ధైర్యలక్ష్మి | Won the fight for justice | Sakshi
Sakshi News home page

ధైర్యలక్ష్మి

Published Thu, Mar 6 2014 10:13 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

Won the fight for justice

ఆడుతూ పాడుతూ తిరిగే అమ్మాయి లక్ష్మి. ఓ ఉన్మాది ప్రేమికుడి కారణంగా ఆమె జీవితం అతలాకుతలమైంది. కానీ ఆమె కుంగిపోలేదు. న్యాయం కోసం పోరాడి గెలిచింది. తనలాంటి బాధితుల వెంట అండగా నిలిచింది. ఆమె ధైర్యం, తెగువలను ప్రపంచమంతా గుర్తించింది. అగ్రరాజ్యమైన అమెరికా ‘ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డుతో ఇటీవల ఆమెను సత్కరించింది. యాసిడ్ దాడికి గురైనప్పట్నుంచి నేటి వరకూ కఠినమైన ప్రయాణమే చేసింది లక్ష్మి. ఆ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...
 
ఫిబ్రవరి 22, 2005. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ దగ్గరున్న బస్టాప్‌లో నిలబడి ఉన్నాను. ఓ అమ్మాయి నా దగ్గరికొచ్చింది. తను నయీమ్ తమ్ముడి గాళ్‌ఫ్రెండ్. తనను నయీమ్ పంపించాడంది. అతడి ప్రేమని ఒప్పుకోమంది. కుదరదన్నాను. ఇష్టం లేదని చెప్పాను. అంతే, ఆమె నన్ను బలంగా రోడ్డు మీదికి తోసింది. కింద పడిపోయాను. తేరుకుని చూస్తే ఎదురుగా నయీమ్. నేను ఏదో అనబోతుండగానే అతడి చేయి పైకి లేచింది. నా మీద యాసిడ్ కుమ్మ రించింది. క్షణంపాటు ఏం జరిగిందో అర్థం కాలేదు.

మరుక్షణం మరణయాతన మొదలైంది. చర్మం కాలిపోతోంది. నా అవయవాలు మైనంలా కరిగిపోతున్నాయి. నేను పెడుతున్న ఆర్తనాదాలు నాకే భయంకరంగా వినిపిస్తున్నాయి. కాసేపటికి అంతా నిశ్శబ్దం. స్పృహ తప్పుతోంది. ప్రతి శబ్దమూ నా చెవుల నుంచి దూరంగా వెళ్లిపోతోంది. ఒకటి మాత్రం స్పష్టంగా విన్పిస్తోంది. అది... నా తనువుతో పాటు ఆశలు కూడా కాలిపోతున్న చప్పుడు!
           
పది నెలలు... నేను పడిన యాతన, చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తుంటే నా మనసు పడిన వేదన నాకు మాత్రమే తెలుసు. ముఖం కాలిపోయింది. చేతులు అడ్డు పెట్టుకోవడం వల్ల చూపు మాత్రం దక్కింది. అద్దంలో చూసుకున్న ప్పుడు కలిగిన బాధని, నన్ను చూసినప్పుడల్లా నా భవిష్యత్తు గురించి నా తల్లిదండ్రుల కళ్లలో కనిపించే బాధని ఎలా చెప్పను!
 
అతడు నా స్నేహితురాలికి అన్న. అంటే నాకూ అన్నలాంటి వాడే అనుకున్నాను. కానీ అతడు మాత్రం నాలో చెల్లెలిని కాదు, ఆడపిల్లనే చూశాడు. ప్రేమించమంటూ వెంటపడ్డాడు, వేధించాడు. చివరికి తన పైశాచిక ప్రేమని యాసిడ్‌లా మార్చి నా మీద చల్లాడు. పదిహేనేళ్ల నేను ముప్ఫై రెండేళ్ల వ్యక్తి ప్రేమను తిరస్కరించినందుకు ఇంత పెద్ద శిక్షా! చదువుకుని ఉన్నతస్థాయికి చేరాలని, గాయనిగా పేరు తెచ్చుకోవాలని కలలు కంటోన్న నాకు ప్రేమ గురించిన ఆలోచనలు ఎలా కలుగుతాయి! అందుకే కాదన్నాను. కాదని మాత్రమే అన్నాను. దానికి ఫలితం ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు.
 
నేను కోలుకునేనాటికి అతడు పెళ్లి చేసుకున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుడికి తమ కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఆ తల్లిదండ్రులు ఎలా ముందుకొచ్చారు? నా మనసు రగిలి పోయింది. అతను నా కలల్ని కాలరాశాడు. నా ఆశల్ని తుంచేశాడు. అలాంటి వాడిని అలా వదిలేయాల్సిందేనా! కోర్టుకెళ్లాను. న్యాయం కోసం శక్తిమేరా పోరాడాను. నా పోరాటం ఫలించింది. వాడికి పదేళ్ల జైలుశిక్ష పడింది. వాడికి సహకరించిన ఆ అమ్మాయికి ఏడేళ్ల శిక్షపడింది.

శిక్ష పడింది సరే... అతడి వల్ల నేను అనుభవించిన వేదన మాటేమిటి? నన్ను చూడగానే ముఖం తిప్పుకునేవాళ్లు కొందరు. ‘నువ్వు బయటికి రాకు, మా పిల్లలు జడుసుకుంటున్నారు’ అని ముఖమ్మీదే చెప్పేసేవాళ్లు మరికొందరు. చుట్టాలు, స్నేహితులు దూరమై పోయారు. ఇంత పెద్ద ప్రపంచంలో నేను ఒంటరినైపోయానన్న బాధ. ఆ బాధలోంచే ఓ బాధ్యత పుట్టుకొచ్చింది. అది నా ఆలోచనల్ని, జీవితాన్ని మరోసారి మలుపు తిప్పింది.
           
 యాసిడ్ దాడి నా ఒక్కదాని మీదే జరగలేదు. పైశాచిక ప్రేమికుల వల్ల చాలామంది ఆడపిల్లలు యాసిడ్ దాడులకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోతే, మరికొందరు ప్రాణమున్న శవాల్లా బతుకీడుస్తున్నారు. వాళ్ల కోసం ఏమైనా చేయగలనా అని ఆలోచించాను. మాలాగ మరెవరూ కాకుండా ఆపలేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. వెంటనే యాసిడ్  దాడుల విషయంలో బాధితులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పాను. యాసిడ్ దాడులను అరికట్టమంటూ కోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేశాను. కోర్టు నా అభ్యర్థనలను సీరియస్‌గా తీసుకుంది. యాసిడ్ అమ్మకాలపై నియంత్రణా చర్యలు చేపట్టింది. బాధితులకు కొన్ని హకుల్ని కల్పించింది. దాడికి పాల్పడే దోషులకు విధించే శిక్షాస్మృతిలో మార్పులు చేసేందుకు సిద్ధమైంది.
 
కానీ ఇంకా చేయాల్సింది, మారాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా సమాజం మారాలి. మాలాంటి వాళ్లను చూడగానే ముఖాలు తిప్పుకోవడం మానేసినప్పుడు కదా... మేం బయటకు రాగలిగేది! మమ్మల్ని తమలో కలుపుకోగలిగినప్పుడు కదా ధైర్యంగా అడుగేసి మా జీవితాలను చక్కదిద్దుకోగలిగేది! అందుకే మా విషయంలో సామాజిక దృష్టికోణం మారాలి. మా రూపాలు వికృతంగా మారినా, ఆ రూపం వెనుక అందమైన మనసుందని అందరూ అర్థం చేసుకోవాలి. ఆ మార్పు కోసమే నేను ప్రయత్నిస్తున్నాను.

‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ సంస్థతో కలిసి యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను. బాధితుల్లో స్ఫూర్తిని నింపడానికి, బాధ నుంచి బయటపడి వారు తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి తోడ్పడాలని ప్రయత్నిస్తున్నాను. యాసిడ్ దాడులు ఆగనంత వరకూ, ఉన్మాద ప్రేమికుల భయం లేకుండా ఆడపిల్లలు స్వేచ్ఛగా సమాజంలో తిరగగలిగేవరకూ నా ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది!
 
కూర్పు: సమీర నేలపూడి
 
 మనసెరిగిన తోడు!


 యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఓ క్యాంపెయిన్‌లో లక్ష్మిని చూశాడు జర్నలిస్ట్ అలోక్ దీక్షిత్. ‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ సంస్థ స్థాపకుడైన అలోక్‌ని లక్ష్మి ధైర్యం, తెగువ తొలి చూపులోనే ఆకర్షించాయి. ఆమె పరిచయం కోరుకున్నాడు. స్నేహితుడిగా దగ్గరయ్యాడు. ప్రేమికుడిగా మారాడు. ఆమెతో కలిసి బతికేందుకు పెద్దలను సైతం ఎదిరించాడు. తాను లక్ష్మిని ప్రేమిస్తున్నానని, ఆమెలాంటి వ్యక్తి తన జీవితంలో ప్రవేశించడం ఎంతో అదృష్టమని గర్వంగా చెబుతాడు అలోక్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement