నయీం డెరైక్షన్‌లోనే రాములు హత్య | 2 arrested for murder of TRS leader K. Ramulu | Sakshi
Sakshi News home page

నయీం డెరైక్షన్‌లోనే రాములు హత్య

Published Fri, May 23 2014 2:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

2 arrested for murder of TRS leader K. Ramulu

ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో మరో 8 మంది:  ఎస్పీ ప్రభాకర్‌రావు వెల్లడి
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ మావోయిస్టు కొనపురి రాములు హత్య పక్కాప్రణాళికతోనే,   మాజీ మావోయిస్టు నయీం కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో కేరళలో పోలీసులకు పట్టుబడిన నిందితులను నల్లగొండలో జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు మీడియాకు చూపించారు.మావోయిస్టు పార్టీలో  పనిచేసినప్పుడే నయీం, రాములు మధ్య శతృత్వం ఉందని, ఆ కారణమే రాములు హత్యకు దారితీసిందని ఎస్పీ వివరించారు. నయీం.. తన అనుచరులైన సురేష్, యాదగిరిలతో కలిసి హత్యకు పథకాన్ని రచించారని, లొంగిపోయిన మాజీ నక్సలైట్లను చేరదీశారని అన్నారు.

నయీం డెరైక్షన్‌లో 10 మంది నిందితులు రెండు బృందాలుగా విడిపోయి పక్కా వ్యూహంతో ఈనెల 11వ తేదీన జిల్లాకేంద్రంలో ఎంఏ.బేగ్ ఫంక్షన్ హాల్లో రాములు కళ్లల్లో కారంచల్లి, కాల్పులు జరిపి హత్యచేసి పరారయ్యారని చెప్పారు. కేరళలో రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఓ లాడ్జిలో తలదాచుకున్న వీరు, అక్కడి  పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు. ఈ ఆరుగురు కాక, జిల్లాకేంద్రంలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రాములు సోదరుడు  సాంబశివుడి హత్య కేసులోని నిందితులూ ఈ హత్య ఘటనలో  ఉన్నారు. కాగా, రాములు హత్య కేసులో పోలీసులు మొత్తం 16మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో మొదటి ముద్దాయి  నయీం.

 ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను పోలీసుల అదుపులో ఉండగా, మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. కేరళ పోలీసులకు చిలకరాజు సురేష్ (వనస్థలిపురం-హైదరాబాద్), కుమారస్వామి (కమలాపూర్-కరీంనగర్), రమేష్ (హసన్‌పర్తి - వరంగల్), ఎల్లేష్ (కథలాపూర్), రవి (పెంబర్తి , వరంగల్), సోమయ్య (చౌడూర్ - వరంగల్) ఉన్నారు. అంతకు ముందే నల్లగొండలో గాదరి యాదగిరి, రియాజుద్దీన్ పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే, రాములు హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎండీ నయీం, క్రాంతి, చిరంజీవి, బాబన్న, శివన్న, గాదరి సంగీత, నిందితులకు ఆశ్రయం ఇచ్చిన న్యాయవాది ఎస్‌ఆర్ భిక్షపతి, సునీత పరారీలో ఉన్నారని ఎస్పీ ప్రభాకర్‌రావు వివరించారు.

నయీంతో సహా ఎవరినీ వదలద్దు పోలీసు అధికారులను నిర్దేశించిన కేసీఆర్?
సాక్షి,హైదరాబాద్: రాములు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా బావిస్తున్న నయీంతో సహా ఎవరిని వదలొద్దని టీఆర్‌ఎస్ ఎల్పీ నాయకుడు కేసీఆర్ నిర్దేశించినట్లు తెలిసింది. ఉన్నత పోలీసు అధికారులు కేసీఆర్‌ను కలుసుకుని కొనపురి రాములు హత్య కేసులో నిందితులుగా బావిస్తున్న ఆరుగురిని కేరళలో అరెస్టు చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.

అయితే ప్రధాన నిందితుడు నయీంను ఎందుకు పట్టుకోలేక పోతున్నారని కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలుస్తోం ది. ఒక దశలో ఆయన కేసు మందగొండిగా సాగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామం జరిగిన తరువాత కేసీఆర్ ఈ కేసు పట్ల సీరియస్‌గా ఉన్నారనే విషయాన్ని గ్రహించిన అధికారులు నయీంను పట్టుకునేందుకు ఆరుప్రత్యేక పోలీసు దళాలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement