పుట్లూరు : అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం తమ భూములకు అందించే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత నెల రోజులుగా ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసిన అధికారులు మండలంలోని దోశలేడు, కడవకల్లు, కందికాపుల, గాండ్లపాడు రెవిన్యూ గ్రామాల్లో రోడ్డు మార్గం వెళ్లే సర్వే నంబర్లను గుర్తించారు.
తాము అరటి పంట సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని భూములను కోల్పోతే జీవనాధారం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే చేయడానికి ముందు అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం సేకరించే భూములకు ఎంత పరిహారం ఇస్తారన్న విషయంపై తమకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము సర్వే చేస్తున్నామని వారు రైతులకు తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న రైతులు భూములకు అందించే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని వినతి పత్రం అందించారు. స్థానిక భూ విలువను బట్టి పరిహారం అందించాలన్నారు.