న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ మరోసారి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల్లో ప్రపంచంలో 22వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక చదరపు అడుగు రిటైల్ స్థలానికి వార్షికంగా చెల్లించాల్సిన అద్దె 229 డాలర్లు (రూ.19,000). ఈ వివరాలను కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ‘మెయిన్ స్ట్రీట్స్ అక్రాస్ ద వరల్డ్ 2024’ పేరుతో విడుదల చేసింది.
2,047 డాలర్ల వార్షిక అద్దెతో ఇటలీలోని మిలాన్‌లో ‘మాంటే నెపోలియన్’ ప్రపంచంలోనే ఖరీదైన రిటైల్ మార్కెట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లోని 138 అత్యుత్తమ ప్రాంతాలను ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది. ప్రతీ మార్కెట్‌లోని అత్యంత ఖరీదైన రిటైల్ షాపింగ్‌ల కేంద్రాన్ని జాబితాలోకి తీసుకుంది. ఖాన్ మార్కెట్ దేశంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ వ్యాపార సంస్థల కేంద్రంగా నిలిచింది. వార్షికంగా ఇక్కడి అద్దె 7 శాతం పెరిగింది.
సంపన్నుల షాపింగ్ కేంద్రం..
ఖాన్ మార్కెట్ అంతర్జాతీయంగా ప్రముఖ రిటైల్ కేంద్రాల్లో ఒకటిగా నిలవడం భారత దేశ రిటైల్ రంగం బలాన్ని తెలియజేస్తోందని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిటైల్ హెడ్, ఎండీ సౌరభ్ షట్‌దాల్ పేర్కొన్నారు. ప్రీమియం బ్రాండ్లు, బోతిక్‌లతో సంపన్న షాపర్లను ఖాన్ మార్కెట్ ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. సదరు ప్రాంతంలో రిటైల్ వాణిజ్య స్థలాల లభ్యత తక్కువగా ఉండడంతో, పోటీ పెరిగి అద్దెలు పెరిగేందుకు దారితీస్తున్నట్టు పేర్కొన్నారు.
అంతేకాదు దేశవ్యాప్తంగానూ ప్రముఖ రిటైల్ మార్కెట్లలో షాపింగ్ స్థలాల సరఫరా అంతగా లేదని, అదే సమయంలో బలమైన డిమాండ్ తోడు కావడంతో అద్దెల్లో పటిష్ట వృద్ధి కనిపిస్తున్నట్టు చెప్పారు. ఆర్థికంగా బలమైన వృద్ధి, వినియోగదారుల ప్రాధాన్యతలు విస్తరిస్తుండడంతో దేశ రిటైల్ రంగం స్థిరమైన విజయ బాటలో కొనసాగుతున్నట్టు షట్‌దాల్ వివరించారు.
టాప్–10 రిటైల్ లొకేషన్లు
న్యూయార్క్‌లోని ‘ఫిఫ్త్ అవెన్యూ’ 2,000 డాలర్ల వార్షిక అద్దెతో మాంటే నెపోలియన్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. 1,762 డాలర్ల వార్షిక అద్దెతో లండన్‌లోని న్యూబాండ్ స్ట్రీట్ మూడో స్థానంలో ఉంది. హాంగ్‌కాంగ్‌లోని సిమ్‌షాసుయ్ 1,607 డాలర్లు, ప్యారిస్‌లోని అవెన్యూ డెస్ చాంప్స్ 1,282 డాలర్లు, టోక్యోలోని గింజా 1,186 డాలర్లు, జ్యూరిస్‌లోని బాన్‌హోఫ్‌స్ట్రాస్సే 981 డాలర్లు, సిడ్నీలోని పిట్‌స్ట్రీట్‌మాల్ 802 డాలర్లు, సియోల్‌లోని మయాంగ్‌డాంగ్ 688 డాలర్లు, వియన్నాలోని ఖోల్‌మార్కెట్ 553 డాలర్ల అద్దెతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment