రచ్చబండ కార్డులకు మంగళం
1,16,525 కార్డులు రద్దు?
7వ తేదీ వరకు తుది గడువు
ఆ పై రద్దేనంటున్న అధికారులు
రచ్చబండ కార్డులకు మంగళం పాడేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే రెండునెలలుగా సరుకులు నిలిపి వేసిన ఈ కార్డులను రద్దు చేస్తున్నట్టుగా మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
విశాఖపట్నం: కాంగ్రెస్ సర్కార్ రచ్చబండ-1, 2లలో సిటీ పరిధిలో 95వేలు, రూరల్ పరిధిలో 80వేలు రచ్చబండ కార్డులు జారీ చేశారు. తొలి విడతలో జారీ అయిన కార్డులు 90 శాతం తెల్లకార్డులుగా కన్వర్ట్ చేయగా, రెండవ విడతలో జారీ చేసిన కూపన్లు మాత్రం తెల్ల కార్డులుగా మార్చలేదు. ఫోటోలు, ఐరీస్, ఆధార్ కార్డు అప్‌లోడ్ కాని కార్డులు లక్షన్నర వరకు ఉండిపోయాయి. 70 శాతం మందికి సిబ్బంది నిర్లక్ష్య ఫలితంగా అప్‌లోడ్ కాలేని పరిస్థితి నెలకొంది. వీరికి జనవరి 1వ తేదీ నుంచి సరుకులు నిలిపి వేశారు. ఫోటోలు అప్‌లోడ్ చేసుకునేందుకు జనవరి-31వ తేదీ వరకు గడువునిచ్చారు. అయినా పోటోలు అప్‌లోడ్ కాని కార్డులు ఏకంగా లక్ష 16 525 ఉన్నాయి. వీటిలో రూరల్ పరిధిలో 44,495, సిటీ పరిధిలో 72,030 కార్డులున్నాయి. వీటికి ఫోటోలు, ఇతర వివరాలు అప్‌లోడ్ చేసేందుకు ఈ నెల 7వ తేదీ వరకు గడువునిచ్చారు. అప్పటికి అప్‌లోడ్ చేయించుకోకపోతే ఆపైన గడువుపెంచే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఆ తర్వాత అప్‌లోడ్ కాని కార్డులను రద్దు చేసే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు. అధికారులకు ఫోటోలు ఇతర వివరాలు అందజేసిన వారే ఎక్కువగా ఉన్నారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య ఫలితంగానే వీరు రేషన్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
4.59 లక్షలయూనిట్లు తొలగింపు
జిల్లాలో ఉన్న 11,15,625 లక్షల కార్డులుండగా, వివిధ కారణాలతో ఇప్పటికే 4,59,815 యూనిట్స్ (మంది)ని కాార్డుల నుంచి తొలగించేశారు. వీరికి సరుకుల పంపిణీని కూడా నిలిపి వేశారు. యూఐడీ సీడింగ్ కాని వారు 2,93,920 (యూనిట్స్) మంది ఉన్నారు. వీరికి కూడా ఈ నెల 7వ తేదీవరకు గడువునిచ్చారు. ఈలోగా ఆధార్ సీడింగ్ చేయించుకోకపోతే వీరికి కూడా సరుకులు నిలిపివేసే అవకాశాలున్నాయి.
ఎందుకు జరగలేదంటే..
ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఉన్న వారికి ఆటోమేటిక్‌గా యూఐడీ సీడింగ్ నెంబర్ జారీఅవుతుంది. జిల్లాలో లక్షలాది మందికి యూఐడీ నెంబర్ జనరేట్ కాలేదు. ఆధార్ కేంద్రంలో మళ్లీ నమోదుకు వెళ్తే ఎన్‌రోల్ చేసుకునేందుకు వీలుపడటం లేదు. ప్రశ్నిస్తే గతంలో రెండుమూడుసార్లు నమోదు చేయించుకుని ఉంటే..వాటిలో ఏదోక సందర్భంలో యూఐడీ నెంబర్ జనరేట్ అయి ఉంటుంది..అందువలనే ఇలా జరుగుతోందని సిబ్బంది బదులిస్తున్నారు. ఆధార్ నమోదు చేయించుకునే అవకాశం లేక. యూఐడీ నెంబర్ జనరేట్‌కాక జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదారు లక్షల మంది ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. రేషన్‌కార్డులో యూఐడీ సీడింగ్ చేయించుకోని వారిలో ఎక్కువ మంది వీరే ఉంటారని అంచనావేస్తున్నారు.స్పెషల్‌సాప్ట్‌వేర్ ద్వారా ఈనెంబర్లను సేకరించేందుకు ఇటీవల జిల్లా యంత్రాంగం ప్రయత్నించినా ఫలించ లేదు.