ సరిదిద్దుకోవడంలాంటివి ఈ పండుగలతో చెప్పించారు మన పెద్దలు.
వీటితోపాటు సమాజంలోని అన్ని వర్గాలు కలిసే ఏర్పాటు ఇందులో ఉంటుంది. మన పండుగల్లో సైన్స్ ఉంది, ఆరోగ్య సూత్రాలున్నాయి, సామాజిక శ్రేయస్సూ ఉంది. మనుషులంతా ఒకటే అన్న భావనా ఉంది. అందుకే పండుగకు పల్లె, నగరం అన్న భేదం లేదు. ఎక్కడ జరుపుకొన్నా అది చెప్పే సత్యాన్ని గ్రహించగలగాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి’ అని వివరించారామె.