ఆధార్ బేజార్
- పింఛన్‌దారులకు శాపమవుతున్న అనుసంధానం
- నమోదుకు 2,34,124 మంది దూరం
- నాలుగు నెలలుగా అందని పింఛన్లు
ఆధార్ మళ్లీ జనాన్ని బేజారెత్తిస్తోంది. సంక్షేమ పథకాలకు మరోసారి గుదిబండ అవుతోంది. వివిధ పథకాల లబ్ధిదారుల భారాన్ని తగ్గించుకోవడానికి ఇది ప్రభుత్వం కొత్త ఎత్తుగడ అన్న వాదన వ్యక్తమవుతోంది. పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం మళ్లీ తెరపైకి దీనిని తీసుకొస్తోంది. ఇప్పటికే పెన్షన్, ఉపాధి హామీ పథకాల చెల్లింపులకు బయోమెట్రిక్ వ్యవహారం తలనొప్పిగా మారింది. నాలుగు నెలలుగా పెన్షన్, వేతనాలకు నోచుకోని దుస్థితి. తాజాగా ఆధార్‌తో ఈ పథకాలను అనుసంధానం చేయడంతో వేలాది మందికి ఇప్పట్లో పెన్షన్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
విశాఖ రూరల్ : దశల వారీగా అన్ని పథకాలను ఆధార్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని 44.38 లక్షల జనాభాలో 40.30 లక్షల మంది ఆధార్‌కార్డులు పొందినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆధార్‌తో అనుసంధానంతో బోగస్ పింఛన్‌దారులను నియంత్రించవచ్చని సర్కారు భావిస్తోంది.
జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 1,46,224, అభయహస్తం 18,957, వికలాంగ 37,990, కల్లుగీత 926, వితంతు 1,15,027 మొత్తంగా 3,19,124 మంది పింఛనుదారులు ఉన్నారు. గతంలో ఫినో సంస్థ ద్వారా పింఛను చెల్లింపులు జరిగేవి. ప్రస్తుతం విశాఖ పరధిలో బ్యాంకు, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా చెల్లింపులకు నిర్ణయించారు. నాలుగు నెలలుగా బయోమెట్రిక్ ప్రక్రియ సాగుతోంది. నాటి నుంచి వేలాది మందికి పింఛన్లు అందకుండా పోయాయి. వేగంగా పెన్షన్‌దారుల వివరాలను సేకరించాలన్న నిర్ణయంతో ఏజెన్సీలో ఉపాధి హామీ చెల్లింపుల కోసం కార్మికులకు చేపడుతున్న బయోమెట్రిక్ ప్రక్రియను నిలిపివేసి మైదాన ప్రాంతాల్లో పింఛనుదారుల కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.
అయినప్పటికీ ఇంకా 29 వేల మంది నుంచి వివరాలు సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే గానీ వారికి పెన్షన్లు అందే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆధార్‌తో అనుసంధానం నిర్ణయం పింఛనుదారుల పాలిట శాపంగా మారింది. గతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సమయంలో కేవలం 85 వేల మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. మిగిలిన 2,34,124 మంది ఇంకా సీడింగ్ చేసుకోవాల్సి ఉంది.
రేషన్‌కార్డులకు అదే పరిస్థితి
రేషన్‌కార్డుల విషయంలో ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరిగా మారింది. జిల్లాలో అన్ని రకాల కార్డులు కలిపి మొత్తంగా 12.35 లక్షలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు కేవలం 45 శాతం మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. గతంలో ఆధార్‌పై సర్వత్రా నిరసనలు వ్యక్తమవ్వడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వాలు వెనక్కుతగ్గాయి. తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ ఆధార్‌ను తెరపైకి తీసుకురావడంతో మళ్లీ సీడింగ్ చేసుకోవాల్సి వస్తోంది. అనుసంధానానికి ఇప్పటి వరకు నిర్దుష్టమైన గడువు అధికారికంగా రానప్పటికీ వీలైనంత వేగంగా సీడింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.