circle inspectors transfers
-
సారు పేరులోనే ‘లక్ష్మీ’ కళ.. వసూళ్లలో డిఫరెంట్ స్టైల్
సాక్షి, అనంతపురం: ఆయన పేరులోనే ‘లక్ష్మీ’ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వ్యవహారశైలీ ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందం. పొరుగు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన కొన్నాళ్లకే అక్రమ వసూళ్లకు తెర లేపారు. ఏకంగా అక్రమ మద్యం సరఫరాదారులతో సమావేశం ఏర్పాటు చేసి.. నెల వారీ మామూళ్లు ఫిక్స్ చేశారు. ప్రభుత్వం విడతల వారీగా మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటుండగా.. అందుకు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) హిందూపురం సీఐ లక్ష్మీ దుర్గయ్య మాత్రం భిన్నంగా వెళ్లారు.సర్కారు లక్ష్యానికి తూట్లు పొడిచేలా అక్రమ వసూళ్లకు దిగారు. ఈ విషయం తెలిసి కంగుతిన్న ఉన్నతాధికారులు ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. లక్ష్మీదుర్గయ్య ఎక్సైజ్ శాఖలో సీఐగా పని చేసేవారు. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. సెబ్ ఏర్పాటుతో అందులో విలీనమయ్యారు. సెబ్ సీఐగా కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టులో పనిచేస్తూ.. ఈ ఏడాది జూన్ 15న హిందూపురానికి బదిలీపై వచ్చారు. పని రాక్షసుడనే పేరున్న ఈయన మామూళ్లు వసూలు చేయడంలోనూ దిట్ట అని తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పనిచేసిన సమయంలో అప్పటి మద్యం సిండికేట్‌దారుల నుంచి డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. అయితే.. పంచలింగాల చెక్‌పోస్టులో పనిచేసిన సమయంలో విస్తృత తనిఖీలు నిర్వహించి, పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడం గమనార్హం. అనతికాలంలోనే వసూళ్ల పర్వం ఆంధ్ర–కర్ణాటక సరిహద్దున ఉండే హిందూపురంలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట పడటం లేదు. బెంగళూరు, బాగేపల్లి, చిక్‌బళ్లాపుర తదితర ప్రాంతాల నుంచి కొందరు కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వీరి ఆగడాలను కట్టడి చేయాల్సిన సెబ్ సీఐ లక్ష్మీదుర్గయ్య బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే వసూళ్ల బాట పట్టారు. అక్రమ మద్యం సరఫరాదారులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ మామూళ్లు నిర్ధారించడం కలకలం రేపింది. తక్షణమే చర్యలు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారే వారితో చేతులు కలిపారని సమాచారం అందుకున్న సెబ్ ఉన్నతాధికారి రామమోహన్ రావు తక్షణమే చర్యలకు ఉపక్రమించారు. ఆయన్ను విధుల నుంచి తప్పించి.. జిల్లా ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆయనపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అనంతరం చర్యలు తీసుకునే అవకాశముంది. చదవండి: రాహుల్ హత్య: చార్జర్ వైర్‌తో చంపేశారు -
వాస్తు దోషం..! సీఐ పోస్టు ఖాళీ
‘మంచిర్యాల ఎస్‌హెచ్‌వోగా ఎడ్ల మహేష్ 18 నెలలపాటు పనిచేశారు. ఆయన సమర్థవంతమైన సేవలందించినా.. భూ దందాలో ఆరోపణలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆయన బదిలీ తర్వాత ఖమ్మం జిల్లాలో టాస్స్‌ఫోర్స్ విభాగంలో పని చేసిన బిల్ల తిరుపతిరెడ్డిని ఇక్కడ నియమించారు. కానీ.. ఆయన మూడునెలలు మాత్రమే పనిచేశారు. రిక్వెస్ట్ బదిలీపై వరంగల్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా రూరల్‌లో పనిచేస్తున్న ఓ సీఐ, జిల్లాలోనే పనిచేస్తున్న మరో సీఐ ఇక్కడకు వచ్చేందుకు మొగ్గుచూపినట్లు తెల్సింది. అయితే ఇక్కడ పనిచేసినవారు ఎదుర్కొన్న ఆరోపణలు.. సస్పెండ్ కావడం.. ఆకస్మిక బదిలీ వంటి పరిణామాలను తెలుసుకుని ఇద్దరూ వెనుకడుగువేసినట్లు సమాచారం...’ ఇది మంచిర్యాల స్టేషన్ పరిస్థితి. సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ పోస్టుకు వాస్తుదోషం పట్టుకుంది. గతంలో పని చేసిన సీఐలు ఏదో ఒక ఆరోపణపై ఇక్కడినుంచి వెళ్లడంతో.. ఈ పోస్టులోకి రావడానికి సీఐలు జంకుతున్నారు. ఎస్హెచ్ఓ అంటే డిమాండ్ ఉన్నా.. రావడానికి మాత్రం ఇన్స్పెక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగా నెల రోజుల నుంచి పట్టణ సీఐ పోస్టు ఖాళీగా ఉంది. వాస్తు దోషమట..! మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన పోలీసు అధికారులను ఏదో ఆరోపణ చుట్టుముట్టడం సాధారణంగా మారింది. ఎస్హెచ్ఓ నుంచి ఏసీపీ వరకు ప్రతిఒక్కరూ ఏదో ఒక ఆరోపణ, వివాదాలతోనే బదిలీపై వెళ్లడం గమనార్హం. ఎస్హెచ్ఓ కావడంతో రాజకీయ నేతల పైరవీలతో ఉత్సాహంగా పోస్టింగ్ తెచ్చుకున్న సీఐలు.. ఆ తరువాత ఇక్కడి పరిస్థితులను చూసి మళ్లీ పైరవీలు చేయించుకుని బదిలీపై వెళ్లిన సందర్భాలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే.. పోలీస్‌స్టేషన్‌కు వాస్తు దోషముందనే ప్రచారం జరిగింది. సీఐలపై ఆరోపణలు రావడం.. వివాదాస్పదంగా బదిలీ కావడానికి పోలీసుస్టేషన్‌కు వాస్తు లేకపోవడమే కారణమని తేల్చారు. చివరగా సీఐగా పనిచేసిన తిరుపతిరెడ్డి పోలీసుస్టేషన్ వాస్తు ‘దోషాన్ని’ సరిచేసే ప్రయత్నం కూడా చేశారు. దక్షిణ వైపు ఉన్న ప్రవేశద్వారాన్ని ఉత్తరం దిశగా మార్చారు. అయినా ఆయన రిక్వెస్ట్‌పై బదిలీ చేయించుకుని వెళ్లడం విశేషం. ల్యాండ్ సెటిల్మెంట్లు.. ఫైనాన్స్ పంచాయితీలు పట్టణ సీఐలు వివాదాల్లో ఇరుక్కోవడానికి ప్రధానంగా ల్యాండ్ సెటిల్మెంట్లు, ఫైనాన్స్ పంచాయితీలే కారణంగా కనిపిస్తున్నాయి. జిల్లాకేంద్రమైన తరువాత మంచిర్యాల శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అమాంతంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వెంచర్లు వెలిశాయి. ఈ క్రమంలోనే భూ వివాదాలు మొదలయ్యాయి. ముఠాలుగా ఏర్పడి భూ వివాదాలు సృష్టించడం.. ఆ తరువాత సెటిల్మెంట్ల పేరిట లక్షల రూపాయలు దండుకోవడం కొన్ని ముఠాలకు సాధారణమైంది. ఇందులో రాజకీయనేతలు కూడా ఉండడంతో వివాదాలు పోలీసు అధికారుల మెడకు చుట్టుకున్నాయనే ప్రచారం ఉంది. పోలీసు అధికారుల సహకారంతోనే రాజకీయనేతలు ల్యాండ్సెటిల్మెంట్లు చేస్తారనే ఆరోపణలున్నాయి. భూ ఆక్రమణదారులతో పోలీసులకు ఏర్పడుతున్న సంబంధాల కారణంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఆరోపణలపై శాఖాపరంగా విచారణ జరిపించడం.. ఆ తరువాత బదిలీ చేయడం నిత్యకృత్యమైంది. ల్యాండ్ సెటిల్మెంట్లతో పాటు ఫైనాన్స్ పంచాయితీల్లో కూడా కొంతమంది పోలీసులు జోక్యం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఏ సీఐ వచ్చినా కొద్దిరోజుల్లోనే ఆరోపణలు ఎదుర్కోవడం సర్వసాధారణమైంది. గతంలో ఇక్కడ పనిచేసిన సుధాకర్, ఏసీపీ చెన్నయ్యతోపాటు అప్పటి డీసీపీ జాన్‌వెస్లీ భూ తాగాదాల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలీసు భాగోతాలపై అప్పట్లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలతో అప్పటి కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ తీవ్రంగా స్పందించారు. తరువాత పరిణామాల్లో ముగ్గురు అధికారులు బదిలీ అయ్యారు. సీఐ సుధాకర్ బదిలీ తరువాత వచ్చిన వేణుచందర్ రెండు నెలలు మాత్రమే పనిచేసి బదిలీ చేయించుకుని మరీ మణుగూరు వెళ్లిపోయారు. వేణుచందర్ తరువాత పెద్దపల్లి నుంచి వచ్చిన ఎడ్ల మహేష్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించినట్లు పేరుంది. కాని భూ వివాదాల్లో వస్తున్న ఒత్తిడిని అధిగమించేందుకు మందమర్రికి బదిలీపై వెళ్లారు. మహేష్ స్థానంలో తిరుపతిరెడ్డి జూన్ 24న ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు చేపట్టారు. కేవలం మూడు నెలల్లోనే (సెప్టెంబర్ 4న) బదిలీపై వెళ్లారు. నెలరోజులుగా ఖాళీ.. మంచిర్యాల నుంచి తిరుపతిరెడ్డి బదిలీపై వెళ్లినప్పటినుంచి ఇక్కడకు ఎవరినీ బదిలీ చేయలేదు. జిల్లాకేంద్రంలో ఉన్న ఏౖకైక పోలీసు స్టేషన్‌కు ఎస్హెచ్ఓ పోస్టు ఖాళీగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పట్టణ జనాభా 1.30లక్షలకు పైగా ఉంది. ఇక్కడ నేరాల సంఖ్యా అధికమే. దొంగతనాలు, భూ వివాదాలు, ఫైనాన్స్ తగాదాలు అధికంగా జరుగుతుంటాయి. జిల్లా కేంద్రం కావడంతో ప్రముఖుల పర్యటనకు బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది. రోజుకు 25 రకాల కేసులు వస్తుంటాయి. విచారణ అనంతరం నమోదు చేసిన కేసులు ఏడాదికి ఆరువందల వరకు ఉంటాయి. శ్రీరాంపూర్ ఎస్సై రెండు నెలలుగా ఖాళీ మంచిర్యాల తరహాలోనే శ్రీరాంపూర్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ పోస్టు కూడా రెండు నెలలుగా ఖాళీగా ఉంది. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన కటిక రవిప్రసాద్ ఆగస్టు 16న బదిలీపై మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు వెళ్లారు. అప్పటినుంచి ఎస్సైగా ఎవరూ బాధ్యతలు చేపట్టలేదు. ఇక్కడ సీఐ ఉన్నప్పటికీ ఎస్సై ఎస్హెచ్ఓ కావడంతో.. రెండు నెలలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
‘వసూల్ రాజా’పై సీపీ సీరియస్
కుత్బుల్లాపూర్: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జగద్గిరిగుట్ట సీఐ శ్రీనివాసులును కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఇన్చార్జ్ సీఐగా గంగారెడ్డిని నియమిస్తూ సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ బాలాపూర్‌లో నిర్మిస్తున్న భవనానికి కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన పలువురి నుంచి భవన నిర్మాణ సామాగ్రిని తరలించినట్లు ఆరోపణలు రావడంతో ‘సాక్షి’లో మంగళవారం ‘వసూల్ రాజా’ పేరుతో కథనం ప్రచురితమైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీపీ విచారణకు ఆదేశిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులును సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో బాలానగర్ స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న గంగారెడ్డిని నియమించారు. హెడ్ కానిస్టేబుల్‌తో పాటు డ్రైవర్ పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. ఆది నుంచి వివాదాస్పదంగానే.. జగద్గిరిగుట్ట సీఐగా 2018 సెప్టెంబర్ 13న బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు వివాదాస్పదుడిగా ముద్ర వేసుకున్నాడు. భూదేవి హిల్స్ మొదలు, కైసర్‌నగర్ వరకు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జగద్గిరిగుట్టలో గుట్కా, పాన్ పరాగ్‌లు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మోసపోయి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాలికకు న్యాయం చేయకపోగా నిందితుడికే వత్తాసు పలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం పేకాట రాయుళ్ల నుంచి భారీగా వసూలు చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు సీఐలు అవినీతి ఆరోపణలపై బదిలీ కాగా శ్రీనివాసులు బదిలీతో వారి సంఖ్య మూడుకు చేరింది. -
ఎన్నికల విధుల నుంచి మదనపల్లె సీఐ తొలగింపు
సాక్షి, మదనపల్లె : నిబంధనలు ఉల్లంఘించిన కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. మదనపల్లె టూ టౌన్ సీఐ సురేష్ కుమార్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 2వ తేదీన మదనపల్లెలో సీఎం పర్యటన సందర్భంగా స్థానిక నిమ్మనపల్లె మార్గం లో ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు ఆహార పొట్లాలు ప్యాక్‌చేసి అందజేస్తున్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని రాజంపేట పార్లమెంట్ అబ్జర్వర్ నవీన్‌కుమార్ ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారాన్ని చేరవేశారు. ఆర్ఐ పల్లవి సంఘటన స్థలానికి వెళ్లి సమాచారం వాస్తవమని ధ్రువీకరించి కేసు నమోదుకు సీఐ సురేష్ కుమార్‌కు సిఫారసు చేశారు. కేసు నమోదులో సీఐ అలసత్వం కనబరిచినందుకు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు. సురేష్ స్థానంలో అనంతపురం డీటీసీలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.సుబ్బరాయుడును నియమించారు. -
ఒత్తిడి తట్టుకోలేక బదిలీలు నిలిపివేసిన ఐజీ
పట్టు బిగిస్తున్న అధికార పార్టీ సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీల్లో పైరవీలు కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సిఫార్సులకు చెక్ పెడుతున్న ఇన్చార్జులు పోలీస్ శాఖతో అధికార పార్టీ బంతాట ఆడుతోంది. బదిలీల్లో తలదూరుస్తూ పట్టు చూపుతోంది. ప్రతిభ, సమర్థతను పక్కకు నెట్టి ఆధిపత్యాన్ని నిరూపించుకుంటోంది. తాజాగా రేంజ్ పరిధిలో మంగళవారం జరిగిన సర్కిల్ ఇన్స్పెక్టర్ల (సీఐలు) బదిలీలకు చెక్ పెట్టింది. కొత్త సీఐలను చేర్చుకోవద్దంటూ హుటాహుటిన హుకుం జారీ చేయించింది. బదిలీలు జరిగిన ప్రతిసారీ అధికార పార్టీ ఇదే దందాను అవలంబిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజారుస్తోంది. గుంటూరు : గుంటూరు పోలీస్ రేంజ్లో తాజా గా మంగళవారం ఏడుగురు సీఐలకు అటాచ్మెంట్లపై పోస్టింగ్‌లు కేటాయించారు. ప్రకాశం జిల్లాలో అధికార పార్టీలో ఉన్న గ్రూపు విభేదాల నేపథ్యంలో ఓ వర్గం నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి తెల్లవారేసరికి బదిలీలను నిలిపివేయించారు. తాము చెప్పేవరకు సీఐలను జాయిన్ చేసుకోవద్దంటూ ఆయా జిల్లాల ఎస్పీలకు ఐజీ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లేలా చేశారు. దీంతో కొత్త పోస్టింగ్‌లు పొందిన సీఐల ఆనందం ఒక్క రాత్రికే ఆవిరైంది. ప్రకాశం జిల్లాలోని అద్దంకి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, చీరాల, ఒంగోలు రూరల్ సర్కిళ్లలో పనిచేస్తున్న సీఐలకు మంగళవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా స్థానాల్లో కొత్త సీఐలకు అటాచ్మెంట్లపై పోస్టింగ్‌లు ఇచ్చారు. గుంటూరు అర్బన్ జిల్లాలో కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్న పట్టాభిపురం స్టేషన్‌కు సైతం అటాచ్‌మెంట్‌పై సీఐని నియమించారు. ఈ బదిలీలన్నీ అధికారపార్టీ నేతల సిఫారసు మేరకే చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు చెప్పినా పోస్టింగ్‌లు వేశారంటూ అక్కడి నియోజకవర్గ ఇన్చార్జులు రాత్రికి రాత్రి ఉన్నతస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దీంతో తెల్లవారే సరికి బదిలీలను నిలిపివేస్తూ రేంజ్ ఐజీ ఎన్. సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు అటాచ్‌మెంట్‌పై పోస్టింగ్‌లు పొందిన సీఐలను చేర్చుకోవద్దంటూ ఆయా జిల్లాల ఎస్పీలకు ఫోన్లు వెళ్ళాయి. దీంతో సీఐల బదిలీల్లో మరోమారు గందరగోళం నెలకొంది. అధికారపార్టీ నేతల ఆశీస్సులు ఉంటేనే పోస్టింగ్‌లు రేంజ్ పరిధిలో అధికారపార్టీ నేతల ఆశీస్సులు పొందిన వారికే పోస్టింగ్‌లు దక్కుతున్నాయనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. ఒకప్పుడు సీఐల బదిలీలు అంటే ఆ సర్కిల్ ప్రాధాన్యం, అధికారి పనితీరు ఆధారంగా జరిగేవి. ఈ తరహా బదిలీలకు టీడీపీ నేతలు అడ్డుకట్ట వేసేశారు. గతంలో పోలీస్ ఉన్నతాధికారులు ఇలాగే పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని చేసిన ప్రయత్నాలను టీడీపీ నేతలే అడ్డుకున్నారు. ఓ దశలో సీఐల బదిలీలు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయంటే ఇక్కడి అధికారపార్టీ నేతల దందా అర్థం చేసుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు అధికారపార్టీ నేతలు చెప్పిన వారికే పోస్టింగ్‌లు వేయడం గుట్టుగా నడిచేది. ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, సొంత పార్టీలో గ్రూపులు ఉన్న చోట్ల ఇరువురూ సీఐల పోస్టింగ్‌ల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు పోటీపడుతున్నారు. ఇది పోలీస్ ఉన్నతాధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మరో వైపు సమర్థత కలిగిన పోలీస్ అధికారులకు తగ్గ పోస్టింగ్ దక్కడం లేదు.