Enrolment
-
విదేశీ విద్యార్థులపై ఆస్ట్రేలియా పరిమితి
కాన్బెర్రా: అంతర్జాతీయ విద్యార్థులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉన్న ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. కోవిడ్19కు పూర్వస్థితికి వలసలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి ప్రతిఏటా 2,70,000 మంది విదేశీ విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని మంగళవారం ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి యూనివర్శిటీకి నిర్ణీత కోటాను పెడతామని వెల్లడించింది. దీనివల్ల వృత్తి విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇది ఆర్థిక విధ్వంసమని పలు యూనివర్శిటీలు ప్రభుత్వ నిర్ణయంపై ధ్వజమెత్తాయి. ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో 7,17,500 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. కోవిడ్ సమయంలో ఉన్నత విద్యారంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జాసన్ క్లార్ అంగీకరించారు. కోవిడ్‌కాలంలో ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థులందరినీ స్వదేశాలకు పంపించి వేసింది. ప్రస్తుతం కోవిడ్ పూర్వకాలంతో పోలిస్తే 10 శాతం మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియా వర్శిటీల్లో అధికంగా ఉన్నారని క్లార్ అన్నారు. వృత్తి విద్య, శిక్షణ సంస్థల్లో అయితే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏకంగా 50 శాతం అధికంగా ఉందన్నారు. విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి నాణ్యత లేని విద్యను అందిస్తున్నారని, ఆంగ్ల భాషలో ఏమాత్రం ప్రావీణ్యం లేని విద్యార్థులనూ చేర్చుకుంటున్నారని, ఆస్ట్రేలియాలో పని చేసుకునేందుకు వచ్చినవారికి విద్యార్థుల ముసులో ఆశ్రయం కల్పిస్తున్నారని క్లార్ ఆరోపించారు. 2025 నుంచి ప్రభుత్వ యూనివర్శిటీల్లో 1,45,000 మంది విదేశీ విద్యార్థులను మాత్రమే చేర్చుకుంటామని తెలిపారు. అలాగే ప్రైవేటు యూనివర్శిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 30 వేలకు పరిమితం చేస్తామని, వృత్తివిద్య, శిక్షణ సంస్థల్లో 95 వేల మందికి పరిమితం చేస్తున్నట్లు వివరించారు. -
ఉపాధి అవకాశాలపై ఈపీఎఫ్ఓ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రంగాలు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై 2019-20 సంవత్సరానికి ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నివేదిక విడుదల చేసింది. కాగా 50 శాతం ఉపాధి అవకాశాలను ఆతిథ్య రంగం, ఆర్థిక సంస్థలు కల్పించినట్లు పేర్కొంది. (2019-20) ఆర్థిక సంవత్సరానికి సంఘటిత రంగం 28.6శాతం ఉపాధి అవకాశాలు అధికంగా కల్పించినట్లు తెలిపింది. కాగా, అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించేందుకు ప్రభుత్వ కీలక సంస్కరణలు, జీఎస్టీ అంశాలు తోడ్పడ్డాయని అభిప్రాయపడింది. అయితే ఎక్కువ శాతం ఉద్యోగులు సంఘటిత రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. తక్కువ సంఖ్యలో అసంఘటిక రంగానికి ఉద్యోగులు మొగ్గు చూపుతున్నట్లు ఈపీఎఫ్ఓ అధికారి సునీల్ బర్తవాల్ పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు పెరిగినట్లు పేర్కొంది. నూతన సభ్యుల నమోదు గణాంకాలను ఈపీఎఫ్‌వో సంస్థ 2018 ఏప్రిల్ నుంచి ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు) -
ఫిబ్రవరిలో తగ్గిన ఉపాధి: ఈపీఎఫ్‌వో
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధి రేటు తగ్గింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వద్ద నూతన సభ్యుల నమోదు 10.34 లక్షలుగా నమోదైంది. కానీ, ఈ ఏడాది జనవరిలో నమోదైన నూతన సభ్యులు 10.71 లక్షల మందితో పోలిస్తే ఫిబ్రవరిలో తగ్గినట్టు తెలుస్తోంది. అయితే, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే.. నికరంగా 76.53 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ నమోదు రేటు 61.12 లక్షలతో పోలిస్తే మెరుగైనట్టు తెలుస్తోంది. నూతన సభ్యుల నమోదు గణాంకాలను ఈపీఎఫ్‌వో సంస్థ 2018 ఏప్రిల్ నుంచి ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తోంది. -
125 కోట్ల మందికి ఆధార్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉన్నట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించడం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. నిత్యం 3 కోట్ల పైచిలుకు ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ అభ్యర్థనలు నమోదవుతున్నాయని తెలిపింది. అలాగే ఆధార్ వివరాల అప్డేట్ అభ్యర్థనలు కూడా రోజుకు 3–4 లక్షల మేర వస్తున్నాయని వివరించింది. సీఎస్సీల్లో మళ్లీ ఆధార్ ఎన్రోల్మెంట్.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలో భాగమైన సీఎస్సీ ఈ–గవర్నెన్స్ సర్వీసెస్ సంస్థ మళ్లీ ఆధార్ రిజి స్ట్రేషన్, సంబంధిత సర్వీసులను ప్రారంభించింది. వచ్చే వారం దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తేనుంది. ఆధార్ ఎన్రోల్మెంట్, మార్పులు.. చేర్పులు వంటి సేవలు అందించేందుకు .. యూఐడీఏఐతో సీఎస్సీ ఎస్పీవీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.6 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ).. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఆన్లైన్ ప్రభుత్వ సర్వీసులను అందిస్తున్నాయి. డేటా లీకేజీ, నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని సీఎస్సీ ఆధార్ ఎన్రోల్మెంట్ సేవలు రెండేళ్ల క్రితం నిల్చిపోయాయి. -
రచ్చబండ కార్డులకు మంగళం
1,16,525 కార్డులు రద్దు? 7వ తేదీ వరకు తుది గడువు ఆ పై రద్దేనంటున్న అధికారులు రచ్చబండ కార్డులకు మంగళం పాడేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే రెండునెలలుగా సరుకులు నిలిపి వేసిన ఈ కార్డులను రద్దు చేస్తున్నట్టుగా మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. విశాఖపట్నం: కాంగ్రెస్ సర్కార్ రచ్చబండ-1, 2లలో సిటీ పరిధిలో 95వేలు, రూరల్ పరిధిలో 80వేలు రచ్చబండ కార్డులు జారీ చేశారు. తొలి విడతలో జారీ అయిన కార్డులు 90 శాతం తెల్లకార్డులుగా కన్వర్ట్ చేయగా, రెండవ విడతలో జారీ చేసిన కూపన్లు మాత్రం తెల్ల కార్డులుగా మార్చలేదు. ఫోటోలు, ఐరీస్, ఆధార్ కార్డు అప్లోడ్ కాని కార్డులు లక్షన్నర వరకు ఉండిపోయాయి. 70 శాతం మందికి సిబ్బంది నిర్లక్ష్య ఫలితంగా అప్లోడ్ కాలేని పరిస్థితి నెలకొంది. వీరికి జనవరి 1వ తేదీ నుంచి సరుకులు నిలిపి వేశారు. ఫోటోలు అప్లోడ్ చేసుకునేందుకు జనవరి-31వ తేదీ వరకు గడువునిచ్చారు. అయినా పోటోలు అప్లోడ్ కాని కార్డులు ఏకంగా లక్ష 16 525 ఉన్నాయి. వీటిలో రూరల్ పరిధిలో 44,495, సిటీ పరిధిలో 72,030 కార్డులున్నాయి. వీటికి ఫోటోలు, ఇతర వివరాలు అప్లోడ్ చేసేందుకు ఈ నెల 7వ తేదీ వరకు గడువునిచ్చారు. అప్పటికి అప్లోడ్ చేయించుకోకపోతే ఆపైన గడువుపెంచే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఆ తర్వాత అప్లోడ్ కాని కార్డులను రద్దు చేసే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు. అధికారులకు ఫోటోలు ఇతర వివరాలు అందజేసిన వారే ఎక్కువగా ఉన్నారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య ఫలితంగానే వీరు రేషన్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. 4.59 లక్షలయూనిట్లు తొలగింపు జిల్లాలో ఉన్న 11,15,625 లక్షల కార్డులుండగా, వివిధ కారణాలతో ఇప్పటికే 4,59,815 యూనిట్స్ (మంది)ని కాార్డుల నుంచి తొలగించేశారు. వీరికి సరుకుల పంపిణీని కూడా నిలిపి వేశారు. యూఐడీ సీడింగ్ కాని వారు 2,93,920 (యూనిట్స్) మంది ఉన్నారు. వీరికి కూడా ఈ నెల 7వ తేదీవరకు గడువునిచ్చారు. ఈలోగా ఆధార్ సీడింగ్ చేయించుకోకపోతే వీరికి కూడా సరుకులు నిలిపివేసే అవకాశాలున్నాయి. ఎందుకు జరగలేదంటే.. ఎన్రోల్మెంట్ ఐడీ ఉన్న వారికి ఆటోమేటిక్‌గా యూఐడీ సీడింగ్ నెంబర్ జారీఅవుతుంది. జిల్లాలో లక్షలాది మందికి యూఐడీ నెంబర్ జనరేట్ కాలేదు. ఆధార్ కేంద్రంలో మళ్లీ నమోదుకు వెళ్తే ఎన్రోల్ చేసుకునేందుకు వీలుపడటం లేదు. ప్రశ్నిస్తే గతంలో రెండుమూడుసార్లు నమోదు చేయించుకుని ఉంటే..వాటిలో ఏదోక సందర్భంలో యూఐడీ నెంబర్ జనరేట్ అయి ఉంటుంది..అందువలనే ఇలా జరుగుతోందని సిబ్బంది బదులిస్తున్నారు. ఆధార్ నమోదు చేయించుకునే అవకాశం లేక. యూఐడీ నెంబర్ జనరేట్‌కాక జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదారు లక్షల మంది ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. రేషన్‌కార్డులో యూఐడీ సీడింగ్ చేయించుకోని వారిలో ఎక్కువ మంది వీరే ఉంటారని అంచనావేస్తున్నారు.స్పెషల్‌సాప్ట్‌వేర్ ద్వారా ఈనెంబర్లను సేకరించేందుకు ఇటీవల జిల్లా యంత్రాంగం ప్రయత్నించినా ఫలించ లేదు. -
అన్నింటికీ ఆ‘ఢర్’..
సంక్షేమ పథకాలతో ఆధార్ లింక్ జనవరి 1 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తోంది. సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్ లింక్ పెడుతోంది. ఆధార్‌ను అడ్డం పెట్టుకుని పేదలకు సంక్షేమ ఫలాలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. జిల్లా జనాభాకు..ఆధార్ ఎన్రోల్మెంట్, జనరేట్ అయిన ఆధార్ నంబర్లకు పొంతన లేకున్నా శత శాతం ఆధార్ జరిగినట్టుగా కాకిలెక్కలు వేస్తూ సంక్షేమ పథకాలకు వర్తింప చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. గతంలో అమలు చేసి విఫలమైన గ్యాస్‌కు నగదు బదిలీని జనవరి 1 నుంచి అమలు చేయనుంది. విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఆధార్ తప్పనిసరి చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా లెక్కచేయకుండా సంక్షేమ పథకాలను వర్తింపుజేస్తోంది. ప్రజల్లో ఆందోళన రేపుతోంది. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 42,90,589 మంది కాగా వారిలో మహిళలు 21,51,679 మంది, పురుషులు 21,38,910 మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 20,35,922 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 22,54,667 మంది ఉన్నట్టుగా ప్రకటించారు. జనాభా లెక్కలు ఇలా ఉంటే. జిల్లాలో ఇప్పటివరకు 44,40,240 మంది ఆధార్ కోసం ఎన్రోల్ చేసుకోగా, వాటిలో 17,62,725మంది అర్బన్ప్రాంతాల్లోనూ, 26,77,515 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఎన్రోల్ చేసుకున్నారు. ఇప్పటివరకు అర్బన్ ప్రాంతాల్లో 13,52,419 మందికి, గ్రామీణప్రాంతాల్లో 26,06,348 మందికి ఆధార్ కార్డులు జనరేట్ అయ్యాయి. జిల్లా జనాభాకు ఆధార్ ఎన్రోల్మెంట్, జనరేట్ అయిన కార్డుల సంఖ్యకు పొంతన లేకుండా ఉంది. ఏవి సరైనవో..వేటిని ప్రామాణికంగా తీసుకోవాలో తెలియని అయోయమ పరిస్థితి నెలకొంది. ఎన్రోల్ చేసుకున్న వారిలో ఆధార్ సంఖ్య జనరేట్ అయిన వారి నిష్పత్తి జిల్లా సరాసరి 92శాతం కాగా, అర్బన్ ప్రాంతాల్లో 88శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 97 శాతం ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా ఆధార్ ఎన్రోల్ చేసుకోని వారి కోసం జిల్లాలో ఇంకా 16 పర్మినెంట్ ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేశారు. గ్యాస్‌కు నగదు బదిలీతో ఇక్కట్లు మొదలు జనవరి 1 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ అమల్లోకి వస్తుంది. జిల్లాలో 8,18,897 గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 7,32,317 కనెక్షన్లకు మాత్రమే ఆధార్ సీడింగ్ జరిగింది. మిగిలిన 86,580 మందిలో 45 వేలమందికి పైగా ఆధార్ నంబర్ జనరేట్కాలేదు. మరో 41,586మందికి అసలు ఆధార్ ఎన్‌రోల్‌మెంటే జరగలేదు. ఇక ఈ పథకం అమలుకు కీలకమైన అకౌంట్ సీడింగ్ కేవలం 48 శాతం వినియోగదారులకు మాత్రమే జరిగింది. దీంతో ఆధార్ సీడింగ్ కాని వారే కాదు.. అకౌంట్ సీడింగ్ కానీ వారిలో రోజులు గడుస్తున్న కొద్దీ ఆందోళన రెట్టింపవుతుంది. ఆధార్‌తో కార్డులకు మంగళం విశాఖసిటీతో పాటు విశాఖ రూరల్ జిల్లా పరిధిలో 11,26,649 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 39,84,288 యూనిట్స్ (మంది) ఉన్నాయి. ఇప్పటి వరకు 33,75, 537 యూనిట్స్‌కు ఆధార్ సీడింగ్ పూర్తయింది. 4,13,283 అన్‌సీడెడ్ యూనిట్లను తిరస్కరించారు. ఇప్పటి వరకు అధికారికంగా 9,50,336 రేషన్ కార్డులను పూర్తిగా తొలగించగా, వినియోగంలో ఉన్న కార్డుల్లో మరో 1,75,699 యూనిట్స్‌ను తొలగించారు. ఇంకా సీడింగ్ కాని యూనిట్స్ 1,25,519 ఉంటే, పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్ కోసం సస్పెండ్‌లో పెట్టినవి మరో 58,240 యూనిట్స్ ఉన్నాయి. అన్‌సీడెడ్ యూనిట్స్‌ను ఈ నెలాఖరులోగా సీడింగ్ చేయించుకోకుండే తొలగిస్తామని ఇప్పటికే ప్రకటించారు. విద్యార్థుల్లో ఆధార్ భయం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు 1-10 తరగతి చదువుతున్న 6,45,814 మంది విద్యార్థులుంటే ఇప్పటి వరకు 4,10,637 మంది విద్యార్థులకు ఆధార్ సీడింగ్ జరిగింది. ఇంకా 2,35,552 మందికి ఆధార్ సీడింగ్ జరగాల్సి ఉంది. వీరిలో గిరిజన ప్రాంతాల్లో 86,515 మంది ఉండగా, అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మరో 1.50 లక్షలమంది వరకు ఉన్నారు. సీడింగ్ కాని వారిలో లక్ష మందికి పైగా ఆధార్ నంబర్లు ఇంకా జనరేట్ కాలేదని చెబుతున్నారు. స్కాలర్షిప్లు పొందే వారంతా తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేసుకోవాలని చెప్పడంతో నంబర్ జనరేట్ కానీ విద్యార్థుల్లో గుబులు మొదలైంది. ఉపాధి కూలీల్లో ఆందోళన ఇక జిల్లాలో 4.67 లక్షల జాబ్‌కార్డులుంటే వాటి పరిధిలో 7,16,130 మంది ఉపాధి కూలీలున్నారు. వీరిలో 3.74 లక్షల మందికి ఆధార్ సీడింగ్ పూర్తికాగా, ఇంకా లక్షా 38 వేల 488 మందికి ఆధార్ సీడింగ్ జరగాల్సి ఉంది. ఆధార్ సీడింగ్ చేయించుకోలేని పక్షంలో యాక్టివ్ లేబర్ ఉపాధిని పొందే అర్హతను కోల్పోయే అవకాశాలున్నాయి. పౌష్టికాహారం అందేనా జిల్లాలో 4,952 అంగన్వాడీలుండగా, వాటి పరిధిలో జీరో నుంచి ఏడాది లోపు చిన్నారులు 9,392 మంది ఉండగా, ఇప్పటి వరకు 6515 మంది చిన్నారులకు మాత్రమే ఆధార్ సీడింగ్ జరిగింది. ఇక 55,287 మంది గర్భిణీలుండగా, 90 శాతం సీడింగ్ జరిగినట్టుగా చెబుతున్నారు. సీడింగ్ చేయించకుంటే వీరికి పౌష్టికాహారానికి కోత పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. పింఛన్‌దారుల్లో భయం జిల్లాలో 3.55లక్షల పింఛన్లుండగా, సుమారు 25వేల వరకు పింఛన్‌దారులకు సీడింగ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే అనర్హత పేరుతో 40వేల వరకు పింఛన్లకు కోత పెట్టిన ప్రభుత్వం సీడింగ్ బూచితో పైన పేర్కొన్న 25వేల పింఛన్లకు మంగళం పాడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇక జిల్లాలో 66,340 డ్వాక్రా సంఘాల పరిధిలో ఏడున్నర లక్షల మంది సభ్యులుగా ఉంటే సుమారు లక్ష మందికి పైగా డ్వాక్రా మహిళలకు ఆధార్ సీడింగ్ జరగలేదు. దీంతో సమీప భవిష్యత్‌లో వీరికి జీరో పర్సంట్ వడ్డీలతో పాటు మ్యాచింగ్ గ్రాంట్‌లో కోతపడే అవకాశాలున్నాయి. ఇక అన్నింటికి లింక్ పెడుతున్న వాహనాలకు సంబంధించి సీడింగ్ ఇప్పుడి ప్పుడే మొదలైంది. జిల్లాలో 4.5లక్షల ద్విచక్ర వాహనాలుంటే, 1.50 లక్షల కార్లు, మరో 4,500 వరకు భారీ వాహనాలున్నాయి. పెట్రోల్ బంకుల్లో వీటికి ఆధార్ సీడింగ్ ప్రారంభమైంది. అలాగే ఇంటిపన్నులు, కుళాయి పన్నులకు కూడా ఆధార్ సీడింగ్ మొదలైంది. మరో పక్క ట్యాక్స్పేయిర్స్కు కూడా ఆధార్ సీడింగ్ చేపట్టారు.