- 2025 నుంచి ఏడాదికి 2.70 లక్షల మందికే అనుమతి
కాన్‌బెర్రా: అంతర్జాతీయ విద్యార్థులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉన్న ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. కోవిడ్19కు పూర్వస్థితికి వలసలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి ప్రతిఏటా 2,70,000 మంది విదేశీ విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని మంగళవారం ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి యూనివర్శిటీకి నిర్ణీత కోటాను పెడతామని వెల్లడించింది. దీనివల్ల వృత్తి విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇది ఆర్థిక విధ్వంసమని పలు యూనివర్శిటీలు ప్రభుత్వ నిర్ణయంపై ధ్వజమెత్తాయి. ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో 7,17,500 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు.
కోవిడ్ సమయంలో ఉన్నత విద్యారంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జాసన్ క్లార్ అంగీకరించారు. కోవిడ్‌కాలంలో ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థులందరినీ స్వదేశాలకు పంపించి వేసింది. ప్రస్తుతం కోవిడ్ పూర్వకాలంతో పోలిస్తే 10 శాతం మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియా వర్శిటీల్లో అధికంగా ఉన్నారని క్లార్ అన్నారు. వృత్తి విద్య, శిక్షణ సంస్థల్లో అయితే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏకంగా 50 శాతం అధికంగా ఉందన్నారు.
విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి నాణ్యత లేని విద్యను అందిస్తున్నారని, ఆంగ్ల భాషలో ఏమాత్రం ప్రావీణ్యం లేని విద్యార్థులనూ చేర్చుకుంటున్నారని, ఆస్ట్రేలియాలో పని చేసుకునేందుకు వచ్చినవారికి విద్యార్థుల ముసులో ఆశ్రయం కల్పిస్తున్నారని క్లార్ ఆరోపించారు. 2025 నుంచి ప్రభుత్వ యూనివర్శిటీల్లో 1,45,000 మంది విదేశీ విద్యార్థులను మాత్రమే చేర్చుకుంటామని తెలిపారు. అలాగే ప్రైవేటు యూనివర్శిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 30 వేలకు పరిమితం చేస్తామని, వృత్తివిద్య, శిక్షణ సంస్థల్లో 95 వేల మందికి పరిమితం చేస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment