మంచిర్యాల పోలీస్‌స్టేషన్
‘మంచిర్యాల ఎస్‌హెచ్‌వోగా ఎడ్ల మహేష్ 18 నెలలపాటు పనిచేశారు. ఆయన సమర్థవంతమైన సేవలందించినా.. భూ దందాలో ఆరోపణలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆయన బదిలీ తర్వాత ఖమ్మం జిల్లాలో టాస్స్‌ఫోర్స్ విభాగంలో పని చేసిన బిల్ల తిరుపతిరెడ్డిని ఇక్కడ నియమించారు. కానీ.. ఆయన మూడునెలలు మాత్రమే పనిచేశారు. రిక్వెస్ట్ బదిలీపై వరంగల్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా రూరల్‌లో పనిచేస్తున్న ఓ సీఐ, జిల్లాలోనే పనిచేస్తున్న మరో సీఐ ఇక్కడకు వచ్చేందుకు మొగ్గుచూపినట్లు తెల్సింది. అయితే ఇక్కడ పనిచేసినవారు ఎదుర్కొన్న ఆరోపణలు.. సస్పెండ్ కావడం.. ఆకస్మిక బదిలీ వంటి పరిణామాలను తెలుసుకుని ఇద్దరూ వెనుకడుగువేసినట్లు సమాచారం...’ ఇది మంచిర్యాల స్టేషన్ పరిస్థితి.
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు వాస్తుదోషం పట్టుకుంది. గతంలో పని చేసిన సీఐలు ఏదో ఒక ఆరోపణపై ఇక్కడినుంచి వెళ్లడంతో.. ఈ పోస్టులోకి రావడానికి సీఐలు జంకుతున్నారు. ఎస్‌హెచ్‌ఓ అంటే డిమాండ్ ఉన్నా.. రావడానికి మాత్రం ఇన్‌స్పెక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగా నెల రోజుల నుంచి పట్టణ సీఐ పోస్టు ఖాళీగా ఉంది.
వాస్తు దోషమట..!
మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన పోలీసు అధికారులను ఏదో ఆరోపణ చుట్టుముట్టడం సాధారణంగా మారింది. ఎస్‌హెచ్‌ఓ నుంచి ఏసీపీ వరకు ప్రతిఒక్కరూ ఏదో ఒక ఆరోపణ, వివాదాలతోనే బదిలీపై వెళ్లడం గమనార్హం. ఎస్‌హెచ్‌ఓ కావడంతో రాజకీయ నేతల పైరవీలతో ఉత్సాహంగా పోస్టింగ్ తెచ్చుకున్న సీఐలు.. ఆ తరువాత ఇక్కడి పరిస్థితులను చూసి మళ్లీ పైరవీలు చేయించుకుని బదిలీపై వెళ్లిన సందర్భాలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే.. పోలీస్‌స్టేషన్‌కు వాస్తు దోషముందనే ప్రచారం జరిగింది. సీఐలపై ఆరోపణలు రావడం.. వివాదాస్పదంగా బదిలీ కావడానికి పోలీసుస్టేషన్‌కు వాస్తు లేకపోవడమే కారణమని తేల్చారు. చివరగా సీఐగా పనిచేసిన తిరుపతిరెడ్డి పోలీసుస్టేషన్ వాస్తు ‘దోషాన్ని’ సరిచేసే ప్రయత్నం కూడా చేశారు. దక్షిణ వైపు ఉన్న ప్రవేశద్వారాన్ని ఉత్తరం దిశగా మార్చారు. అయినా ఆయన రిక్వెస్ట్‌పై బదిలీ చేయించుకుని వెళ్లడం విశేషం.
ల్యాండ్ సెటిల్‌మెంట్లు.. ఫైనాన్స్ పంచాయితీలు
పట్టణ సీఐలు వివాదాల్లో ఇరుక్కోవడానికి ప్రధానంగా ల్యాండ్ సెటిల్‌మెంట్లు, ఫైనాన్స్ పంచాయితీలే కారణంగా కనిపిస్తున్నాయి. జిల్లాకేంద్రమైన తరువాత మంచిర్యాల శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అమాంతంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వెంచర్లు వెలిశాయి. ఈ క్రమంలోనే భూ వివాదాలు మొదలయ్యాయి. ముఠాలుగా ఏర్పడి భూ వివాదాలు సృష్టించడం.. ఆ తరువాత సెటిల్‌మెంట్ల పేరిట లక్షల రూపాయలు దండుకోవడం కొన్ని ముఠాలకు సాధారణమైంది. ఇందులో రాజకీయనేతలు కూడా ఉండడంతో వివాదాలు పోలీసు అధికారుల మెడకు చుట్టుకున్నాయనే ప్రచారం ఉంది. పోలీసు అధికారుల సహకారంతోనే రాజకీయనేతలు ల్యాండ్‌సెటిల్‌మెంట్లు చేస్తారనే ఆరోపణలున్నాయి. భూ ఆక్రమణదారులతో పోలీసులకు ఏర్పడుతున్న సంబంధాల కారణంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఆరోపణలపై శాఖాపరంగా విచారణ జరిపించడం.. ఆ తరువాత బదిలీ చేయడం నిత్యకృత్యమైంది. ల్యాండ్ సెటిల్‌మెంట్లతో పాటు ఫైనాన్స్ పంచాయితీల్లో కూడా కొంతమంది పోలీసులు జోక్యం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఏ సీఐ వచ్చినా కొద్దిరోజుల్లోనే ఆరోపణలు ఎదుర్కోవడం సర్వసాధారణమైంది.
గతంలో ఇక్కడ పనిచేసిన సుధాకర్, ఏసీపీ చెన్నయ్యతోపాటు అప్పటి డీసీపీ జాన్‌వెస్లీ భూ తాగాదాల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలీసు భాగోతాలపై అప్పట్లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలతో అప్పటి కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ తీవ్రంగా స్పందించారు. తరువాత పరిణామాల్లో ముగ్గురు అధికారులు బదిలీ అయ్యారు. సీఐ సుధాకర్ బదిలీ తరువాత వచ్చిన వేణుచందర్ రెండు నెలలు మాత్రమే పనిచేసి బదిలీ చేయించుకుని మరీ మణుగూరు వెళ్లిపోయారు. వేణుచందర్ తరువాత పెద్దపల్లి నుంచి వచ్చిన ఎడ్ల మహేష్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించినట్లు పేరుంది. కాని భూ వివాదాల్లో వస్తున్న ఒత్తిడిని అధిగమించేందుకు మందమర్రికి బదిలీపై వెళ్లారు. మహేష్ స్థానంలో తిరుపతిరెడ్డి జూన్ 24న ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు చేపట్టారు. కేవలం మూడు నెలల్లోనే (సెప్టెంబర్ 4న) బదిలీపై వెళ్లారు.
నెలరోజులుగా ఖాళీ..
మంచిర్యాల నుంచి తిరుపతిరెడ్డి బదిలీపై వెళ్లినప్పటినుంచి ఇక్కడకు ఎవరినీ బదిలీ చేయలేదు. జిల్లాకేంద్రంలో ఉన్న ఏౖకైక పోలీసు స్టేషన్‌కు ఎస్‌హెచ్‌ఓ పోస్టు ఖాళీగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పట్టణ జనాభా 1.30లక్షలకు పైగా ఉంది. ఇక్కడ నేరాల సంఖ్యా అధికమే. దొంగతనాలు, భూ వివాదాలు, ఫైనాన్స్ తగాదాలు అధికంగా జరుగుతుంటాయి. జిల్లా కేంద్రం కావడంతో ప్రముఖుల పర్యటనకు బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది. రోజుకు 25 రకాల కేసులు వస్తుంటాయి. విచారణ అనంతరం నమోదు చేసిన కేసులు ఏడాదికి ఆరువందల వరకు ఉంటాయి.
శ్రీరాంపూర్ ఎస్సై రెండు నెలలుగా ఖాళీ
మంచిర్యాల తరహాలోనే శ్రీరాంపూర్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ పోస్టు కూడా రెండు నెలలుగా ఖాళీగా ఉంది. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన కటిక రవిప్రసాద్ ఆగస్టు 16న బదిలీపై మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు వెళ్లారు. అప్పటినుంచి ఎస్సైగా ఎవరూ బాధ్యతలు చేపట్టలేదు. ఇక్కడ సీఐ ఉన్నప్పటికీ ఎస్సై ఎస్‌హెచ్‌ఓ కావడంతో.. రెండు నెలలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment