బంధాలను కాపాడుకోవాలి!
ఆత్మీయం
కుటుంబ వ్యవస్థను నిర్మించినవాడు దేవుడు! ఆ కుటుంబ బంధాలు అత్యంత పవిత్రంగా అనురాగ భరితంగా ఉండాలని నిర్దేశించినవాడూ దేవుడే! మనిషిని ఒక తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా, చెల్లెలిగా, తమ్ముడిగా సృష్టించి ఆ బంధాల్లో ఇమిడ్చి పెట్టిన దేవుడు, ఆ బంధాల్లో అతను అనురాగభరితంగా జీవించాలని ఆశించిన దేవుడు అవే బంధాలను ఆధారం చేసుకొని తన ప్రేమను వ్యక్తీకరించడం అసమానం. కాని ఈనాడు వాస్తవానికి ఏం జరుగుతోంది? దురదృష్టవశాత్తూ పెచ్చరిల్లిన వాణిజ్య సంస్థలు, పాశ్చాత్య పోకడలు... కుటుంబ బంధాలను కూడా కలుషితం చేసి కకావికలం చేసి... దేవుడు నిర్మించిన కుటుంబ వ్యవస్థనే బలహీనపర్చి కూలదోస్తున్నాయి.
దీని నుంచి బయట పడాలి. అంతా కళ్లు తెరవాలి, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. కుటుంబ బంధాలకు అతీతంగా మనిషి బతకలేడు. ఆప్తుల చావు వల్లో, అప్పులతోనో, సమస్యలతోనో, ఒంటరితనంతోనో అలమటిస్తున్న వారిని బాధపడవద్దని వెన్నుతట్టి ‘నీకు నేనున్నాను, మనందరికీ పైన దేవుడున్నాడు’ అని ఓదార్చడం వారికి ఎంత ఉపశమనాన్నిస్తుందో తెలుసా? ప్రయత్నించి చూడండి.