అనంత కాల భ్రమణం... రవ్వంత జీవన పయనం
కాలం దైవ స్వరూపం. ఇది భారతీయ సంప్రదాయం. భగవంతుడు తన శక్తులతో చురుకుగా ఉన్నప్పుడు సృష్టిస్తాడు. ఆయన తన శక్తినంతటినీ ఉపసంహరించుకొని, క్రియారాహిత్య స్థితిలోకి వెళ్ళినప్పుడు సృష్టికి అంతం. ఈ సృష్టి ఆద్యంతాలకు మధ్య ఉన్నదంతా కాలమే! నిజం చెప్పాలంటే, భగవంతుడు ఈ కాలస్వరూపుడే కాదు... కాలాతీతుడు. జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది – మూడూ ఏకకాలంలో ఆయనలోనే ఉంటాయి.
ఈ కాలాన్నే మానవ జీవిత సౌలభ్యం కోసం పగలు – రాత్రిగా, ‘కాలచక్రం’గా దేవుడు విభజించాడని మన నమ్మకం. దీన్నే మనం నిమిషాలుగా, గంటలుగా, రోజులుగా, సంవత్సరాలుగా విభజించుకొని, మాట్లాడుకొంటున్నాం. భిన్నమైన భాషలు, సంస్కృతులకు ఆలవాలమైన మన సువిశాల భారతదేశంలో ఒకటీ రెండూ కాదు... దాదాపు 30 దాకా వేర్వేరు కాలగణన విధానాలను అనుసరిస్తూ వచ్చాం. ఇన్ని విభిన్నమైన కాలగణన విధానాల వల్ల దాదాపుగా ప్రతి నెలా ఒకటి, రెండు ప్రాంతాల్లో స్థానిక క్యాలెండర్‌ను బట్టి నూతన సంవత్సరం వస్తుంటుంది. వేడుకలు జరుగుతుంటాయి. గందరగోళాన్ని నివారించి, ఒక ఏకరూపత తీసుకురావడం కోసం 1957లో ఇప్పటి ‘భారత జాతీయ క్యాలెండర్’ను పెట్టారన్నది చరిత్ర. ఇక, గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం జరుపుకొనే ఆంగ్ల సంవత్సరం, సంవత్సరాదిని కార్యనిర్వహణ పనుల నిమిత్తం ప్రభుత్వం అనుసరించడమనేది చూస్తూనే ఉన్నాం.
పద్ధతులు ఏవైనా, ఏ పద్ధతి ప్రకారం అది కొత్త సంవత్సరమైనా... దైవస్వరూపమైన కాలాన్ని మనం ఎలా గౌరవించాలి? మనకు ఒక సంవత్సరమైతే, దేవతల కాలమానం ప్రకారం ఒక రోజుకు సమానం. దేవతలకు ఉత్తరాయణమంతా పగలు, దక్షిణాయనమంతా రాత్రి. అంటే, దాదాపుగా 180 రోజులు ఒక అయనం అన్న మాట! పగలు – రాత్రి, మళ్ళీ పగలు – రాత్రి... ఇలా ఒక చక్రం తిరిగినట్లుగా, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, ఋతువులు, యుగాలు, శకాలు గడిచిపోతుంటాయి. ఇదొక అంతం లేని చక్ర భ్రమణం. ఎంత పరిమితమైనదో, అంత అనంతమైనది. ఎంత గతించిందో, అంత ఆగతం (భవిష్యత్తు) ఉంది. నిన్న గతిస్తుంటుంది... నేడు జరుగుతుంటుంది... రేపు ఉద్భవిస్తుంటుంది. ఈ రకంగా లయ, స్థితి, సృష్టి – ఈ మూడింటికీ కాలచక్రం ఒక ప్రతీక. శివ, విష్ణు, బ్రహ్మలు ఈ మూడింటినీ నిర్వహించే త్రిమూర్తులు.
తెల్లవారుజామున ప్రతి రోజూ మొదలై, పగలంతా గడిచి, చివరకు రాత్రితో ముగుస్తుంది. మానవ జీవితమూ అంతే... బాల్యంతో మొదలై, యౌవనమంతా గడిచి, చివరకు వృద్ధాప్యంతో ముగుస్తుంది. అనిత్యమైన ఈ శరీరాన్ని విడిచి, ఆత్మ మరో శరీరాన్ని ధరిస్తుంది. ఆ శరీరానికి మళ్ళీ బాల్యం, యౌవనం, వృద్ధాప్యం... అచ్చంగా కాలచక్రం లాగే ఇదీ పునరావృతమయ్యే ప్రక్రియ.
మరి, ఈ పునర్జన్మల చక్రభ్రమణం నుంచి మనిషి ముక్తి పొందాలంటే, కాలాతీతమైన స్థితిని పొందాలంటే, సాక్షాత్తూ కాలస్వరూపుడైన ఆ దేవదేవుడే శరణ్యం. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, ఆత్మ – పరమాత్మ వేరు వేరు అనే ద్వైత భావన ఉన్నప్పుడు ‘కాలం’ ఉంటుంది. అలా కాకుండా, ఆత్మ – పరమాత్మ ఒకటే అనే అద్వైత భావన, ఏకీకృతమైన ఆలోచనలోకి ప్రవేశించినప్పుడు, మరోమాటలో చెప్పాలంటే ‘సమాధి’ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనకు కాలం లేదు... కాలం తెలియదు... కాలాతీతులం అవుతాం. సాక్షాత్తూ కాలస్వరూపుడైన భగవంతునిలో భాగం అవుతాం. కాలాయ తస్మై నమః
ఇలా బతుకుదాం!
నిత్యజీవితం గడుపుతున్నప్పుడు కూడా కాలాతీతమైన ప్రశాంత స్థితి కోసం కొత్త ఏడాది కొన్ని తీర్మానాలు చేసుకుందాం.
► వర్తమానంలోనే జీవిద్దాం. జరిగిపో యినది ఆలోచించడమో, జరగబోయేదానికి ఆందోళనో అనవసరం.
►స్నేహ సంబంధాలను పెంచుకుందాం. తోటివారితో స్నేహసంబంధాలే మన జీవితాన్ని నిర్వచిస్తాయి.
►జీవితంలో అందరికీ, అన్నిటికీ కృతజ్ఞులమై ఉందాం. తోటివారికి సాయపడాలి. పొందిన సాయాన్నీ గుర్తుపెట్టుకోవాలి.
►ఇంటికి ఎవరొచ్చినా, సాదరంగా స్వాగతిద్దాం. ఆతిథ్యమిద్దాం. అర్థిస్తూ వచ్చిన ఎవరినీ వట్టి చేతులతో పంపవద్దు.
►అందరికీ సమన్యాయం అందేలా, స్వేచ్ఛా స్వాతంత్య్ర ప్రపంచం కోసం శ్రమిద్దాం.
► భూతదయ, కరుణ, తోటివారిని ప్రోత్స హించడం, మర్యాద మన్నన చూపడం– ఇవే మనిషితనానికి గీటు రాళ్ళు.
►ఎదుటివాళ్ళు చెప్పేది సావధానంగా విందాం. అంతకన్నా ముందుగా, మన అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకిద్దాం.
►ప్రపంచంలో ప్రతిదీ పవిత్రమైనదే. చివరకు ఈ జీవితం కూడా! అన్నిటినీ గౌరవిద్దాం.
►ప్రపంచంలో మనతో సహా, అందరిలో లోపాలుంటాయి. స్వీయలోపాలు అధిగమిద్దాం.
►ఆధ్యాత్మిక జీవితంలో సమస్త ప్రాణికోటీ గురువులే. ప్రతి జీవి నుంచీ నేర్చుకుందాం.
– రెంటాల జయదేవ