సహనంతో సౌఖ్యం
ఆత్మీయం
మంచి ఎండలో చాలాదూరం నుండి మంచినీళ్లు తీసుకొస్తోందామె. రెండు బిందెలను ఇంటిముందు పెట్టి చిన్నబిందెతో నీళ్లు తెచ్చి, వాటిలో పోస్తోంది. ఇంతలో ఆమె భర్త చెమటలు కక్కుతూ వచ్చాడు. ఇంటిముందున్న బిందెలను గమనించక కాలితో తన్నాడు. నీళ్ళన్నీ ఒలికిపోయాయి. కోపంతో అతను భార్యను చూసి ‘అసలు నీకు బుద్ధుందా? నీళ్ళబిందెలను వాకిలికి అడ్డం పెట్టి వెళ్తావా? నిన్ను మీ అమ్మ ఎలా కన్నదో! ఎలా పెంచిందో! బొత్తిగా తెలివితేటలు లేనిదాన్ని కట్టబెట్టారు’ అన్నాడు. చాల్లేండి, నేను బిందె తెస్తుంటే కనీసం అందుకోకుండా, నేను తెచ్చిపోసిన నీళ్లన్నీ నేలపాలు చే శారు. అది చాలక మా పుట్టింటివాళ్లని తిడతారా? ఈ ఇంట్లో నిమిషం కూడా ఉండను. మా పుట్టింటికే వెళ్ళిపోతాను.‘ అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది భార్య. ఈ కథనే కాస్త సహనం ఉంటే ఎలా ఉంటుందో చూద్దామా!
నీళ్ళ బిందెలను చూడకుండా తన్నేసిన భర్త ఇలా అనుకున్నాడు. ‘అయ్యో! ఎంత కష్టపడి ఈ నీళ్లు తెచ్చిందో పాపం. నేనే కాస్త చూసి నడిచి ఉంటే బాగుండేది. ఇంటిపనితో సతమతమౌతూ కూడా నాకు ఇబ్బంది కలగకుండా నీళ్లు కూడా తనే తెస్తుంది. మళ్ళీ నీళ్ళు తేవడానికి వెళ్ళిందేమో, ఎదురెళ్ళి నీళ్ళ బిందెను అందుకుందాం’ అనుకుంటూ భార్యకు ఎదురెళ్ళి బిందెను అందుకుని – ‘పొరపాటున నీళ్లబిందెలను కాలితో తన్నేశాను. నువ్వేమీ కంగారు పడకు. కాసేపు విశ్రాంతి తీసుకో! నేను వెళ్ళి నీళ్ళు తెస్తాను’ ‘అయ్యో! ఎండనపడి వచ్చారు. దారికి అడ్డంగా పెట్టడం నా తప్పండి. నీళ్ళేకదా, పోతే పోనీయండి. భోజనం వడ్డిస్తాను కాళ్ళు కడుక్కుని రండి. బిందె తగిలి కాలికి దెబ్బేమీ తగల్లేదుకదా’ అంది భార్య. చూశారా తేడా? కాస్త సహనంతోనే జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు కదా!