సాక్షి, అమరావతి/తెనాలి: కాకానీస్ స్టోరీ.. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ (ఎఫ్‌ఏవో) ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ప్రసారం చేయనున్న లఘుచిత్రం/న్యూస్ స్టోరీ శీర్షిక ఇది. ఫుడ్ హీరోస్ ప్రచారంలో భాగంగా ప్రకృతి వ్యవసాయంలో చక్కటి ఫలాలు అందుకుంటున్న ఓ రైతు కృషి, తోటి రైతులను ప్రభావితం చేస్తున్న తీరును ప్రతిబింబించిన కథనమిది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 40 వేల మందికి పైగా వీక్షించిన ‘కాకానీస్ స్టోరీ’ కథానాయకుడు ఓ తెలుగోడు. తెనాలి రైతు. పేరు కాకాని శివన్నారాయణ. రోమ్ ప్రధాన కేంద్రంగా కలిగిన యునైటెడ్ నేషన్స్ ఎఫ్‌ఏఓ సంస్థ బృందం.. ప్రకృతి వ్యవసాయంపై డాక్యుమెంటరీ కోసమని రెండేళ్ల క్రితం రాష్ట్రంలో పర్యటించింది. కృష్ణానదీ తీరంలో పర్యటిస్తున్న సమయంలో అప్పటికే చాలాచోట్ల భారీ గాలులు అరటి తోటల్లో చెట్ల వెన్ను విరిగింది. కానీ, తీరానికి దగ్గరలోని కొల్లిపర మండలం అన్నవరం గ్రామంలో శివన్నారాయణ అరటి తోట ఆరోగ్యంగా నిలబడే ఉంది. రైతును కలిసి సమాచారం సేకరించి, వీడియో రికార్డు చేశారు. అర ఎకరం భూమిలో పసుపు/అరటి సాగుతో నష్టపోతూ వస్తున్న శివన్నారాయణ.. తాను ప్రకృతి వ్యవసాయం చేపట్టి, ఎలా లాభాల బాట పట్టిందీ అందులో వివరించాడు.
రసాయన ఎరువులను మానేసి, ఘన, జీవామృతాల వినియోగంతో పెట్టుబడి రూ.20 వేల నుంచి రూ.3,500కు తగ్గిన వైనాన్ని వివరించి, ఆశ్చర్యపరిచాడు. అంతర పంటలుగా కూరగాయలు వేస్తూ, ఏటా రూ.70-80 వేల ఆదాయం తీస్తున్న విధానాన్నీ పూసగుచ్చాడు. ప్రకృతి వ్యవసాయంతో భూమి గుల్లబారి, చేలో ఎక్కువ ఎరలుండటాన్నీ చూపాడు. అధికారుల ప్రోత్సాహంతో ఇంటర్నల్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌గా ఇప్పుడు తోటి రైతులకు ఈ విధానంలో శివన్నారాయణ శిక్షణనిస్తున్నాడు. అందుకే ఫుడ్ హీరోస్ ప్రచారంలో ఎఫ్‌ఏవో సంస్థ.. ‘వ్యవసాయ క్షేత్రమనే పాఠశాల నుంచి రైతు, వ్యవసాయ శాస్త్ర శిక్షకుడిగా మారినప్పుడు..’ అంటూ ‘కాకానీస్ స్టోరీ’ గా శివన్నారాయణ కథనాన్ని రూపొందించటం విశేషం. ఇదే సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ శుక్రవారం శివన్నారాయణను గుంటూరులో సత్కరించనున్నట్లు ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజరు కె.రాజకుమారి తెలిపారు. మరోవైపు.. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా భారత్‌లో ఎఫ్‌ఏవో 75వ వార్షికోత్సవ, ప్రపంచ ఆహార దినోత్సవ స్మారక నాణాన్ని ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
ఎందుకీ దినోత్సవం..
అంతర్జాతీయంగా ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు ఎఫ్‌ఏవో 1979లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. పోషకాహార లోపం, సూక్ష్మపోషక లోపాలు, అధిక బరువు, పర్యావరణ, భూసార పరిరక్షణ, అందరికీ ఆహారం లక్ష్యంతో ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రైతు సాధికార సంస్థ సీఈవో డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి తిండి గింజల్ని అందించేలా ఏపీ సర్కారు కూడా ప్రణాళికలు రచించినట్లు ఆయన వివరించారు. ప్రకృతి సాగు. సహజ వనరులు, జీవవైవిధ్యాన్ని కాపాడడంతో పాటు వాతావరణ మార్పు వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి రైతుల్ని సిద్ధంచేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment