
ఓ యువతి.. ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌తో గొడవపడి పోలీసుల దాకా వెళ్లింది. ‘రాతపూర్వక ఫిర్యాదు ఎందుకు మేడమ్.. మేం చూసుకుంటాం లే’ అంటూ ఆమెకు సర్దిచెప్పి పంపించేశారు పోలీసులు. ఆమె అటు వెళ్లగానే.. అతగాడి చెంప చెల్లుమంది. ఇంకోసారి ఇలా చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చి పంపించారు. కానీ, అవమాన భారంతో రగిలిపోయిన ఆ యువకుడు ఇచ్చిన రియాక్షన్ మరీ వయొలెంట్‌గా ఉండడంతో పోలీసులు చుక్కలు చూడాల్సి వచ్చింది.
ఢిల్లీ పోష్ ఏరియా ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం హైడ్రామా నెలకొంది. ఓ యువకుడు తన బైక్‌కు నిప్పటించుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వాడు. అంతటితో ఆగకుండా .. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల మీద సైతం రాళ్లు విసిరాడు. చివరికి.. నాటకీయ పరిణామాల నడుమ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు.
జొమాటోలో డెలివరీబాయ్‌గా పని చేసే నదీమ్(23).. శనివారం ఖాన్ మార్కెట్‌లో ఓ రెస్టారెంట్‌కు ఫుడ్ ప్యాకేజీల కోసం వెళ్లాడు. ఆ సమయంలో అక్కడికి ఓ జంట వచ్చింది. యువతి.. నదీమ్ తననే చూస్తున్నాడంటూ గొడవకు దిగింది. ఆపై దగ్గర్లోని స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకుంది. కానీ, పోలీసులు సర్దిచెప్పి పంపించారు. అక్కడున్న ఓ కానిస్టేబుల్ ఊగిపోతూ అతని చెంప పగలకొట్టాడు. దీంతో అకారణంగా తనను కొట్టారంటూ ప్రతీకారంతో రగిలిపోయాడు నదీమ్.
ఆ మరుసటి రోజు స్టేషన్ బయట తన బండిని పార్క్ చేసి దానికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు పక్కనే ఉన్న ఓ ఫర్నీఛర్ షాపునకు పాకడంతో.. అక్కడ గందరగోళం నెలకొంది. ఇంతలో ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటల్ని అదుపు చేశారు. ఆపై నదీమ్‌ను అదుపులోకి తీసుకునే యత్నం చేయగా.. అతను వాళ్లపై రాళ్లు రువ్వాడు. చివరకు పోలీసులు అతన్ని ఎలాగోలా పట్టుకున్నారు. ఆ సమయంలో తనకు అవమానం జరిగిందంటూ అతను అరవడమూ వీడియోల్లో రికార్డు అయ్యింది. ఈ ఘటనతో అక్కడ జనం గుమిగూడగా.. పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు బారికేడ్లను ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment