Convenience
-
ఐఆర్సీటీసీ ఫీజులో వాటాలపై వెనక్కి తగ్గిన రైల్వేస్..
ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బుకింగ్స్ ద్వారా వసూలయ్యే కన్వీనియెన్స్ ఫీజు ఆదాయంలో వాటాలు తీసుకునే విషయంలో రైల్వేస్ బోర్డ్ వెనక్కి తగ్గింది. ఐఆర్సీటీసీ ప్రయోజనాలు, మార్కెట్ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్ 1 నుంచి కన్వీనియెన్స్ ఫీజులో 50 శాతం వాటాను రైల్వే బోర్డుతో పంచుకోనున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) గురువారం స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఐఆర్సీటీసీ షేరు ధర 25 శాతం పతనమై రూ. 685 స్థాయికి క్షీణించింది. అయితే, రైల్వే బోర్డు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిసిన తర్వాత మళ్లీ కొంత కోలుకుంది. చివరికి బీఎస్ఈలో సుమారు 7 శాతం క్షీణతతో రూ. 846 వద్ద క్లోజయ్యింది. అయితే, షేర్ల విభజన అమల్లోకి వచ్చిన వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. కనిష్ట స్థాయిల్లో విక్రయించుకున్న వారు నష్టాలు మూటగట్టుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. రైలు టికెట్ చార్జీలో కన్వీనియెన్స్ ఫీజు భాగంగా ఉండదు. వెబ్ ద్వారా టికెట్ బుకింగ్ సర్వీసును అందించినందుకు ఐఆర్సీటీసీ ఈ ఫీజును వసూలు చేస్తుంది. సాధారణంగా ప్రయాణికుల నుంచి వసూలు చేసే కన్వీనియెన్స్ ఫీజు ద్వారా ఐఆర్సీటీసీ, రైల్వేస్‌కు గణనీయంగా ఆదాయం లభిస్తుంది. 2014–15లో రెండు సంస్థల మధ్య 20–80 శాతం నిష్పత్తిలో వాటాలు ఉండేవి. అప్పట్లో ఐఆర్సీటీసీకి రూ. 253 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత సంవత్సరంలో 50–50 నిష్పత్తికి సవరించినప్పుడు రూ. 552 కోట్లు వచ్చింది. కానీ 2016–17 తర్వాత కన్వీనియెన్స్ ఫీజును తొలగించారు. అయితే, 2019–20లో తిరిగి విధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కరోనా వైరస్ పరిణామాల కారణంగా ఐఆర్సీటీసీ ఆదాయాలు మెరుగుపర్చేందుకు రైల్వేస్ తన వాటాను వదులుకుంది. దీంతో 2020–21లో ఐఆర్సీటీసీకి రూ. 299 కోట్లు, ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 224 కోట్లు కన్వీనియెన్స్ ఫీజు ఆదాయం వచ్చింది. -
భారీ డిస్కౌంట్.. రూ.899లకే టికెట్!
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 899కే దేశీ రూట్లలో టికెట్ అందిస్తోంది. ‘ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్.. డిసెంబర్ 23 (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్ ఈ నెల 26న రాత్రి 11 గంటల 59 నిమిషాలకు ముగియనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్ వర్తిస్తుంది. విదేశీ ప్రయాణానికి ప్రారంభ టికెట్ ధర రూ. 2,999గా కంపెనీ ప్రకటించింది. ఇండిగో వెబ్సైట్, యాప్‌ల ద్వారా బుకింగ్ చేసుకుంటే సౌలభ్య రుసుము (కన్వీనియన్స్) లేదని వెల్లడించింది. -
సహనంతో సౌఖ్యం
ఆత్మీయం మంచి ఎండలో చాలాదూరం నుండి మంచినీళ్లు తీసుకొస్తోందామె. రెండు బిందెలను ఇంటిముందు పెట్టి చిన్నబిందెతో నీళ్లు తెచ్చి, వాటిలో పోస్తోంది. ఇంతలో ఆమె భర్త చెమటలు కక్కుతూ వచ్చాడు. ఇంటిముందున్న బిందెలను గమనించక కాలితో తన్నాడు. నీళ్ళన్నీ ఒలికిపోయాయి. కోపంతో అతను భార్యను చూసి ‘అసలు నీకు బుద్ధుందా? నీళ్ళబిందెలను వాకిలికి అడ్డం పెట్టి వెళ్తావా? నిన్ను మీ అమ్మ ఎలా కన్నదో! ఎలా పెంచిందో! బొత్తిగా తెలివితేటలు లేనిదాన్ని కట్టబెట్టారు’ అన్నాడు. చాల్లేండి, నేను బిందె తెస్తుంటే కనీసం అందుకోకుండా, నేను తెచ్చిపోసిన నీళ్లన్నీ నేలపాలు చే శారు. అది చాలక మా పుట్టింటివాళ్లని తిడతారా? ఈ ఇంట్లో నిమిషం కూడా ఉండను. మా పుట్టింటికే వెళ్ళిపోతాను.‘ అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది భార్య. ఈ కథనే కాస్త సహనం ఉంటే ఎలా ఉంటుందో చూద్దామా! నీళ్ళ బిందెలను చూడకుండా తన్నేసిన భర్త ఇలా అనుకున్నాడు. ‘అయ్యో! ఎంత కష్టపడి ఈ నీళ్లు తెచ్చిందో పాపం. నేనే కాస్త చూసి నడిచి ఉంటే బాగుండేది. ఇంటిపనితో సతమతమౌతూ కూడా నాకు ఇబ్బంది కలగకుండా నీళ్లు కూడా తనే తెస్తుంది. మళ్ళీ నీళ్ళు తేవడానికి వెళ్ళిందేమో, ఎదురెళ్ళి నీళ్ళ బిందెను అందుకుందాం’ అనుకుంటూ భార్యకు ఎదురెళ్ళి బిందెను అందుకుని – ‘పొరపాటున నీళ్లబిందెలను కాలితో తన్నేశాను. నువ్వేమీ కంగారు పడకు. కాసేపు విశ్రాంతి తీసుకో! నేను వెళ్ళి నీళ్ళు తెస్తాను’ ‘అయ్యో! ఎండనపడి వచ్చారు. దారికి అడ్డంగా పెట్టడం నా తప్పండి. నీళ్ళేకదా, పోతే పోనీయండి. భోజనం వడ్డిస్తాను కాళ్ళు కడుక్కుని రండి. బిందె తగిలి కాలికి దెబ్బేమీ తగల్లేదుకదా’ అంది భార్య. చూశారా తేడా? కాస్త సహనంతోనే జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు కదా! -
అనంత కాల భ్రమణం... రవ్వంత జీవన పయనం
కాలం దైవ స్వరూపం. ఇది భారతీయ సంప్రదాయం. భగవంతుడు తన శక్తులతో చురుకుగా ఉన్నప్పుడు సృష్టిస్తాడు. ఆయన తన శక్తినంతటినీ ఉపసంహరించుకొని, క్రియారాహిత్య స్థితిలోకి వెళ్ళినప్పుడు సృష్టికి అంతం. ఈ సృష్టి ఆద్యంతాలకు మధ్య ఉన్నదంతా కాలమే! నిజం చెప్పాలంటే, భగవంతుడు ఈ కాలస్వరూపుడే కాదు... కాలాతీతుడు. జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది – మూడూ ఏకకాలంలో ఆయనలోనే ఉంటాయి. ఈ కాలాన్నే మానవ జీవిత సౌలభ్యం కోసం పగలు – రాత్రిగా, ‘కాలచక్రం’గా దేవుడు విభజించాడని మన నమ్మకం. దీన్నే మనం నిమిషాలుగా, గంటలుగా, రోజులుగా, సంవత్సరాలుగా విభజించుకొని, మాట్లాడుకొంటున్నాం. భిన్నమైన భాషలు, సంస్కృతులకు ఆలవాలమైన మన సువిశాల భారతదేశంలో ఒకటీ రెండూ కాదు... దాదాపు 30 దాకా వేర్వేరు కాలగణన విధానాలను అనుసరిస్తూ వచ్చాం. ఇన్ని విభిన్నమైన కాలగణన విధానాల వల్ల దాదాపుగా ప్రతి నెలా ఒకటి, రెండు ప్రాంతాల్లో స్థానిక క్యాలెండర్‌ను బట్టి నూతన సంవత్సరం వస్తుంటుంది. వేడుకలు జరుగుతుంటాయి. గందరగోళాన్ని నివారించి, ఒక ఏకరూపత తీసుకురావడం కోసం 1957లో ఇప్పటి ‘భారత జాతీయ క్యాలెండర్’ను పెట్టారన్నది చరిత్ర. ఇక, గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం జరుపుకొనే ఆంగ్ల సంవత్సరం, సంవత్సరాదిని కార్యనిర్వహణ పనుల నిమిత్తం ప్రభుత్వం అనుసరించడమనేది చూస్తూనే ఉన్నాం. పద్ధతులు ఏవైనా, ఏ పద్ధతి ప్రకారం అది కొత్త సంవత్సరమైనా... దైవస్వరూపమైన కాలాన్ని మనం ఎలా గౌరవించాలి? మనకు ఒక సంవత్సరమైతే, దేవతల కాలమానం ప్రకారం ఒక రోజుకు సమానం. దేవతలకు ఉత్తరాయణమంతా పగలు, దక్షిణాయనమంతా రాత్రి. అంటే, దాదాపుగా 180 రోజులు ఒక అయనం అన్న మాట! పగలు – రాత్రి, మళ్ళీ పగలు – రాత్రి... ఇలా ఒక చక్రం తిరిగినట్లుగా, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, ఋతువులు, యుగాలు, శకాలు గడిచిపోతుంటాయి. ఇదొక అంతం లేని చక్ర భ్రమణం. ఎంత పరిమితమైనదో, అంత అనంతమైనది. ఎంత గతించిందో, అంత ఆగతం (భవిష్యత్తు) ఉంది. నిన్న గతిస్తుంటుంది... నేడు జరుగుతుంటుంది... రేపు ఉద్భవిస్తుంటుంది. ఈ రకంగా లయ, స్థితి, సృష్టి – ఈ మూడింటికీ కాలచక్రం ఒక ప్రతీక. శివ, విష్ణు, బ్రహ్మలు ఈ మూడింటినీ నిర్వహించే త్రిమూర్తులు. తెల్లవారుజామున ప్రతి రోజూ మొదలై, పగలంతా గడిచి, చివరకు రాత్రితో ముగుస్తుంది. మానవ జీవితమూ అంతే... బాల్యంతో మొదలై, యౌవనమంతా గడిచి, చివరకు వృద్ధాప్యంతో ముగుస్తుంది. అనిత్యమైన ఈ శరీరాన్ని విడిచి, ఆత్మ మరో శరీరాన్ని ధరిస్తుంది. ఆ శరీరానికి మళ్ళీ బాల్యం, యౌవనం, వృద్ధాప్యం... అచ్చంగా కాలచక్రం లాగే ఇదీ పునరావృతమయ్యే ప్రక్రియ. మరి, ఈ పునర్జన్మల చక్రభ్రమణం నుంచి మనిషి ముక్తి పొందాలంటే, కాలాతీతమైన స్థితిని పొందాలంటే, సాక్షాత్తూ కాలస్వరూపుడైన ఆ దేవదేవుడే శరణ్యం. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, ఆత్మ – పరమాత్మ వేరు వేరు అనే ద్వైత భావన ఉన్నప్పుడు ‘కాలం’ ఉంటుంది. అలా కాకుండా, ఆత్మ – పరమాత్మ ఒకటే అనే అద్వైత భావన, ఏకీకృతమైన ఆలోచనలోకి ప్రవేశించినప్పుడు, మరోమాటలో చెప్పాలంటే ‘సమాధి’ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనకు కాలం లేదు... కాలం తెలియదు... కాలాతీతులం అవుతాం. సాక్షాత్తూ కాలస్వరూపుడైన భగవంతునిలో భాగం అవుతాం. కాలాయ తస్మై నమః ఇలా బతుకుదాం! నిత్యజీవితం గడుపుతున్నప్పుడు కూడా కాలాతీతమైన ప్రశాంత స్థితి కోసం కొత్త ఏడాది కొన్ని తీర్మానాలు చేసుకుందాం. ► వర్తమానంలోనే జీవిద్దాం. జరిగిపో యినది ఆలోచించడమో, జరగబోయేదానికి ఆందోళనో అనవసరం. ►స్నేహ సంబంధాలను పెంచుకుందాం. తోటివారితో స్నేహసంబంధాలే మన జీవితాన్ని నిర్వచిస్తాయి. ►జీవితంలో అందరికీ, అన్నిటికీ కృతజ్ఞులమై ఉందాం. తోటివారికి సాయపడాలి. పొందిన సాయాన్నీ గుర్తుపెట్టుకోవాలి. ►ఇంటికి ఎవరొచ్చినా, సాదరంగా స్వాగతిద్దాం. ఆతిథ్యమిద్దాం. అర్థిస్తూ వచ్చిన ఎవరినీ వట్టి చేతులతో పంపవద్దు. ►అందరికీ సమన్యాయం అందేలా, స్వేచ్ఛా స్వాతంత్య్ర ప్రపంచం కోసం శ్రమిద్దాం. ► భూతదయ, కరుణ, తోటివారిని ప్రోత్స హించడం, మర్యాద మన్నన చూపడం– ఇవే మనిషితనానికి గీటు రాళ్ళు. ►ఎదుటివాళ్ళు చెప్పేది సావధానంగా విందాం. అంతకన్నా ముందుగా, మన అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకిద్దాం. ►ప్రపంచంలో ప్రతిదీ పవిత్రమైనదే. చివరకు ఈ జీవితం కూడా! అన్నిటినీ గౌరవిద్దాం. ►ప్రపంచంలో మనతో సహా, అందరిలో లోపాలుంటాయి. స్వీయలోపాలు అధిగమిద్దాం. ►ఆధ్యాత్మిక జీవితంలో సమస్త ప్రాణికోటీ గురువులే. ప్రతి జీవి నుంచీ నేర్చుకుందాం. – రెంటాల జయదేవ