అన్నింటికీ ఆ‘ఢర్’.. | Aadhaar linked with schemes | Sakshi
Sakshi News home page

అన్నింటికీ ఆ‘ఢర్’..

Published Tue, Dec 23 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

అన్నింటికీ ఆ‘ఢర్’..

అన్నింటికీ ఆ‘ఢర్’..

సంక్షేమ పథకాలతో ఆధార్ లింక్
జనవరి 1 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ

 
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తోంది. సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్ లింక్ పెడుతోంది. ఆధార్‌ను అడ్డం పెట్టుకుని పేదలకు సంక్షేమ ఫలాలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. జిల్లా జనాభాకు..ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, జనరేట్ అయిన ఆధార్ నంబర్లకు పొంతన లేకున్నా శత శాతం ఆధార్ జరిగినట్టుగా కాకిలెక్కలు వేస్తూ సంక్షేమ పథకాలకు వర్తింప చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. గతంలో అమలు చేసి విఫలమైన గ్యాస్‌కు నగదు బదిలీని జనవరి 1 నుంచి అమలు చేయనుంది.
 
విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఆధార్ తప్పనిసరి చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా లెక్కచేయకుండా సంక్షేమ పథకాలను వర్తింపుజేస్తోంది. ప్రజల్లో ఆందోళన రేపుతోంది. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 42,90,589 మంది కాగా వారిలో మహిళలు 21,51,679 మంది, పురుషులు 21,38,910 మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 20,35,922 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 22,54,667 మంది ఉన్నట్టుగా ప్రకటించారు. జనాభా లెక్కలు ఇలా ఉంటే. జిల్లాలో ఇప్పటివరకు 44,40,240 మంది ఆధార్ కోసం ఎన్‌రోల్ చేసుకోగా, వాటిలో 17,62,725మంది అర్బన్‌ప్రాంతాల్లోనూ, 26,77,515 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఎన్‌రోల్ చేసుకున్నారు. ఇప్పటివరకు అర్బన్ ప్రాంతాల్లో 13,52,419 మందికి, గ్రామీణప్రాంతాల్లో 26,06,348 మందికి ఆధార్ కార్డులు జనరేట్ అయ్యాయి. జిల్లా జనాభాకు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, జనరేట్ అయిన కార్డుల సంఖ్యకు పొంతన లేకుండా ఉంది. ఏవి సరైనవో..వేటిని ప్రామాణికంగా తీసుకోవాలో తెలియని అయోయమ పరిస్థితి నెలకొంది. ఎన్‌రోల్ చేసుకున్న వారిలో ఆధార్ సంఖ్య జనరేట్ అయిన వారి నిష్పత్తి జిల్లా సరాసరి 92శాతం కాగా, అర్బన్ ప్రాంతాల్లో 88శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 97 శాతం ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా ఆధార్ ఎన్‌రోల్  చేసుకోని వారి కోసం జిల్లాలో ఇంకా 16 పర్మినెంట్ ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
 
గ్యాస్‌కు నగదు బదిలీతో ఇక్కట్లు మొదలు


జనవరి 1 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ అమల్లోకి వస్తుంది. జిల్లాలో 8,18,897 గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 7,32,317 కనెక్షన్లకు మాత్రమే ఆధార్ సీడింగ్ జరిగింది. మిగిలిన 86,580 మందిలో 45 వేలమందికి పైగా ఆధార్ నంబర్ జనరేట్‌కాలేదు. మరో 41,586మందికి అసలు ఆధార్ ఎన్‌రోల్‌మెంటే జరగలేదు. ఇక ఈ పథకం అమలుకు కీలకమైన అకౌంట్ సీడింగ్ కేవలం 48 శాతం వినియోగదారులకు మాత్రమే జరిగింది. దీంతో ఆధార్ సీడింగ్ కాని వారే కాదు.. అకౌంట్ సీడింగ్ కానీ వారిలో రోజులు గడుస్తున్న కొద్దీ ఆందోళన రెట్టింపవుతుంది.

ఆధార్‌తో కార్డులకు మంగళం

విశాఖసిటీతో పాటు విశాఖ రూరల్ జిల్లా పరిధిలో 11,26,649 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 39,84,288 యూనిట్స్ (మంది) ఉన్నాయి. ఇప్పటి వరకు 33,75, 537 యూనిట్స్‌కు ఆధార్ సీడింగ్ పూర్తయింది. 4,13,283 అన్‌సీడెడ్ యూనిట్లను తిరస్కరించారు. ఇప్పటి వరకు అధికారికంగా 9,50,336 రేషన్ కార్డులను పూర్తిగా తొలగించగా, వినియోగంలో ఉన్న కార్డుల్లో మరో 1,75,699 యూనిట్స్‌ను తొలగించారు. ఇంకా సీడింగ్ కాని యూనిట్స్ 1,25,519 ఉంటే, పెండింగ్ ఫర్ కన్‌ఫర్మేషన్ కోసం సస్పెండ్‌లో పెట్టినవి మరో 58,240 యూనిట్స్ ఉన్నాయి. అన్‌సీడెడ్ యూనిట్స్‌ను ఈ నెలాఖరులోగా సీడింగ్ చేయించుకోకుండే తొలగిస్తామని
ఇప్పటికే ప్రకటించారు.
 
విద్యార్థుల్లో ఆధార్ భయం
 
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు 1-10 తరగతి చదువుతున్న 6,45,814 మంది విద్యార్థులుంటే ఇప్పటి వరకు 4,10,637 మంది విద్యార్థులకు ఆధార్ సీడింగ్ జరిగింది. ఇంకా 2,35,552 మందికి ఆధార్ సీడింగ్ జరగాల్సి ఉంది. వీరిలో గిరిజన ప్రాంతాల్లో 86,515 మంది ఉండగా, అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మరో 1.50 లక్షలమంది వరకు ఉన్నారు. సీడింగ్ కాని వారిలో లక్ష మందికి పైగా ఆధార్ నంబర్లు ఇంకా జనరేట్ కాలేదని చెబుతున్నారు. స్కాలర్‌షిప్‌లు పొందే వారంతా తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేసుకోవాలని చెప్పడంతో నంబర్ జనరేట్ కానీ విద్యార్థుల్లో గుబులు మొదలైంది.

 ఉపాధి కూలీల్లో ఆందోళన

 ఇక జిల్లాలో 4.67 లక్షల జాబ్‌కార్డులుంటే వాటి పరిధిలో 7,16,130 మంది ఉపాధి కూలీలున్నారు. వీరిలో 3.74 లక్షల మందికి ఆధార్ సీడింగ్ పూర్తికాగా, ఇంకా లక్షా 38 వేల 488 మందికి ఆధార్ సీడింగ్ జరగాల్సి ఉంది. ఆధార్ సీడింగ్ చేయించుకోలేని పక్షంలో యాక్టివ్ లేబర్ ఉపాధిని పొందే అర్హతను కోల్పోయే అవకాశాలున్నాయి.
 
పౌష్టికాహారం అందేనా

     
జిల్లాలో 4,952 అంగన్‌వాడీలుండగా, వాటి పరిధిలో జీరో నుంచి ఏడాది లోపు చిన్నారులు 9,392 మంది ఉండగా, ఇప్పటి వరకు 6515 మంది చిన్నారులకు మాత్రమే ఆధార్ సీడింగ్ జరిగింది. ఇక 55,287 మంది గర్భిణీలుండగా, 90 శాతం సీడింగ్ జరిగినట్టుగా చెబుతున్నారు. సీడింగ్ చేయించకుంటే వీరికి పౌష్టికాహారానికి కోత పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
 
పింఛన్‌దారుల్లో భయం

     
జిల్లాలో 3.55లక్షల పింఛన్లుండగా, సుమారు 25వేల వరకు పింఛన్‌దారులకు సీడింగ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే అనర్హత పేరుతో 40వేల వరకు పింఛన్లకు కోత పెట్టిన ప్రభుత్వం సీడింగ్ బూచితో పైన పేర్కొన్న 25వేల పింఛన్లకు మంగళం పాడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇక జిల్లాలో 66,340 డ్వాక్రా సంఘాల పరిధిలో ఏడున్నర లక్షల మంది సభ్యులుగా ఉంటే సుమారు లక్ష మందికి పైగా డ్వాక్రా మహిళలకు ఆధార్ సీడింగ్ జరగలేదు. దీంతో సమీప భవిష్యత్‌లో వీరికి జీరో పర్సంట్ వడ్డీలతో పాటు మ్యాచింగ్ గ్రాంట్‌లో కోతపడే అవకాశాలున్నాయి.
     
ఇక అన్నింటికి లింక్ పెడుతున్న వాహనాలకు సంబంధించి సీడింగ్ ఇప్పుడి ప్పుడే మొదలైంది. జిల్లాలో 4.5లక్షల ద్విచక్ర వాహనాలుంటే, 1.50 లక్షల కార్లు, మరో 4,500 వరకు భారీ వాహనాలున్నాయి. పెట్రోల్ బంకుల్లో వీటికి ఆధార్ సీడింగ్ ప్రారంభమైంది. అలాగే ఇంటిపన్నులు, కుళాయి పన్నులకు కూడా ఆధార్ సీడింగ్ మొదలైంది. మరో పక్క ట్యాక్స్‌పేయిర్స్‌కు కూడా ఆధార్ సీడింగ్ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement