Khan Market
-
ఢిల్లీ ఖాన్ మార్కెట్.. చాలా కాస్ట్లీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ మరోసారి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల్లో ప్రపంచంలో 22వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక చదరపు అడుగు రిటైల్ స్థలానికి వార్షికంగా చెల్లించాల్సిన అద్దె 229 డాలర్లు (రూ.19,000). ఈ వివరాలను కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ‘మెయిన్ స్ట్రీట్స్ అక్రాస్ ద వరల్డ్ 2024’ పేరుతో విడుదల చేసింది.2,047 డాలర్ల వార్షిక అద్దెతో ఇటలీలోని మిలాన్‌లో ‘మాంటే నెపోలియన్’ ప్రపంచంలోనే ఖరీదైన రిటైల్ మార్కెట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లోని 138 అత్యుత్తమ ప్రాంతాలను ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది. ప్రతీ మార్కెట్లోని అత్యంత ఖరీదైన రిటైల్ షాపింగ్‌ల కేంద్రాన్ని జాబితాలోకి తీసుకుంది. ఖాన్ మార్కెట్ దేశంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ వ్యాపార సంస్థల కేంద్రంగా నిలిచింది. వార్షికంగా ఇక్కడి అద్దె 7 శాతం పెరిగింది.సంపన్నుల షాపింగ్ కేంద్రం.. ఖాన్ మార్కెట్ అంతర్జాతీయంగా ప్రముఖ రిటైల్ కేంద్రాల్లో ఒకటిగా నిలవడం భారత దేశ రిటైల్ రంగం బలాన్ని తెలియజేస్తోందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రిటైల్ హెడ్, ఎండీ సౌరభ్ షట్దాల్ పేర్కొన్నారు. ప్రీమియం బ్రాండ్లు, బోతిక్లతో సంపన్న షాపర్లను ఖాన్ మార్కెట్ ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. సదరు ప్రాంతంలో రిటైల్ వాణిజ్య స్థలాల లభ్యత తక్కువగా ఉండడంతో, పోటీ పెరిగి అద్దెలు పెరిగేందుకు దారితీస్తున్నట్టు పేర్కొన్నారు.అంతేకాదు దేశవ్యాప్తంగానూ ప్రముఖ రిటైల్ మార్కెట్లలో షాపింగ్ స్థలాల సరఫరా అంతగా లేదని, అదే సమయంలో బలమైన డిమాండ్ తోడు కావడంతో అద్దెల్లో పటిష్ట వృద్ధి కనిపిస్తున్నట్టు చెప్పారు. ఆర్థికంగా బలమైన వృద్ధి, వినియోగదారుల ప్రాధాన్యతలు విస్తరిస్తుండడంతో దేశ రిటైల్ రంగం స్థిరమైన విజయ బాటలో కొనసాగుతున్నట్టు షట్దాల్ వివరించారు. టాప్–10 రిటైల్ లొకేషన్లు న్యూయార్క్‌లోని ‘ఫిఫ్త్ అవెన్యూ’ 2,000 డాలర్ల వార్షిక అద్దెతో మాంటే నెపోలియన్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. 1,762 డాలర్ల వార్షిక అద్దెతో లండన్‌లోని న్యూబాండ్ స్ట్రీట్ మూడో స్థానంలో ఉంది. హాంగ్‌కాంగ్‌లోని సిమ్షాసుయ్ 1,607 డాలర్లు, ప్యారిస్‌లోని అవెన్యూ డెస్ చాంప్స్ 1,282 డాలర్లు, టోక్యోలోని గింజా 1,186 డాలర్లు, జ్యూరిస్లోని బాన్హోఫ్స్ట్రాస్సే 981 డాలర్లు, సిడ్నీలోని పిట్స్ట్రీట్మాల్ 802 డాలర్లు, సియోల్‌లోని మయాంగ్డాంగ్ 688 డాలర్లు, వియన్నాలోని ఖోల్మార్కెట్ 553 డాలర్ల అద్దెతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
చెంప దెబ్బకు డెలివరీబాయ్ ఇచ్చిన రియాక్షన్.. మరీ వయొలెంట్‌గా ఉందే!
-
చెంప దెబ్బ ఎఫెక్ట్: పోలీసులకు చుక్కలు చూపించాడు
ఓ యువతి.. ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌తో గొడవపడి పోలీసుల దాకా వెళ్లింది. ‘రాతపూర్వక ఫిర్యాదు ఎందుకు మేడమ్.. మేం చూసుకుంటాం లే’ అంటూ ఆమెకు సర్దిచెప్పి పంపించేశారు పోలీసులు. ఆమె అటు వెళ్లగానే.. అతగాడి చెంప చెల్లుమంది. ఇంకోసారి ఇలా చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చి పంపించారు. కానీ, అవమాన భారంతో రగిలిపోయిన ఆ యువకుడు ఇచ్చిన రియాక్షన్ మరీ వయొలెంట్‌గా ఉండడంతో పోలీసులు చుక్కలు చూడాల్సి వచ్చింది. ఢిల్లీ పోష్ ఏరియా ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం హైడ్రామా నెలకొంది. ఓ యువకుడు తన బైక్‌కు నిప్పటించుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వాడు. అంతటితో ఆగకుండా .. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల మీద సైతం రాళ్లు విసిరాడు. చివరికి.. నాటకీయ పరిణామాల నడుమ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు. జొమాటోలో డెలివరీబాయ్‌గా పని చేసే నదీమ్(23).. శనివారం ఖాన్ మార్కెట్లో ఓ రెస్టారెంట్‌కు ఫుడ్ ప్యాకేజీల కోసం వెళ్లాడు. ఆ సమయంలో అక్కడికి ఓ జంట వచ్చింది. యువతి.. నదీమ్ తననే చూస్తున్నాడంటూ గొడవకు దిగింది. ఆపై దగ్గర్లోని స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకుంది. కానీ, పోలీసులు సర్దిచెప్పి పంపించారు. అక్కడున్న ఓ కానిస్టేబుల్ ఊగిపోతూ అతని చెంప పగలకొట్టాడు. దీంతో అకారణంగా తనను కొట్టారంటూ ప్రతీకారంతో రగిలిపోయాడు నదీమ్. ఆ మరుసటి రోజు స్టేషన్ బయట తన బండిని పార్క్ చేసి దానికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు పక్కనే ఉన్న ఓ ఫర్నీఛర్ షాపునకు పాకడంతో.. అక్కడ గందరగోళం నెలకొంది. ఇంతలో ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటల్ని అదుపు చేశారు. ఆపై నదీమ్‌ను అదుపులోకి తీసుకునే యత్నం చేయగా.. అతను వాళ్లపై రాళ్లు రువ్వాడు. చివరకు పోలీసులు అతన్ని ఎలాగోలా పట్టుకున్నారు. ఆ సమయంలో తనకు అవమానం జరిగిందంటూ అతను అరవడమూ వీడియోల్లో రికార్డు అయ్యింది. ఈ ఘటనతో అక్కడ జనం గుమిగూడగా.. పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు బారికేడ్లను ఉంచారు. -
పేరు మార్పు కోసం హోంమంత్రికి లేఖ..!
న్యూఢిల్లీ : మొగల్ చక్రవర్తుల కాలం నాటి పేర్లెందుకని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్ అని, ఫైజాబాద్‌ను అయోధ్య అని మార్చారు. తాజాగా ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన ఖాన్ మార్కెట్‌ను కూడా ఆ జాబితాలో చేర్చాలని ఓ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఓ వ్యక్తి లేఖ రాశారు. ఖాన్ మార్కెట్‌కు వాల్మీకీ మార్కెట్ అని పేరు మార్చాలని ఢిల్లీకి చెందిన కోరుతూ దీపక్ తన్వర్ విజ్ఞప్తి చేశారు. ‘ఇటీవల ప్రధాని మోదీ ఇంటర్వ్యూ చూశాను. అందులో ఇప్పుడున్న ఖాన్ మార్కెట్ విశేషాలు, చారిత్రక అంశాలు ఆయన వివరించారు. అందుకే దానికి ఖాన్ మార్కెట్ బదులు.. వాల్మీకి మార్కెట్ అని ఉంటే బాగుంటుందనిపించింది. అందుకే రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకొచ్చా’ అని దీపక్ చెప్పుకొచ్చారు. (చదవండి : పేరు మారనున్న మరో నగరం..!) వాల్మీకి మార్కెట్ అని పేరు మార్చితే.. మన చారిత్రక విశేషాలకు ప్రాచుర్యం కల్పించినట్టువుందని అతను వివరించాడు. ఢిల్లీ నడిబొడ్డున, ఇండియాగేట్ ప్రాంతంలో ఉన్న ఖాన్ మార్కెట్ 1951లో ఏర్పడింది. స్వాతంత్ర సమరయోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గౌరవార్థం ఖాన్ మార్కెట్ గా స్థిరపడింది. చారిత్రకంగా ప్రాధాన్యం కలిగిన సుల్తాన్పూర్ పేరును.. కుష్‌భావన్‌పూర్‌గా మార్చాలని ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సూచించిన సంగతి తెలిసిందే. ఇక ముస్లిం రాజులు, ప్రముఖ వ్యక్తుల పేరుతో ఉన్న పలు పురాతన కట్టడాలు, నగరాల పేర్లు మార్చుతున్న బీజేపీ తమ హిందుత్వ అజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఓటు బ్యాంకు కోసం బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తోందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. -
కాస్ట్లీ ప్లేస్... ఖాన్ మార్కెట్
ముంబై: భారత్‌లో షాపుల అద్దె అత్యధికంగా ఉన్న ప్రాంతంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ జాబితాకెక్కింది. ఇక అంతర్జాతీయంగా దీని ర్యాంకింగ్ రెండు స్థానాలు మెరుగుపడి 24కు చేరింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వే ప్రకారం.. అద్దెలో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఆయా దేశాల ర్యాంకులలో స్వల్ప మార్పుల కారణంగా ఖాన్ మార్కెట్ ర్యాంక్ రెండు స్థానాలు మెరుగుపడింది. ఖాన్ మార్కెట్లో అద్దె సంవత్సరానికి ఒక చదరపు అడుగుకు 235 డాలర్లుగా ఉంది. ప్రపంచంలో అద్దె ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో న్యూయార్క్ (అప్పర్ 5వ అవెన్యూ) అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో హాంకాంగ్ (క్యూసీవే బే), పారిస్ (అవెన్యూ డి చాంప్స్ ఎల్లీసెస్) నిలిచాయి. ఖాన్ మార్కెట్ తర్వాత భారత్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా న్యూఢిల్లీ-ఎన్సీఆర్లోని కన్నాట్ ప్లేస్ రెండో స్థానంలో, గుర్గావ్లోని డీఎల్ఎఫ్ గాలెరియో 3వ స్థానంలో, న్యూఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ 4వ స్థానంలో ఉన్నాయి. -
వైఫై ప్రాజెక్టు కార్యరూపం
ఖాన్ మార్కెట్ పరిసర ప్రాంత ప్రజలకు వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో కన్నాట్ ప్లేస్‌వాసులు కూడా వీటిని వినియోగించుకునే అవకాశముంది. ఈ దిశగా ఎన్డీఎంసీ ముందుకు సాగుతోంది. న్యూఢిల్లీ: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఫై ప్రాజెక్టు చేపట్టిన వైఫై ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. నగర ంలోని ఖాన్ మార్కెట్లో ఇందుకు సంబంధించిన సేవలు కొద్దిరోజుల క్రితం ప్రారంభమయ్యాయి. నగరంలోఈ తరహా సేవలు ప్రారంభమవడం ఇదే తొలిసారి. త్వరలో కన్నాట్‌ప్లేస్‌లోనూ ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు విజయవంతంగా సాగుతోందని దీని బాధ్యతలను నిర్వహిస్తున్న ఓపీ మిశ్రా వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను పూర్తిచేయడం ద్వారా ఖాన్ మార్కెట్ పరిసరాల్లో నివసించేవారు వినియోగించుకోవచ్చన్నారు. ఇంటర్నెట్కు అనుసంధానమయ్యేందుకుగాను తాము వన్‌టైం పాస్వర్డ్ (ఓటీపీ) అందజేస్తామన్నారు. ఉచిత వినియోగం పూర్తయ్యాక స్క్రాచ్ కార్డులను కొనుగోలు చేసి వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవి నగరంలోని అన్ని దుకాణాల్లోనూ అందుబాటులో ఉంటాయన్నారు. కాగా ఖాన్ మార్కెట్లో ఈ ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తున్నప్పటికీ కన్నాట్‌ప్లేస్‌లో ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఎంసీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కన్నాట్‌ప్లేస్ అతి పెద్ద ప్రాంతమని, అయితే కన్నాట్‌ప్లేస్‌లో ఏర్పాటుకు సంబంధించి తమకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇదిలాఉంచితే భారీఎత్తున కేబుళ్లను వినియోగించాల్సి ఉంటుందని, అందువల్ల పరిసరాలు వికృతంగా మారకుండా చేసేందుకుగాను కన్నాట్‌ప్లేస్‌లోని 1.2 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని వినియోగించుకోనున్నామని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్ల భరోసా ఎన్డీఎంసీ ఆలోచన ఇలా ఉండగా ఈ నెలాఖరునాటికల్లా కన్నాట్‌ప్లేస్ పరిసరాల్లో వైఫై సేవల అందుబాటులోకి తీసుకొస్తామని సర్వీస్ ప్రొవైడర్లయిన టాటా డొకొమో, వోడా ఫోన్ సంస్థలు భరోసా ఇస్తున్నాయి. కన్నాట్‌ప్లేస్ పరిధిలోని ఎన్‌బ్లాక్‌లో ప్రస్తుతం ైవె ఫై సేవలను ప్రయోగాత్మక ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ైవె ఫై సేవలు జూలైలోనే ప్రారంభం కావాల్సి ఉంది. వివిధ సాంకేతిక సమస్యల కారణంగా అది కాస్తా ఆలస్యమైంది. అంతేకాకుండా కొన్ని భద్రతా విభాగాలు కూడా అభ్యంతరం చెప్పడం కూడా జాప్యానికి కారణమైంది. తమ నెట్‌వర్క్‌లకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భావించిన ఆ సంస్థలు అభ్యంతరం చెప్పాయి. అయితే టెలిఫోన్ శాఖ నుంచి సర్వీస్ ప్రొవైడర్లు అవసరమైన అనుమ తులను పొందుతారంటూ తాము ఆ సంస్థలకు భరోసా ఇచ్చామని, దీంతో ఈ వివాదానికి తెరపడిందని ఆయన వివరించారు. కన్నాట్‌ప్లేస్‌లో వైఫై నెట్వర్క్ ఏర్పాటు సమ యంలో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ధైర్యలక్ష్మి
ఆడుతూ పాడుతూ తిరిగే అమ్మాయి లక్ష్మి. ఓ ఉన్మాది ప్రేమికుడి కారణంగా ఆమె జీవితం అతలాకుతలమైంది. కానీ ఆమె కుంగిపోలేదు. న్యాయం కోసం పోరాడి గెలిచింది. తనలాంటి బాధితుల వెంట అండగా నిలిచింది. ఆమె ధైర్యం, తెగువలను ప్రపంచమంతా గుర్తించింది. అగ్రరాజ్యమైన అమెరికా ‘ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డుతో ఇటీవల ఆమెను సత్కరించింది. యాసిడ్ దాడికి గురైనప్పట్నుంచి నేటి వరకూ కఠినమైన ప్రయాణమే చేసింది లక్ష్మి. ఆ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే... ఫిబ్రవరి 22, 2005. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ దగ్గరున్న బస్టాప్‌లో నిలబడి ఉన్నాను. ఓ అమ్మాయి నా దగ్గరికొచ్చింది. తను నయీమ్ తమ్ముడి గాళ్‌ఫ్రెండ్. తనను నయీమ్ పంపించాడంది. అతడి ప్రేమని ఒప్పుకోమంది. కుదరదన్నాను. ఇష్టం లేదని చెప్పాను. అంతే, ఆమె నన్ను బలంగా రోడ్డు మీదికి తోసింది. కింద పడిపోయాను. తేరుకుని చూస్తే ఎదురుగా నయీమ్. నేను ఏదో అనబోతుండగానే అతడి చేయి పైకి లేచింది. నా మీద యాసిడ్ కుమ్మ రించింది. క్షణంపాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. మరుక్షణం మరణయాతన మొదలైంది. చర్మం కాలిపోతోంది. నా అవయవాలు మైనంలా కరిగిపోతున్నాయి. నేను పెడుతున్న ఆర్తనాదాలు నాకే భయంకరంగా వినిపిస్తున్నాయి. కాసేపటికి అంతా నిశ్శబ్దం. స్పృహ తప్పుతోంది. ప్రతి శబ్దమూ నా చెవుల నుంచి దూరంగా వెళ్లిపోతోంది. ఒకటి మాత్రం స్పష్టంగా విన్పిస్తోంది. అది... నా తనువుతో పాటు ఆశలు కూడా కాలిపోతున్న చప్పుడు! పది నెలలు... నేను పడిన యాతన, చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తుంటే నా మనసు పడిన వేదన నాకు మాత్రమే తెలుసు. ముఖం కాలిపోయింది. చేతులు అడ్డు పెట్టుకోవడం వల్ల చూపు మాత్రం దక్కింది. అద్దంలో చూసుకున్న ప్పుడు కలిగిన బాధని, నన్ను చూసినప్పుడల్లా నా భవిష్యత్తు గురించి నా తల్లిదండ్రుల కళ్లలో కనిపించే బాధని ఎలా చెప్పను! అతడు నా స్నేహితురాలికి అన్న. అంటే నాకూ అన్నలాంటి వాడే అనుకున్నాను. కానీ అతడు మాత్రం నాలో చెల్లెలిని కాదు, ఆడపిల్లనే చూశాడు. ప్రేమించమంటూ వెంటపడ్డాడు, వేధించాడు. చివరికి తన పైశాచిక ప్రేమని యాసిడ్‌లా మార్చి నా మీద చల్లాడు. పదిహేనేళ్ల నేను ముప్ఫై రెండేళ్ల వ్యక్తి ప్రేమను తిరస్కరించినందుకు ఇంత పెద్ద శిక్షా! చదువుకుని ఉన్నతస్థాయికి చేరాలని, గాయనిగా పేరు తెచ్చుకోవాలని కలలు కంటోన్న నాకు ప్రేమ గురించిన ఆలోచనలు ఎలా కలుగుతాయి! అందుకే కాదన్నాను. కాదని మాత్రమే అన్నాను. దానికి ఫలితం ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. నేను కోలుకునేనాటికి అతడు పెళ్లి చేసుకున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుడికి తమ కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఆ తల్లిదండ్రులు ఎలా ముందుకొచ్చారు? నా మనసు రగిలి పోయింది. అతను నా కలల్ని కాలరాశాడు. నా ఆశల్ని తుంచేశాడు. అలాంటి వాడిని అలా వదిలేయాల్సిందేనా! కోర్టుకెళ్లాను. న్యాయం కోసం శక్తిమేరా పోరాడాను. నా పోరాటం ఫలించింది. వాడికి పదేళ్ల జైలుశిక్ష పడింది. వాడికి సహకరించిన ఆ అమ్మాయికి ఏడేళ్ల శిక్షపడింది. శిక్ష పడింది సరే... అతడి వల్ల నేను అనుభవించిన వేదన మాటేమిటి? నన్ను చూడగానే ముఖం తిప్పుకునేవాళ్లు కొందరు. ‘నువ్వు బయటికి రాకు, మా పిల్లలు జడుసుకుంటున్నారు’ అని ముఖమ్మీదే చెప్పేసేవాళ్లు మరికొందరు. చుట్టాలు, స్నేహితులు దూరమై పోయారు. ఇంత పెద్ద ప్రపంచంలో నేను ఒంటరినైపోయానన్న బాధ. ఆ బాధలోంచే ఓ బాధ్యత పుట్టుకొచ్చింది. అది నా ఆలోచనల్ని, జీవితాన్ని మరోసారి మలుపు తిప్పింది. యాసిడ్ దాడి నా ఒక్కదాని మీదే జరగలేదు. పైశాచిక ప్రేమికుల వల్ల చాలామంది ఆడపిల్లలు యాసిడ్ దాడులకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోతే, మరికొందరు ప్రాణమున్న శవాల్లా బతుకీడుస్తున్నారు. వాళ్ల కోసం ఏమైనా చేయగలనా అని ఆలోచించాను. మాలాగ మరెవరూ కాకుండా ఆపలేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. వెంటనే యాసిడ్ దాడుల విషయంలో బాధితులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పాను. యాసిడ్ దాడులను అరికట్టమంటూ కోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేశాను. కోర్టు నా అభ్యర్థనలను సీరియస్‌గా తీసుకుంది. యాసిడ్ అమ్మకాలపై నియంత్రణా చర్యలు చేపట్టింది. బాధితులకు కొన్ని హకుల్ని కల్పించింది. దాడికి పాల్పడే దోషులకు విధించే శిక్షాస్మృతిలో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. కానీ ఇంకా చేయాల్సింది, మారాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా సమాజం మారాలి. మాలాంటి వాళ్లను చూడగానే ముఖాలు తిప్పుకోవడం మానేసినప్పుడు కదా... మేం బయటకు రాగలిగేది! మమ్మల్ని తమలో కలుపుకోగలిగినప్పుడు కదా ధైర్యంగా అడుగేసి మా జీవితాలను చక్కదిద్దుకోగలిగేది! అందుకే మా విషయంలో సామాజిక దృష్టికోణం మారాలి. మా రూపాలు వికృతంగా మారినా, ఆ రూపం వెనుక అందమైన మనసుందని అందరూ అర్థం చేసుకోవాలి. ఆ మార్పు కోసమే నేను ప్రయత్నిస్తున్నాను. ‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ సంస్థతో కలిసి యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను. బాధితుల్లో స్ఫూర్తిని నింపడానికి, బాధ నుంచి బయటపడి వారు తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి తోడ్పడాలని ప్రయత్నిస్తున్నాను. యాసిడ్ దాడులు ఆగనంత వరకూ, ఉన్మాద ప్రేమికుల భయం లేకుండా ఆడపిల్లలు స్వేచ్ఛగా సమాజంలో తిరగగలిగేవరకూ నా ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది! కూర్పు: సమీర నేలపూడి మనసెరిగిన తోడు! యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఓ క్యాంపెయిన్‌లో లక్ష్మిని చూశాడు జర్నలిస్ట్ అలోక్ దీక్షిత్. ‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ సంస్థ స్థాపకుడైన అలోక్ని లక్ష్మి ధైర్యం, తెగువ తొలి చూపులోనే ఆకర్షించాయి. ఆమె పరిచయం కోరుకున్నాడు. స్నేహితుడిగా దగ్గరయ్యాడు. ప్రేమికుడిగా మారాడు. ఆమెతో కలిసి బతికేందుకు పెద్దలను సైతం ఎదిరించాడు. తాను లక్ష్మిని ప్రేమిస్తున్నానని, ఆమెలాంటి వ్యక్తి తన జీవితంలో ప్రవేశించడం ఎంతో అదృష్టమని గర్వంగా చెబుతాడు అలోక్!