వేర్‌ హౌజ్‌లకు తగ్గిన డిమాండ్‌.. హైదరాబాద్‌లో సైతం.. | Warehouses Demand Decline In Southern Cities | Sakshi
Sakshi News home page

వేర్‌ హౌజ్‌లకు తగ్గిన డిమాండ్‌.. హైదరాబాద్‌లో సైతం..

Feb 17 2024 9:21 AM | Updated on Feb 17 2024 11:04 AM

Warehouses Demand Decline In Southern Cities - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాదిలోని ప్రముఖ పట్టణాలు హైదరాబాద్, బెంగళూరు గోదాముల లీజింగ్‌ గతేడాది స్వల్పంగా తగ్గినట్టు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ వెస్టిన్‌ తెలిపింది. వీటితోపాటు చెన్నై కలిపి చూస్తే 10.2 మిలియన్‌ చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ) లీజింగ్‌ నమోదైనట్టు పేర్కొంది.

2022లో లీజింగ్‌ పరిమాణం 10.7 మిలియన్‌ ఎప్‌ఎఫ్‌టీగా ఉంది. థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ సంస్థలు, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు, ఈ–కామర్స్‌ సంస్థలు గతేడాది గోదాముల లీజింగ్‌ డిమాండ్‌లో కీలక వాటా ఆక్రమించాయి. 2022లో గోదాముల లీజింగ్‌లో ఈ మూడు దక్షిణాది పట్టణాల వాటా 34 శాతంగా ఉంటే, గతేడాది 27 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో గోదాములు, లాజిస్టిక్స్‌ వసతుల లీజింగ్‌ 21 శాతం పెరిగి 37.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 2022లో ఇది 31.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగానే ఉండడం గమనించొచ్చు.  

పట్టణాల వారీగా.. 

హైదరాబాద్‌లో గతేడాది గోదాముల లీజింగ్‌ 3.1 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. 2022లో ఇది 3.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 

బెంగళూరులో లీజింగ్‌ పరిమాణం 2022లో ఉన్న 4.1 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ నుంచి 2023లో 3.6 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి తగ్గింది. 

చెన్నైలో మాత్రం 2022లో ఉన్న 2.9 మిలియన్‌ చదరపు అడుగుల నుంచి 2023లో 3.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి పెరిగింది.  

ముంబైలో 10.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్‌ నమోదైంది. 2022లో 6 మిలియన్‌ చదరపు అడుగులుగానే ఉంది.  

ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో 2022లో ఉన్న 7.3 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ నుంచి 2023లో 8.8 మిలియన్లకు పెరిగింది. 

పుణెలో 5.2 మిలియన్ల నుంచి 7 మిలియన్ల చదరపు అడుగులకు గోదాముల లీజింగ్‌ వృద్ధి చెందింది. పుణెలోని చక్‌దాన్‌ ఎండీసీ వాణిజ్య కేంద్రం ఈ వృద్ధికి దోహదపడినట్టు
వెస్టిన్‌ నివేదిక తెలిపింది. ఇది తయారీ, లాజిస్టిక్స్‌ పార్కులకు ప్రముఖ కేంద్రంగా ఉంది. 

కోల్‌కతాలో గోదాముల లీజింగ్‌ 2022లో 2.1 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంటే, 2023లో 1.6 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి తగ్గింది. 

ఈ ఏడాది సవాలే..

‘‘2024–25 కేంద్ర బడ్జెట్‌ వచ్చే కొన్నేళ్ల కాలానికి దిక్సూచీ కానుంది. మౌలిక వసతుల అభివృద్ధికి ఇటీవలి మధ్యంతర బడ్జెట్‌లో సంబంధించి చేసిన ప్రకటనలు ఈ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. 2023లో పెట్టుబడులు తగ్గుముఖం పట్టినందున 2024 భారత గోదాముల రంగానికి సవాలుగా నిలవనుంది’’అని వెస్టిన్‌ సీఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement