naeem
-
నయీమ్ కంపెనీలో ఖాకీలు!
గ్యాంగ్‌స్టర్‌తో పోలీసు అధికారులు కలసి ఉన్న ఫొటోలు బహిర్గతం - దొరికిపోయిన ఐదుగురు అధికారులు.. పోలీసు శాఖలో కలవరం - వారిని తప్పించే ప్రయత్నం చేసిన ఓ మీడియా అధిపతి, పక్క రాష్ట్ర పెద్దలు - ఇంతకుముందే ఆధారాల్లేవంటూ కేసును మూసేసే ప్రయత్నం - చర్యలపై తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాల్లేవన్న ఓ సీనియర్ ఐపీఎస్ ఈ ఫొటోలో ఉన్నది అదనపు ఎస్పీ చంద్రశేఖర్. 1989 బ్యాచ్ ఎస్సైగా ఎంపికైన ఆయన... ప్రస్తుతం కీలకమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో ఇన్చార్జి ఎస్పీగా ఉన్నారు. గతంలో మావోయిస్టు వ్యవహారాలను పర్యవేక్షించే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా కాలం పనిచేశారు. ఆ సమయంలోనే నయీమ్‌తో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి నయీమ్ ఎన్కౌంటర్ వరకు కూడా సన్నిహిత సంబంధాలు నెరిపారని.. నయీమ్‌తో కలసి సెటిల్మెంట్లు చేశారని ఆరోపణలున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. చంద్రశేఖర్‌కు ఎడమవైపు కూర్చున్న అధికారి సైదులు. ప్రస్తుతం ఆయన సీఐ హోదాలో ఉన్నారు. నయీమ్ ఇచ్చిన దావత్‌కు చంద్రశేఖర్‌తో కలసి వెళ్లినట్టు తెలిసింది. ఇటీవలి వరకు నిజామాబాద్‌లో సీఐగా పనిచేసిన సైదులు.. ఇటీవలే సీఐడీకి బదిలీ అయ్యారు. ఎస్సైగా పనిచేసిన సమయంలో నయీమ్‌తో సంబంధాలు ఏర్పర్చుకున్నట్లు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సన్నిహిత సంబంధాలున్న పలువురు పోలీసుల బండారం బయటపడింది. నయీమ్‌తో ఏకంగా నాన్ కేడర్ అదనపు ఎస్పీ స్థాయి పోలీసు అధికారులు కూడా కలసి ఉన్న ఫొటోలు బయటపడడం సంచలనం రేపుతోంది. దాదాపు పదిహేనేళ్ల పాటు పోలీస్ శాఖలో పెత్తనం చెలాయించిన నయీమ్, అతడికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారుల ఫొటోలు గురువారం సోషల్ మీడియాలో వెల్లువెత్తడం పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వ వర్గాలను అతలాకుతలం చేసింది. ఇంతకీ ఆ అధికారులెవరు? నయీమ్‌తో ఎక్కడ ఫోటోలు దిగారు? నయీమ్‌తో వారి సాన్నిహిత్యం ఏమిటి, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసు విచారణ పరిస్థితేమిటి? నయీమ్ ఎన్కౌంటర్ జరిగి ఆరు నెలలు గడిచింది. పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, రాజకీయ నేతలకు నయీమ్‌తో సంబంధాలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీపీఐ నేత నారాయణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఆ పిటిషన్ విచారణ సందర్భంగా.. ఇప్పటివరకు నయీమ్‌తో పోలీసులెవరికీ సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదంటూ హోంశాఖ హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇక నయీమ్ కేసులో విచారణ చాలించాలని, నయీమ్‌కు సహకారం అందించిన చిన్నా చితకా కానిస్టేబుళ్లు, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసు శాఖకు సూచించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు సిట్ చార్జిషీట్లు వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో నయీమ్‌తో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కలసి ఉన్న ఫొటోలు బయటకు రావడం చర్చనీయాంశమైంది. అసలు ఈ కేసు మూసివేతకు ప్రయత్నిస్తున్న సందర్భంలో కీలక ఆధారాలు బయటకు రావడం పోలీసు అధికారులను ఊపిరిపీల్చుకోకుండా చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫొటోలో నయీమ్ తో ఉన్న వ్యక్తి సీఐ వెంకట్ రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్ లోని మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తను నయీమ్ డిగ్రీ క్లాస్మేట్ అని సిట్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఆ సాన్నిహిత్యంతోనే నయీమ్‌ను కలవాల్సి వచ్చిందని, అంతకు మించి తనకు ఎలాంటి సంబంధాలూ లేవని చెప్పినట్లు తెలిసింది. అసలు గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్‌ను ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎంత క్లాస్మేట్ అయినా పోలీసు అధికారిగా ఉన్నప్పుడు మర్యాద పూర్వక భేటీలు ఎందుకన్న దానికి మాత్రం సమాధానమివ్వలేదని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. మిగతా వాళ్ల సంగతేంటి? తాము మాత్రమే నయీమ్‌తో అంటకాగలేదని.. మరో నలుగురు కూడా నయీమ్‌తో కలసి భారీ స్థాయిలో సెటిల్మెంట్లు చేసి, కోట్లు దండుకున్నారని ఫోటోల్లో ఉన్న ఓ అధికారి స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న మరో అధికారి, హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు డీఎస్పీలు నయీమ్‌తో అంటకాగారని ఆయన ఆరోపించారు. తమకు త్వరలో పదోన్నతి ఉందని తెలిసి, అడ్డుకునేందుకే ఈ ఫోటోలను బయటకు లీక్ చేశారన్నారు. తమను సిట్ విచారిస్తే కీలకమైన అధికారుల పేర్లు బయట పెడతామని, వారి సంగతి కూడా తేల్చాల్సిందేనని వ్యాఖ్యానించారు. తాము విచారణ ఎదుర్కొంటామన్నారు. ఓ మీడియా ఎండీ లాబీయింగ్? నయీమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తమపై చర్యలు తీసుకోకుండా భారీగా లాబీయింగ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఓ మీడియా ఎండీ నేరుగా కల్పించుకున్నారని, తమ సంబంధీకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారని విచారణ ఎదుర్కొంటున్న ఓ డీఎస్పీ వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఆధారాలు బయటపడడంతో.. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా పేర్కొన్నట్లు సమాచారం. ఇక నయీమ్ ఇంట్లో దొరికిన ఆధారాల్లో చాలా వరకు చింపేసి, దొరక్కుండా చేశారని.. ప్రస్తుతం ఫోటోల్లో ఉన్న ఓ అదనపు ఎస్పీ ఏకంగా తన టీమ్‌తోనే అల్కాపురికాలనీ ఇంట్లో సోదాలు చేయించి ఆధారాలను తగలబెట్టారని ఆ డీఎస్పీ వెల్లడించినట్లు తెలిసింది. సస్పెన్షన్‌పై మాకెలాంటి ఆదేశాల్లేవు: సీనియర్ ఐపీఎస్ నయీమ్ కేసుకు సంబంధించి తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ లేవని సీనియర్ ఐపీఎస్ ఒకరు వెల్లడించారు. నయీమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని, దానిపై ఇంకా నిర్ణయం వెలువడలేదని పేర్కొన్నారు. నయీమ్‌తో పోలీసు అధికారులున్న ఫొటోలు బయటపడిన నేపథ్యంలో దీనిపై విచారణ జరుపుతారా, లేదా అన్నది సిట్ పరిధిలోని అంశమని తెలిపారు. నయీమ్ ‘సన్నిహితుల’పై సిట్ దృష్టి నయీమ్ కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక అంశాలపై దృష్టి పెట్టింది. గ్యాంగ్‌స్టర్‌తో సన్నిహితంగా మెలిగిన పోలీసు అధికారుల్లో... పోలీసు శాఖ కోసం పనిచేసిందెవరు? వ్యక్తిగత ప్రయోజనాల కోసం దోస్తీ చేసిందెవరనేది తేల్చేపనిలో పడింది. ఎన్కౌంటర్ తర్వాత నయీమ్ డెన్లలో లభించిన డైరీలు, ఫొటోలను.. అరెస్టు చేసిన, విచారించిన వారి వాంగ్మూలాలతో సరిచూస్తోంది. ఇప్పటికే ముగ్గురు పోలీసు అధికారులపై స్పష్టమైన ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. నయీమ్ నేరాలతో సంబంధమున్న, అతడితో అంటకాగిన అధికారులపై వచ్చే వారంలో చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నయీమ్‌తో ఉన్న పోలీసు అధికారి మద్దిపాటి శ్రీనివాసరావు. 1989 బ్యాచ్ ఎస్సై అయిన ఈయన ప్రస్తుతం సీఐడీలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. భువనగిరి సబ్ డివిజన్లో ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్ వరకు పనిచేశారు. ఎస్ఐబీలోనూ కొద్ది రోజులు విధులు నిర్వర్తించారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ ఏసీపీగా, మాదాపూర్ అదనపు డీసీపీగా కూడా పనిచేశారు. ఈ ఫొటోలో నయీమ్ పక్కన నిల్చున్న పోలీసు అధికారి పేరు తిరుపత న్న. ఆయన కూడా 1989 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. ప్రస్తుతం సంగారెడ్డి టౌన్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన భువనగిరి సబ్ డివిజన్లో ఎస్సైగా, సీఐగా పనిచేశారు. భువనగిరిలో సీఐగా పనిచేస్తున్న సమయంలో నయీమ్‌తో కలసి వినాయక విగ్రహానికి పూజలు చేసినట్టు సిట్ అధికార వర్గాల ద్వారా తెలిసింది. -
నయీం డెరైక్షన్లోనే రాములు హత్య
ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో మరో 8 మంది: ఎస్పీ ప్రభాకర్‌రావు వెల్లడి సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ మావోయిస్టు కొనపురి రాములు హత్య పక్కాప్రణాళికతోనే, మాజీ మావోయిస్టు నయీం కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో కేరళలో పోలీసులకు పట్టుబడిన నిందితులను నల్లగొండలో జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు మీడియాకు చూపించారు.మావోయిస్టు పార్టీలో పనిచేసినప్పుడే నయీం, రాములు మధ్య శతృత్వం ఉందని, ఆ కారణమే రాములు హత్యకు దారితీసిందని ఎస్పీ వివరించారు. నయీం.. తన అనుచరులైన సురేష్, యాదగిరిలతో కలిసి హత్యకు పథకాన్ని రచించారని, లొంగిపోయిన మాజీ నక్సలైట్లను చేరదీశారని అన్నారు. నయీం డెరైక్షన్‌లో 10 మంది నిందితులు రెండు బృందాలుగా విడిపోయి పక్కా వ్యూహంతో ఈనెల 11వ తేదీన జిల్లాకేంద్రంలో ఎంఏ.బేగ్ ఫంక్షన్ హాల్లో రాములు కళ్లల్లో కారంచల్లి, కాల్పులు జరిపి హత్యచేసి పరారయ్యారని చెప్పారు. కేరళలో రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఓ లాడ్జిలో తలదాచుకున్న వీరు, అక్కడి పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు. ఈ ఆరుగురు కాక, జిల్లాకేంద్రంలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రాములు సోదరుడు సాంబశివుడి హత్య కేసులోని నిందితులూ ఈ హత్య ఘటనలో ఉన్నారు. కాగా, రాములు హత్య కేసులో పోలీసులు మొత్తం 16మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో మొదటి ముద్దాయి నయీం. ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను పోలీసుల అదుపులో ఉండగా, మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. కేరళ పోలీసులకు చిలకరాజు సురేష్ (వనస్థలిపురం-హైదరాబాద్), కుమారస్వామి (కమలాపూర్-కరీంనగర్), రమేష్ (హసన్‌పర్తి - వరంగల్), ఎల్లేష్ (కథలాపూర్), రవి (పెంబర్తి , వరంగల్), సోమయ్య (చౌడూర్ - వరంగల్) ఉన్నారు. అంతకు ముందే నల్లగొండలో గాదరి యాదగిరి, రియాజుద్దీన్ పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే, రాములు హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎండీ నయీం, క్రాంతి, చిరంజీవి, బాబన్న, శివన్న, గాదరి సంగీత, నిందితులకు ఆశ్రయం ఇచ్చిన న్యాయవాది ఎస్ఆర్ భిక్షపతి, సునీత పరారీలో ఉన్నారని ఎస్పీ ప్రభాకర్‌రావు వివరించారు. నయీంతో సహా ఎవరినీ వదలద్దు పోలీసు అధికారులను నిర్దేశించిన కేసీఆర్? సాక్షి,హైదరాబాద్: రాములు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా బావిస్తున్న నయీంతో సహా ఎవరిని వదలొద్దని టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కేసీఆర్ నిర్దేశించినట్లు తెలిసింది. ఉన్నత పోలీసు అధికారులు కేసీఆర్‌ను కలుసుకుని కొనపురి రాములు హత్య కేసులో నిందితులుగా బావిస్తున్న ఆరుగురిని కేరళలో అరెస్టు చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే ప్రధాన నిందితుడు నయీంను ఎందుకు పట్టుకోలేక పోతున్నారని కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలుస్తోం ది. ఒక దశలో ఆయన కేసు మందగొండిగా సాగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామం జరిగిన తరువాత కేసీఆర్ ఈ కేసు పట్ల సీరియస్‌గా ఉన్నారనే విషయాన్ని గ్రహించిన అధికారులు నయీంను పట్టుకునేందుకు ఆరుప్రత్యేక పోలీసు దళాలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. -
ధైర్యలక్ష్మి
ఆడుతూ పాడుతూ తిరిగే అమ్మాయి లక్ష్మి. ఓ ఉన్మాది ప్రేమికుడి కారణంగా ఆమె జీవితం అతలాకుతలమైంది. కానీ ఆమె కుంగిపోలేదు. న్యాయం కోసం పోరాడి గెలిచింది. తనలాంటి బాధితుల వెంట అండగా నిలిచింది. ఆమె ధైర్యం, తెగువలను ప్రపంచమంతా గుర్తించింది. అగ్రరాజ్యమైన అమెరికా ‘ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డుతో ఇటీవల ఆమెను సత్కరించింది. యాసిడ్ దాడికి గురైనప్పట్నుంచి నేటి వరకూ కఠినమైన ప్రయాణమే చేసింది లక్ష్మి. ఆ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే... ఫిబ్రవరి 22, 2005. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ దగ్గరున్న బస్టాప్‌లో నిలబడి ఉన్నాను. ఓ అమ్మాయి నా దగ్గరికొచ్చింది. తను నయీమ్ తమ్ముడి గాళ్‌ఫ్రెండ్. తనను నయీమ్ పంపించాడంది. అతడి ప్రేమని ఒప్పుకోమంది. కుదరదన్నాను. ఇష్టం లేదని చెప్పాను. అంతే, ఆమె నన్ను బలంగా రోడ్డు మీదికి తోసింది. కింద పడిపోయాను. తేరుకుని చూస్తే ఎదురుగా నయీమ్. నేను ఏదో అనబోతుండగానే అతడి చేయి పైకి లేచింది. నా మీద యాసిడ్ కుమ్మ రించింది. క్షణంపాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. మరుక్షణం మరణయాతన మొదలైంది. చర్మం కాలిపోతోంది. నా అవయవాలు మైనంలా కరిగిపోతున్నాయి. నేను పెడుతున్న ఆర్తనాదాలు నాకే భయంకరంగా వినిపిస్తున్నాయి. కాసేపటికి అంతా నిశ్శబ్దం. స్పృహ తప్పుతోంది. ప్రతి శబ్దమూ నా చెవుల నుంచి దూరంగా వెళ్లిపోతోంది. ఒకటి మాత్రం స్పష్టంగా విన్పిస్తోంది. అది... నా తనువుతో పాటు ఆశలు కూడా కాలిపోతున్న చప్పుడు! పది నెలలు... నేను పడిన యాతన, చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తుంటే నా మనసు పడిన వేదన నాకు మాత్రమే తెలుసు. ముఖం కాలిపోయింది. చేతులు అడ్డు పెట్టుకోవడం వల్ల చూపు మాత్రం దక్కింది. అద్దంలో చూసుకున్న ప్పుడు కలిగిన బాధని, నన్ను చూసినప్పుడల్లా నా భవిష్యత్తు గురించి నా తల్లిదండ్రుల కళ్లలో కనిపించే బాధని ఎలా చెప్పను! అతడు నా స్నేహితురాలికి అన్న. అంటే నాకూ అన్నలాంటి వాడే అనుకున్నాను. కానీ అతడు మాత్రం నాలో చెల్లెలిని కాదు, ఆడపిల్లనే చూశాడు. ప్రేమించమంటూ వెంటపడ్డాడు, వేధించాడు. చివరికి తన పైశాచిక ప్రేమని యాసిడ్‌లా మార్చి నా మీద చల్లాడు. పదిహేనేళ్ల నేను ముప్ఫై రెండేళ్ల వ్యక్తి ప్రేమను తిరస్కరించినందుకు ఇంత పెద్ద శిక్షా! చదువుకుని ఉన్నతస్థాయికి చేరాలని, గాయనిగా పేరు తెచ్చుకోవాలని కలలు కంటోన్న నాకు ప్రేమ గురించిన ఆలోచనలు ఎలా కలుగుతాయి! అందుకే కాదన్నాను. కాదని మాత్రమే అన్నాను. దానికి ఫలితం ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. నేను కోలుకునేనాటికి అతడు పెళ్లి చేసుకున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుడికి తమ కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఆ తల్లిదండ్రులు ఎలా ముందుకొచ్చారు? నా మనసు రగిలి పోయింది. అతను నా కలల్ని కాలరాశాడు. నా ఆశల్ని తుంచేశాడు. అలాంటి వాడిని అలా వదిలేయాల్సిందేనా! కోర్టుకెళ్లాను. న్యాయం కోసం శక్తిమేరా పోరాడాను. నా పోరాటం ఫలించింది. వాడికి పదేళ్ల జైలుశిక్ష పడింది. వాడికి సహకరించిన ఆ అమ్మాయికి ఏడేళ్ల శిక్షపడింది. శిక్ష పడింది సరే... అతడి వల్ల నేను అనుభవించిన వేదన మాటేమిటి? నన్ను చూడగానే ముఖం తిప్పుకునేవాళ్లు కొందరు. ‘నువ్వు బయటికి రాకు, మా పిల్లలు జడుసుకుంటున్నారు’ అని ముఖమ్మీదే చెప్పేసేవాళ్లు మరికొందరు. చుట్టాలు, స్నేహితులు దూరమై పోయారు. ఇంత పెద్ద ప్రపంచంలో నేను ఒంటరినైపోయానన్న బాధ. ఆ బాధలోంచే ఓ బాధ్యత పుట్టుకొచ్చింది. అది నా ఆలోచనల్ని, జీవితాన్ని మరోసారి మలుపు తిప్పింది. యాసిడ్ దాడి నా ఒక్కదాని మీదే జరగలేదు. పైశాచిక ప్రేమికుల వల్ల చాలామంది ఆడపిల్లలు యాసిడ్ దాడులకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోతే, మరికొందరు ప్రాణమున్న శవాల్లా బతుకీడుస్తున్నారు. వాళ్ల కోసం ఏమైనా చేయగలనా అని ఆలోచించాను. మాలాగ మరెవరూ కాకుండా ఆపలేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. వెంటనే యాసిడ్ దాడుల విషయంలో బాధితులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పాను. యాసిడ్ దాడులను అరికట్టమంటూ కోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేశాను. కోర్టు నా అభ్యర్థనలను సీరియస్‌గా తీసుకుంది. యాసిడ్ అమ్మకాలపై నియంత్రణా చర్యలు చేపట్టింది. బాధితులకు కొన్ని హకుల్ని కల్పించింది. దాడికి పాల్పడే దోషులకు విధించే శిక్షాస్మృతిలో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. కానీ ఇంకా చేయాల్సింది, మారాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా సమాజం మారాలి. మాలాంటి వాళ్లను చూడగానే ముఖాలు తిప్పుకోవడం మానేసినప్పుడు కదా... మేం బయటకు రాగలిగేది! మమ్మల్ని తమలో కలుపుకోగలిగినప్పుడు కదా ధైర్యంగా అడుగేసి మా జీవితాలను చక్కదిద్దుకోగలిగేది! అందుకే మా విషయంలో సామాజిక దృష్టికోణం మారాలి. మా రూపాలు వికృతంగా మారినా, ఆ రూపం వెనుక అందమైన మనసుందని అందరూ అర్థం చేసుకోవాలి. ఆ మార్పు కోసమే నేను ప్రయత్నిస్తున్నాను. ‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ సంస్థతో కలిసి యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను. బాధితుల్లో స్ఫూర్తిని నింపడానికి, బాధ నుంచి బయటపడి వారు తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి తోడ్పడాలని ప్రయత్నిస్తున్నాను. యాసిడ్ దాడులు ఆగనంత వరకూ, ఉన్మాద ప్రేమికుల భయం లేకుండా ఆడపిల్లలు స్వేచ్ఛగా సమాజంలో తిరగగలిగేవరకూ నా ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది! కూర్పు: సమీర నేలపూడి మనసెరిగిన తోడు! యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఓ క్యాంపెయిన్‌లో లక్ష్మిని చూశాడు జర్నలిస్ట్ అలోక్ దీక్షిత్. ‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ సంస్థ స్థాపకుడైన అలోక్ని లక్ష్మి ధైర్యం, తెగువ తొలి చూపులోనే ఆకర్షించాయి. ఆమె పరిచయం కోరుకున్నాడు. స్నేహితుడిగా దగ్గరయ్యాడు. ప్రేమికుడిగా మారాడు. ఆమెతో కలిసి బతికేందుకు పెద్దలను సైతం ఎదిరించాడు. తాను లక్ష్మిని ప్రేమిస్తున్నానని, ఆమెలాంటి వ్యక్తి తన జీవితంలో ప్రవేశించడం ఎంతో అదృష్టమని గర్వంగా చెబుతాడు అలోక్!