దసరా దోపిడీ
పండగొచ్చింది...ఎవరికి..? ప్రజలకు కానే కాదు... ప్రైవేటు ట్రావెల్స్ వారికి. ఆ పండగ...ఈ పండుగ అని కాదు ఏ పండగ అయినా... వారికి పండగే... ఇక దసరా లాంటి పెద్ద పండుగ అయితే చెప్పేదేముంది.. ప్రయాణికుల అవసరాలే వీరి దోపిడీకి ఆసరా. చాన్స్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచేయడం, ఏం చేస్తాం తప్పదు కదా అని ప్రయాణికులు మారు మాట్లాడకుండా సర్దుకుపోవడం కూడా షరా మామూలే. ఆర్టీసీ వారు ప్రయాణికుల అవసరాలకు సరిపడా బస్సు సర్వీసులు తిప్పకపోవడం, ఉన్నా సరైన సౌకర్యాలు లేకపోవడం ప్రైవేటు ట్రావెల్స్ వారికి వరప్రసాదంగా మారింది.
పట్నంబజారు (గుంటూరు)
నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు నిత్యం లక్ష మందికి పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరేందుకు వస్తుంటారు. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులను పెంచకపోవడం తదితర కారణాల వల్ల నగరంలో ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలు భారీ సంఖ్యలో నడుస్తున్నాయి. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. నగరంలో 250 కి పైగా ప్రైవేటు ట్రావెల్స్ ఉన్నాయి. అందులోనూ 30 వరకూ ఆర్టీసీ బస్టాండ్‌కు అతి సమీపంలోనే ఉన్నాయి. బస్టాండ్ ఎదురుగానే బస్సులు నిలబెట్టి ఇష్టానుసారంగా ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్నా...పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఆర్టీసీ టిక్కెట్ ధరల కంటే ప్రైవేటు వాహనాలు అధిక ధర వసూలు చేస్తున్నా సీట్లు మాత్రం ఖాళీ ఉండడం లేదు. రోజూ 200 కు పైగా బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, శ్రీశైలం తదితర ప్రాంతాలకు నడుస్తున్నాయి. ఆర్టీసీ పరిసరాల్లో కిలోమీటరు వరకు ప్రైవేట్ వాహనాలు ఉండకూడదని నిబంధనలున్నా ప్రైవేట్ యాజమాన్యాలు వాటిని ఖాతరు చేయడంలేదు. అదేమిటని అడిగే అధికారీ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా తయారయ్యాయి. రాత్రి సమయంలో ట్రావెల్స్ వారు బస్టాండ్‌లోకి వెళ్లి ప్లాట్‌ఫాంలపై ఉన్న ప్రయాణికులను సైతం వెంటబెట్టుకు వచ్చి ట్రావెల్స్ బస్సుల్లో ఎక్కించుకెళ్తున్నా ఆర్టీసీ అధికారులకు చీమ కుట్టినట్టయినా ఉండడం లేదు.
ఆర్టీసీ ఉన్నా ప్రైవేటుపైనే మోజు
ఆర్టీసీ పండుగల సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటుచేసినా ప్రయాణికులు తొలి ప్రాధాన్యం ప్రైవేటుకే ఇస్తున్నారని ఆర్టీసీ అధికారులు వాపోతున్నారు. ప్రైవేటు వారు పండగ సీజన్‌లో టిక్కెట్‌పై రూ.200 నుంచి రూ.300 వరకు అధికంగా తీసుకుంటున్నారు. అధికారులు స్పందించి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ వారిని అరికట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.