క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో కొంతమంది అధికారులు దారితప్పారు. దొరికిన చోట దొరికినంత తీసుకుని జేబులు నింపుకుంటున్నారు. ఏఆర్ విభాగంలోని ఓ అధికారి అయితే మరీ దిగజారిపోయాడు. కిందిస్థాయి సిబ్బందితో మామూళ్లు తీసుకుంటున్నారు. తాజాగా సదరు ఆర్‌ఐ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం సదరు అధికారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. – అనంతపురం సెంట్రల్
సాక్షి, అనంతపురం: పోలీసుశాఖలో ఏఆర్(ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్సు) విభాగం కీలకమైంది. ఎక్కడ ఏం జరిగినా.. వీరి సేవలనే వినియోగించుకుంటారు. బందోబస్తు బాధ్యతలే కాకుండా వీవీఐపీల భద్రత కూడా వీరే చూసుకుంటున్నారు. అయితే ఆ శాఖలోని ఓ ఆర్‌ఐ(రిజర్వ్ ఇన్‌స్పెక్టర్) అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యులకు పీఎస్‌ఓ(పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు)గా పనిచేస్తున్న సిబ్బంది నుంచి ఆర్‌ఐ నెలనెలా మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా ఏఆర్‌లో తన దందా నడిపించాడు. పీఎస్‌ఓలుగా వెళ్లాలన్నా, అక్కడ కొనసాగాలన్నా సదరు ఆర్‌ఐకి నెలనెలా మామూళ్లు ఇవ్వాల్సిందే. ముడుపులు ముడితే అంతా ఆయనే చూసుకుంటారు. ఇటీవల అత్యాశకు పోయి విధుల్లో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన ఇద్దరు పీఎస్‌ఓలతో భారీగా డబ్బు దండుకోవడంతో ఆయన అక్రమాల బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఎస్పీ గన్‌మెన్‌లను తొలగించినా...
తాడిపత్రిలో కొన్నేళ్లుగా రౌడీరాజ్యానికి నాయకత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవిపై ఇటీవల ఎస్పీ సత్యయేసుబాబు పీడీ యాక్టు ప్రయోగించారు. ఎలాంటి పదవి లేకపోయినా అప్పటికే తన గురువుల పలుకుబడితో పొట్టి రవి ప్రత్యేకంగా గన్‌మెన్ సౌకర్యం పొందాడు. అయితే అతను అనేక దాడులు, హత్యాయత్నాలు, మారణాయుధాలు కలిగిన కేసుల్లో నిందితుడు కావడంతో ఇటీవల ఎస్పీ సత్యయేసుబాబు కఠిన చర్యలు తీసుకున్నారు. గన్‌మెన్ సౌకర్యాన్ని తొలగించారు. ఏఆర్ ఆర్‌ఐ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు.
నాలుగు నెలలుగా అజ్ఞాతంలో...
ఎస్వీ రవీంద్రారెడ్డికి గన్‌మెన్‌లుగా ఉన్న ఇద్దరు ఏఆర్ సిబ్బంది నాలుగు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రవీంద్రారెడ్డిపై పీడీ యాక్టు ప్రయోగించిన వెంటనే అతనికున్న గన్‌మెన్ సౌకర్యాన్ని ఎస్పీ ఉపసంహరించారు. ఈ క్రమంలో వెంటనే వారిని ఏఆర్‌కు పిలిపించుకొని రిపోర్టు చేయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత ఆర్‌ఐపై ఉన్నప్పటికీ ఆయన ఆ పనిచేయలేదు. ఎస్వీ రవీంద్రారెడ్డి వ్యవహారంపై గన్‌మెన్‌లుగా ఉన్న తమను కూడా విచారిస్తారన్న భయంతోనే.. మరే ఇతర కారణమో తెలియదు గానీ వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాలుగు నెలలుగా విధులకు కూడా హాజరుకావడం లేదు. వీరిని పర్యవేక్షించాల్సి ఆర్‌ఐ కూడా మిన్నకుండిపోయారు. దీని వెనుక తీవ్రమైన ఒత్తిళ్లతో పాటు భారీగా ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరు పీఎస్‌ఓలు దాదాపు నాలుగు నెలలుగా కనిపించకపోవడం.. అయినా ఆర్‌ఐ పట్టించుకోకపోవడం ఏఆర్‌లో దుమారం రేపుతోంది. దీని వెనుక ఏదైనా మంత్రాంగం నడిచిందా? అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment