అలయ్–బలయ్ కార్యక్రమంలో డప్పు కొడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. చిత్రంలో కిషన్‌రెడ్డి, బండిసంజయ్, దత్తాత్రేయ తదితరులు
సాక్షి, హైదరాబాద్: కుల, ప్రాంత, వర్గాలకు అతీతంగా సమాజాన్ని ఒకచోటకు చేర్చగలిగే శక్తి సంస్కృతికి ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్–బలయ్ కార్యక్రమమని, అస్తిత్వాన్ని కాపాడుకోవడంతో పాటు దేశ సాంస్కతిక పునరుజ్జీవనం మనందరి బాధ్యత అని తెలిపారు. ఆదివారం నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రే య ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దత్తన్న అలయ్ బలయ్–దసరా సమ్మేళన్’కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మా ట్లాడుతూ, భారతదేశానికే ప్రత్యేకమైన అస్తిత్వం ఇంకా నిలబడి ఉండడానికి కారణం మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణేనని అలయ్–బలయ్ కూడా అలాంటి కార్యక్రమమేనని తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్ర, విజ్ఞాన, పరిశోధన రంగాల్లో విశేష కృషి జరిపినందుకుగాను భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి, రెడ్డిలాబ్స్ ఎండీ జీవీ ప్రసాద్‌రెడ్డి, బయోలాజికల్ ఈవాన్స్ మహీమా దాట్లను నిర్వాహకుల తరఫున ఉపరాష్ట్రపతి సన్మానించారు.
సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుచేసుకునేందుకే: దత్తాత్రేయ
భిన్న సంస్కృతులు, ఆచారాలు, భావజాలాలున్నా అందరూ ఆత్మీయంగా ఒకచోట కూడి ఆడిపాడి, భిన్నరుచులతో కూడిన భోజనం చేయడం, మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకోవడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, అక్కడి నుంచి మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం ఉండడంతో రాలేకపోయారని చెప్పారు.
రాజకీయాల్లో ఉన్న వారంతా శత్రువులు కాదు
రాజకీయాల్లో ఉన్న వారంతా శత్రువులు కాదని, రాజకీయ ప్రత్యర్థులం మాత్రమేనని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. అందరూ ఐకమత్యంగా ఉండాలన్న భావనతోనే బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. భిన్నసంస్కృతులు, ఆచారాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఇలాంటి ఉత్సవాలను ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహించాల్సిన అవసరం ఉందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లెకర్ అన్నారు.
హైదరాబాద్‌లో జరిగే అలయ్ బలయ్ వంటి ఉత్సవాలు దేశంలోనే ఎక్కడా జరగవని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంచికి, సహృదయతకు దత్తాత్రేయ ప్రతిరూపంగా నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ప్రాంతీయతలు, ఎజెండాలకు అతీతంగా భాషలు వేరైనా మనమంతా ఒక్కటేననే సంస్కృతిని దత్తాత్రేయ ముందుకు తీసుకెళుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు.
బండారు దత్తాత్రేయ సతీమణి వసంత, ఆహ్వాన కమిటీ తరఫున దత్తాత్రేయ వియ్యంకులు బి.జనార్దనరెడ్డి, బండారు విజయలక్ష్మి–డాక్టర్ జిగ్నేష్‌రెడ్డి దంపతులు, చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళా కెప్టెన్ రేష్మా రెజ్వాన్, డా.షేక్ హసీనా, గాయకురాలు మధుప్రియ, అనూహ్యరెడ్డి, ప్రవీణ్‌కుమార్ గోరకవిలను ఈ సందర్భంగా సన్మానించారు.
పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు...
శాసనమండలి ప్రొటెమ్ చైర్మన్ ఎం.భూపాల్‌రెడ్డి, రాష్ట్ర హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి, సినీనటులు మంచు విష్ణు, కోట శ్రీనివాసరావు, ఎంపీ కె.కేశవరావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, వి.హనుమంతరావు, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్, బీసీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అలయ్–బలయ్ కార్యక్రమంలో కోలాటమాడుతున్న గవర్నర్లు దత్తాత్రేయ, తమిళిసై. చిత్రంలో దత్తాత్రేయ కుమార్తె..
Comments
Please login to add a commentAdd a comment