సాక్షి, పుట్లూరు(అనంతపురం) : ప్రజలకు మెరుగైన సేవలందించిన పుట్లూరు పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రకటించిన ఉత్తమ పోలీసు స్టేషన్‌ల జాబితాలో పుట్లూరు స్టేషన్ 23వ స్థానం దక్కించుకుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధిత సమస్యలు ఓపిగ్గా వినడం, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడం, స్టేషన్‌లో మెరుగైన సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పుట్లూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.
ఎస్‌ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పుట్లూరు పోలీస్‌స్టేషన్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన విధానం పరిశీలించారు. సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల కోసం రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు, స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకర వాతావరణంతో పాటు పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అలాగే పోలీసులు తీరుపై మండలంలోని ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించగా మెజార్టీ శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం బృందం పుట్లూరు పోలీస్ స్టేషన్‌ను ఆదర్శ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేసింది. ఈమేరకు దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌లలో పుట్లూరు పోలీస్ స్టేషన్‌కు 23వ స్థానం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అదనపు ఎస్పీ చౌడేశ్వరి మాట్లాడుతూ, పుట్లూరు పోలీసు స్టేషన్‌ను దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం అనేక సంస్కరణలు అమలు చేసినట్లు తెలిపారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లను ఆదర్శ పోలీస్‌స్టేషన్లుగా తీర్చిదిద్దుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment