ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అనంతపురం: ఆయన పేరులోనే ‘లక్ష్మీ’ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వ్యవహారశైలీ ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందం. పొరుగు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన కొన్నాళ్లకే అక్రమ వసూళ్లకు తెర లేపారు. ఏకంగా అక్రమ మద్యం సరఫరాదారులతో సమావేశం ఏర్పాటు చేసి.. నెల వారీ మామూళ్లు ఫిక్స్ చేశారు.
ప్రభుత్వం విడతల వారీగా మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటుండగా.. అందుకు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) హిందూపురం సీఐ లక్ష్మీ దుర్గయ్య మాత్రం భిన్నంగా వెళ్లారు.సర్కారు లక్ష్యానికి తూట్లు పొడిచేలా అక్రమ వసూళ్లకు దిగారు. ఈ విషయం తెలిసి కంగుతిన్న ఉన్నతాధికారులు ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. లక్ష్మీదుర్గయ్య ఎక్సైజ్ శాఖలో సీఐగా పని చేసేవారు. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. సెబ్ ఏర్పాటుతో అందులో విలీనమయ్యారు.
సెబ్ సీఐగా కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టులో పనిచేస్తూ.. ఈ ఏడాది జూన్ 15న హిందూపురానికి బదిలీపై వచ్చారు. పని రాక్షసుడనే పేరున్న ఈయన మామూళ్లు వసూలు చేయడంలోనూ దిట్ట అని తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పనిచేసిన సమయంలో అప్పటి మద్యం సిండికేట్‌దారుల నుంచి డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. అయితే.. పంచలింగాల చెక్‌పోస్టులో పనిచేసిన సమయంలో విస్తృత తనిఖీలు నిర్వహించి, పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడం గమనార్హం.
అనతికాలంలోనే వసూళ్ల పర్వం
ఆంధ్ర–కర్ణాటక సరిహద్దున ఉండే హిందూపురంలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట పడటం లేదు. బెంగళూరు, బాగేపల్లి, చిక్‌బళ్లాపుర తదితర ప్రాంతాల నుంచి కొందరు కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వీరి ఆగడాలను కట్టడి చేయాల్సిన సెబ్ సీఐ లక్ష్మీదుర్గయ్య బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే వసూళ్ల బాట పట్టారు. అక్రమ మద్యం సరఫరాదారులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ మామూళ్లు నిర్ధారించడం కలకలం రేపింది.
తక్షణమే చర్యలు
అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారే వారితో చేతులు కలిపారని సమాచారం అందుకున్న సెబ్ ఉన్నతాధికారి రామమోహన్ రావు తక్షణమే చర్యలకు ఉపక్రమించారు. ఆయన్ను విధుల నుంచి తప్పించి.. జిల్లా ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆయనపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అనంతరం చర్యలు తీసుకునే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment