సర్వ్ నీడీ సంకల్పం
లక్ష్యం: రోజుకు 500 మందికి పైగా ఆకలి తీర్చడం
ప్రాజెక్టు పేరు: అన్నదాత
కార్యాచరణ: ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు సేకరించడం. ప్రభుత్వ ఆస్పత్రులు, అనాథ, వికలాంగ, వృద్ధాశ్రమాల వద్దకు స్వయంగా వెళ్లి వందలాది మంది అన్నార్తుల కడుపునింపడం.
నెట్‌వర్క్: దాదాపు 40 మంది వలంటీర్ల సహాయంతో సేవలందిస్తూ... ఆహార సేకరణకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. ఫోన్ చేసి చెప్పినా వెంటనే వెళ్తారు.
బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారికి వటవృక్షం భాగ్యనగరం. ఆశగా వచ్చినవారిని అక్కున చేర్చుకునే అమ్మలాంటి నగరం. బతుకు దారి చూపించి అండగా నిలుస్తుంది. ఇంతటి నగరంలో ఆకలితో అలమటించేవారు కోకొల్లలు. ఎండుతున్న గొంతును తడుముకుంటూ.. ప్రాణం కళ్లలో నింపుకుని గుక్కెడు గంజి గొంతులో పోసేవారు లేకపోతారా అని ఆశతో ఎదురుచూసే అవ్వ నిత్యం ఏ వీధి మలుపులోనో మనకు తారసపడే ఉంటుంది.. ఎండిన డొక్కను నులుపుకొంటూ.. ఆకలి కేకలని పంటిబిగువున అదుముకుంటూ.. ఎవరైనా బుక్కెడు బువ్వ పెడితే బాగుండునని ఆత్రంగా చూసే తాతలు దారిలో కనిపిస్తూనే ఉంటారు. ఒక్క క్షణం ఆగిచూస్తే ‘ఆకలి’ బాధ తెలిసినవారి కళ్లు చెమర్చక మానవు. ప్రాణం ఏదైనా ఆకలి అందరికీ సమానమే కదా..! అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అనుకుంటే ఆ అవ్వ.. తాత కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. అందరి ఆకలి తీరాలి.. అందులో కొందరినైనా నేను ఆదుకోవాలని భావిస్తే నీకన్నా దేవుడు మరొకరు ఉండరు. మన కంచంలో ఒక్క ముద్ద ఓ నిరుపేద బిడ్డ ఆకలి తీర్చినప్పుడే కదా ఈ జన్మకు సార్థకత. మనసు తలుపు తెరవండి. నగరంలో ఎందరో అన్నార్తులను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలను ఆదర్శంగా తీసుకోండి. కొందరి ఆకలినైనా తీర్చేందుకు కదలండి. నేడు వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఆకలి అందరికీ సమానమే. కానీ అనుభవాలు మాత్రం భిన్నం. రాత్రీ,పగలు ఒకేలా ఉండే భాగ్యనగరంలో ‘ఈ పూట ఎలా గడపాలి’.. అని ఆలోచించే మనుషులున్నచోటే ‘ఈ పూట ఎలా గడిచేది’ అని మథనపడే కుటుంబాలు కోకొల్లలు. అజీర్తి–ఆకలి రెండూ నగరమనే ఒకే బొజ్జలో సహవాసం చేస్తున్న తీరుకు ఇలాంటి నిదర్శనాలెన్నో. ఖరీదైన వంటకాలు వడ్డించే స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు కనీసం 15 నుంచి 20 శాతం ఆహారాన్ని వృథా చేస్తుంటాయని ఓ ఫుడ్ ఎనలిస్ట్ అంటున్నారు. ఇక ఫుడ్ ఐటమ్స్ సంఖ్యతో స్టేటస్‌ను కొలుచుకునే సంపన్నుల వేడుకల్లో వృధా అయ్యే పరిమాణాన్ని కొలవనేలేం. వ్యధని, వృథాని సమన్వయం చేయగలిగితే.. తినడం, తినిపించడం రెండూ కడుపు నిండేవే అని గుర్తించగలిగితే.. ఈ నేలపై ఆకలి కేకలు ఉండవు. అజీర్తి రోగాలూ దరిచేరవు. ఈ పరిస్థితులను వీలైనంత మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా వృథా.. వ్యధపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సాక్షి, సిటీబ్యూరో:
ఒక్క పూట పెట్టినా చాలు..
పాతికేళ్ల ఎన్‌ఆర్‌ఐ ముస్తాఫా అలీ హష్మీ ఏడేళ్ల క్రితం ప్రారంభించిన సేవా సంస్థ ‘గ్లోటైడ్ సొసైటీ డెవలప్‌మెంట్’. వృథా అవుతున్న ఆహారాన్ని నగరవాసుల నుంచి సేకరించి ఆకలితో అలమటిస్తున్నవారికి అందిస్తోంది. కార్పొరేట్ కంపెనీలు, కేటరింగ్ సంస్థలు, హోటల్స్ నుంచి ప్రతిరోజూ భారీ పరిమాణంలో ఆహారాన్ని వీరు సేకరించి దాదాపు 200 మందికి పెడుతున్నారు. ‘‘కేవలం నీళ్లతో కడుపునింపుకుంటూ 11 రోజులుగా అన్నం దొరకని వ్యక్తిని కలిశాను. అతనే ఈ సంస్థ ఏర్పాటుకు స్ఫూర్తి’ అంటారు ముస్తాఫా. అంతేకాదు.. దాతల సాయంతో అనాథ పేద పిల్లలకు కోరిన ఆహారం పెడుతున్నారు.
సేవ.. ఆకాశమంత
ఆకలి బాధ తెలిసిన కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు, ల్యాబ్ టెక్నీషియన్లు చేయిచేయి కలిపారు. అన్నార్థులకు అండగా నిలబడేందుకు ఒక్కటయ్యారు. అలా 2012లో వారి ఆలోచనల నుంచి ‘స్కై ఫౌండేషన్’ ప్రాణం పోసుకుంది. రోడ్డు పక్కన బిచ్చగాళ్లు, అనాథలు, మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నవారు.. ఇలా ఎందరో అభాగ్యులకు ఈ ఫౌండేషన్ అన్నదానం చేస్తూ ఆకలి తీరుస్తోంది. ప్రతి నెలా రెండు, నాలుగో ఆదివారం క్రమం తప్పకుండా ఈ అన్నదానం నిర్వహిస్తారు. ఇటీవలే 92వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన స్కై ఫౌండేషన్ జనగాం, యాదాద్రిలో తమ సేవాలను విస్తరించింది. ‘అన్నం వృధా చేయవద్దు. దాని విలువ తెలుసుకుని, మీ పిల్లలకు, స్నేహితులకు చెప్పండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం దేవునికి పెట్టడం లాంటిదే’నని ప్రచారం చేస్తున్నారు ఫౌండేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సంజీవ్‌కుమార్, పావని.
వృద్ధాశ్రమాల్లో దీనగాధ..
నగరంలో లెక్కకు మించి వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా బతికినవారు.. ఎంతోమందికి నచ్చిన ఆహారం వండి పెట్టినవారు సైతం ఇప్పుడు ఇక్కడ జిహ్వ చంపుకొని బతుకీడుస్తున్నారు. ఇక్కడి వారిని కదిలిస్తే మనసుకు, జిహ్వకు మధ్య యుద్ధం జరుగుతుందనిపిస్తోంది. మంచి ఆహారం తినాలని ఉన్నా అది ఊహకకే అందదు. వారి మాటల్లోనే..
బస్తీల్లో ‘ఆశ’ల కలలు ఇవీ..
బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని సింగాడబస్తీ, సింగాడికుంట, నాయుడునగర్, ఉదయ్‌నగర్‌లోని పలువురు చిన్నారులను భోజనం విషయంలో కదిలించినప్పుడు తమకు ఇష్టమైన ఆహారం తినడం గగనమేనన్నారు. చికెన్ బిర్యాని తినాలని ఉన్నా తమ స్తోమతకు చాలా దూరమంది చిన్నారి అరుణ. నెలలో ఒకరోజు ఇంట్లో చికెన్ కూర వండినప్పుడే పండుగంది. కూలిపనులు చేసుకుని బతికే ఇలాంటి కుటుంబాలు నగరంలో కోకొల్లలు. ఇక్కడి పిల్లలకు రోజుకు ఓ గుడ్డు తినాలనుకోవడం అత్యాశ కిందే లెక్క.
బసవ తారకం వద్ద ఆకలి కేకలు
బంజారాహిల్స్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి పరిసరాల్లో నిత్యం కనిపించే సన్నివేశాలు మానవత్వాన్ని తట్టిలేపుతాయి. తమవారిని బతికించుకునేందుకు వైద్యం కోసం సూదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ ఉండేందుకే కాదు.. ఆకలి తీర్చుకునేందుకు కూడా అవస్తలు పడుతుంటారు. ఆస్పత్రిలో రోగులు వైద్యం పొందుతుంటే.. అయినవాళ్లు మాత్ర రోడ్డు పక్కన ఎండా,వాన, చలిని భరిస్తూ ఆరుబయటే గడిపే ఎంతోమంది ఇక్కడ కనిపిస్తారు. వారిని పలకరిస్తే కళ్లు చెమర్చక మానవు.
ఆహారం జమ.. ఆనందం విత్‌డ్రా
తిండి ‘కొన’లేని వారికీ.. తినలేక పారబోసే వారికీ మధ్య వారధిగా నిలుస్తోంది ‘హైదరాబాద్ ఫుడ్ బ్యాంక్’. అయితే ఇచ్చే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా చూడమని సూచిస్తోంది. ఇంట్లో చేసిన ఆహారాన్ని మాత్రమే సేకరించి పంపిణీ చేస్తామంటున్నారు సంస్థ ప్రతినిధులు అబ్దుల్ అజీజ్, దిలీప్, ఇక్బాల్, సత్య, అబ్దుల్ సలామ్. తరచూ ఫుడ్ డ్రైవ్స్ నిర్వహిస్తూ ఒక్కో డ్రైవ్‌లో ఆకలితో ఉన్న 500 మందికి పైగా పేదలకు పంచుతున్నారు. ఇందులో వికలాంగులతో పాటు ఫుట్‌పాత్‌ల మీద నివసించేవారికి అందిస్తున్నారు. ఆహారం దానం చేయాలనుకున్నవారు రోజూ కాకపోయినా, వారంలో ఓ రోజు సాంబారన్నం/ వెజిటబుల్ రైస్, పండ్లు, ఇడ్లీ, దోసలు.. ఇలా ఏదైనా సరే వండి ప్యాక్ చేసి స్థానిక కో–ఆర్డినేటర్‌కి అందించాలన్నారు. ఆసక్తి ఉంటే పంపిణీలో సైతం పాల్గొనవచ్చంటున్నారు.
నిత్యాన్నదాన సేవ సర్వ్ నీడీ..
సికింద్రాబాద్ కార్ఖానాలో ఉన్న సర్వ్ నీడీ సంస్థ ప్రతిరోజు 500 మందికి పైగా అన్నదానం చేస్తోంది. దీన్ని ‘అన్నదాత’ ప్రాజెక్ట్‌గా చేపట్టి సేవలందిస్తోంది. అన్నం, సాంబార్, కూర, ఫ్రైయాన్స్, బిస్కెట్స్, కోడిగుడ్డు, మూడు రకాల ఫ్రూట్స్.. ఇదీ ఇక్కడి మెనూ. నగరంలోని ఆకలి కేకలు వినిపించకూడదనేది తమ ఆశయం అంటున్నారు సర్వ్ నీడి సంస్థ ఫౌండర్ గౌతమ్ కుమార్. నగరంలోని ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్‌లో ఫుడ్ మిగిలినా వెంటనే ఈ సంస్థకు కాల్ చేస్తారు. ఇక్కడి ఫుడ్ సేకరించి వీధుల్లో ఆకలితో అలమటించే వారికి, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర పంచి పెడతారు. పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, చనిపోయిన జ్ఞాపకార్థం ఆహారం పెట్టాలనుకునేవారు సైతం ఇక్కడికి వస్తుంటారు. మొదట్లో 20 మందికి మాత్రమే అన్నదానం చేసిన ఈ సంస్థ ప్రస్తుతం నగరంలోని హయత్నగర్, రాజేంద్రనగర్, శామీర్‌పేట్, అల్వాల్, సుచిత్ర, లోవర్ ట్యాంకుబండ్‌లో వందలాది మందికి ఆహారం పెడుతోంది.
ఆహారం అందించాలనుకునేవారు
91605 08054/97005 24806 నెంబర్లలో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment